రావే నిద్ర..

నా నిద్ర నాకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు
సరికదా నా కలలు నాకు ద్రోహం చేస్తుంటే
వాటిని ఇది స్పర్శించి నిద్రాభంగం గావించి
అన్యాయంగా ఆశల్ని అదఃపాతాళానికి అణచి
పైగా నిద్రలేని నన్ను నిందితురాలిని చేస్తుంది!

నా నిద్ర నాతో ఎన్నడూ సఖ్యతగా ఉండదు
కనుపాపలతో రేయంతా సంభోగించనేలనంటే
పగలేమో కునికిపాట్లతో గురకను రమించమని
ఆ కర్ణకఠోర శబ్ధఘోషే యుగళగీతమనుకోమని
వెకిలిగా వాగుతూ ఒంటిపై వీరంగం చేస్తుంది!

నా నిద్ర నాకు ఎప్పుడూ విశ్రాంతిని ఇవ్వదు
కలలు చెదిరిపోయి నిద్రను కోల్పోవడం అంటే
ముక్కలైన ఆలోచనలు ముత్యాలుగా రాలి పొర్లి
ఏరుకుని మరోమారు మాలకట్టలేని ఆశలే దొర్లి
ఆరోగ్యాన్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుంది!

నా నిద్ర నాతో లేదని నేనెన్నడూ బాధపడలేదు
కలలు ఎన్నో వచ్చినట్లే వచ్చి సగంలో పోతుంటే
అర్థంకాకనే ఆదీ అంతమూలేక అదృశ్యమైపోవగా
అంటీ ముట్టనట్లుగా స్పర్శతో సంసారమే చేయగా
ఈ కలతనిద్ర కాపురం ఎందుకని దొలిచేస్తుంది!

కాగితపు పువ్వు..

ఒకదానివెంట ఒకటి కోల్పోతూనే ఉన్నాయి
లోకాన్ని ఏం కోరితే ఏం ఇచ్చిందని కన్నీళ్లేగా
ఒకప్పుడు పూలవనం పరిమళాలతో విరిసింది
ఇప్పుడు ముళ్ళుకూడ దక్కుతాయన్న ఆశలేదు!

ప్రియమైన కాలానికెన్నో కోరికల రెక్కలున్నాయి
రేపటికై ఆలోచించే వ్యవధి మాత్రం కరువైందిగా
గుండ్రంగా తిరుగుతూ రంగులన్నీ విసర్జిస్తుంది
ఇక రూపం మారిపోతే సౌందర్యానికి స్థానంలేదు!

రేయంతా మిణుగురులు చిందులు వేస్తున్నాయి
తెల్లవారిపోయిందా ఈ ఆనందం కనుమరుగేగా
పనేమీలేక ఆలోచనలతో మనసు విసిగిపోయింది
మెల్లగా నిస్సత్తువ శరీరాన్ని కౌగిలించి వీడలేదు!

ఎగిరిపోవే ఊపిరీ దాహపు సుడిగుండాలున్నాయి
కాగితపు పూలవనములో విశ్రాంతి తీరు తీరికగా
అమాయక ఆకాంక్షేదో ఇసుకలో సేద్యం చేస్తుంది
చిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి దక్కింది ఏంలేదు! 

అస్థిరం..

నాలుగు గోడల నాణ్యమైన ఏసీ గదిలో
మనసు మెదడూ రెండూ మధిస్తే తెలిసె
కృంగి కృశిస్తుంది నేనూ నా ఆయువని
నిండుజాబిలి తారల నడుమ గగనంలో
నిదురరాని నా కళ్ళు నీరుకారిస్తే తెలిసె
రేయి జోకొట్టుకోవలసింది నాకు నేనేనని
వానా వాయువూ కలిసి చేసె తాకిళ్ళలో
తడిమట్టి సుగంధం నాసికని తాక తెలిసె
మనసెప్పుడూ వయసు ఎరుగని పసిదని
ఓదార్పు ఉపశమన ఉపమాన గానంలో
అంతర్లీన అడుగులు అలజడిచేయ తెలిసె
వలసబాట పయనించే మిణుగురులమని
భావవెల్లువలు ప్రవహించే అనంతములో
వణికిస్తున్న వర్తమానం తడిమితే తెలిసె
చివరికి ఒంటరిగా వచ్చి వెళ్ళిపోవడమని
కలవరపడిన కన్నీటి ఊట ఊరడింపులో
కరిగే కాలాన్ని ఆగిపొమ్మన్నప్పుడు తెలిసె
అనిశ్చల జీవితానికి స్థిరకవచం వ్యర్థమని