ప్రేమంటే!!!

కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!

హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ

హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే!

మనసు మనసు కలవడమే కాదు ప్రేమ
ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే!

తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ
తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే!

చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ
చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే!

భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!

అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ
కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!

ఎదురీత...

భయమన్నది నాకు తెలీదు
ఓటమి అనేదే నాకు లేదు

కెరటాలతో సంఘర్షణ నేర్చుకున్నా
ఎదురీది గెలుపుని కైవసం చేసుకున్నా

గాలిమేడలు ఎన్నడూ నేను కట్టుకోను
గుడిసెనే మహలుగా మలచుకుంటాను..

ఆలోచనలు ఉంటేనే సరిపోదు
ఆచరించకుండా ఏదీ సాధ్యం కాదు

కర్మ సిధ్ధాంతాలని వల్లించడంకన్న
లక్ష్యసాధనలో సాగిపోవడం మిన్న

బాటలోని ముళ్ళని చూసి భయపడితే
గమ్యంలోని పూలు నీకు దక్కవంతే..

చెదరిన కల!

క్షణమొక యుగమై సాగుతున్నది
మనసు మారాము చేస్తున్నది
నిదుర రాని నాకనులు నిన్నేకోరుతున్నవి!

నెలవంక నన్ను ప్రశ్నిస్తున్నది
వెన్నెల అంతా ఆవిరై పోతున్నది
ఎదురు చూసి నాకనులు కాయలు కాస్తున్నవి!

నా మనసు నీ చెంతన ఉన్నది
నీ మనసు నా మాట వినకున్నది
మదిన అలజడులు సుడులు తిరుగుతున్నవి!

ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
తలపులతో తనువు బరువౌతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువౌతున్నవి!

ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది
మరణం విజయ దరహాసం చేస్తున్నది

పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి!

స్వప్నం కూడా నిన్ను కాలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!

బాగుంటుంది!

పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుంది!
నిదురలోని ఊహా పుష్పాలు నిజ జీవితంలో విరబూస్తే విడ్డూరమౌతుంది!
హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!

మనసుకి ముసుగు వేయక మమతలని పంచే తోడుంటే ఎంత బాగుంటుంది!
ఆలోచనలని ఆచరణలో పెడితే చేరవలసిన గమ్యం చేరువౌతుంది!
మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటే మరింత బాగుంటుంది!

ఆశించి ఆదరించక, అభిమానంతో ఎవరైనా అక్కున చేర్చుకుంటే ఎంత బాగుంటుంది!
మంచితనాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తే మక్కువౌతుంది!
జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!