నీ జత

నీవుంటే పరిసరాలన్నీ పచ్చిక బయళ్ళు
సంధ్యవేళ సంతోషం రేయేమో పరవళ్ళు

గాలే గెంతులేసి వేణుగానమై వినిపించు
మాటలే మంగళ వాయిద్యాలు మ్రోగించు

లోలోన తనువే పులకరించి నాట్యమాడెను
నెమలి పరవశమై కన్నీటితో సరసమాడేను

కనుల నిండా కలలేమో కిలకిలా నవ్వేసె
వసంతకాలమే పువ్వులన్నీ జల్లుగా కురిసె

చింతలన్నీ చెట్టుపైకి ఎక్కి తైతెక్కలాడాయి
ఊహలన్నీ ఉత్సాహాన్నిస్తూ ఊయలూగాయి

నీవుంటే మొత్తానికి జీవితం నందనవనం
లేకుంటే అధోగతీ అంతులేని అంధకారం!

నేటిపాఠం

నాకు పరిచయమైన ప్రతీఒక్కరూ జ్ఞానులే
అయినా వారెందుకో ఎప్పటికీ అర్థంకారు

నాకు తెలిసినవారు అందరూ ఆశాపరులే
ఏదో ఒక కోరికతో కొట్టుమిట్టాడుతున్నారు

నాకు ఎవర్ని చూసినా అన్నీ అనుమానాలే
ఏది మంచో ఏది చెడో తెలియక కంగారు

నాకు ఎవరెన్ని చెప్పినా బోలెడు సందేహాలే
జీవితం గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేరు

నాకు రోజూ బ్రతుకునేర్పే పాఠాలు ఎన్నోలే
ఊపిరన ఉదయాస్తమాలతో అల్లిన నవ్వారు

నాకు చిట్టచివరిగా బోధపడింది ఒక్కటేలే
పోయినోళ్ళంతా ఒకప్పుడు బ్రతికుండేవారు

సుడిగుండం..

పుస్తక పేజీల మధ్యన నలిగిన జ్ఞాపకపుష్పం
మన బంధంలా వాడి వాసన కోల్పోతుంటే
ఎంత వలచానో అంతకన్నా ఎక్కువ వగచా!
ప్రేమ ఎవరికీ పూర్తిగా దొరకని అసంపూర్ణం
ప్రతీక్షణం నీవులేని ఒంటరితనం వేధిస్తుంటే
మరణాన్ని అక్కున చేర్చుకోమని చేయిచాచా!
జీవితం జ్ఞాపకాల చుట్టూ తిరిగే సుడిగుండం
ఇద్దరూ కూడా ఇష్టం లేకుండా వేరైపోతుంటే
మనసుకు సర్ది చెప్పలేక మౌనంగా రోధించా!
ఎప్పుడూ గుర్తొచ్చే నిన్ను మరువడం గండం
బ్రతకడం రాక చావలేక జీవచ్ఛవంలా నేనుంటే
ఏడుపు మర్చిపోడానికి భారీమూల్యం చెల్లించా!
స్వచ్ఛమైన నా చిరునవ్వుని కాల్చిచేసా భస్మం
కన్నీటి జ్ఞాపకాల కడలిలో మునిగి తేలుతుంటే
చివరిదాకా రాజీపడి జీవించాలని నిర్ణయించా!

కరిగిపోతూ..

అప్పటి అదే అంతులేని ఆత్మవిశ్వాసము
ఇప్పుడు ఆలోచనలేని ఆవేశంతో కప్పబడి
అనుభవంలో అనుకోని ఇక్కట్లకి గురాయె!
అదంతా తొందరపాటని తెలియని ధైర్యము
ఇప్పుడు కాలంతో కరిగి జీవితం చిల్లుపడి
వేకువ వేకువకూ నడుమ ఆశ అడ్డమాయె!
అనుకోని బాధ్యతావసరాల మధ్య యుద్ధము
ఇప్పుడు నిలకడకై గెలుపు ఓటముల రాపిడి
ఉన్నచోట ఊతంలేక ఉనికి మాయమైపాయె!
అవసరాలు తీర్చే సౌకర్యాల పరుగుపందెము
ఇప్పుడు అహంపై స్వాభిమానం చేసే గారడి
చావు బ్రతుకుల నడుమ పెద్ద పోరాటమాయె!
అవన్నీ ఆనుభూతి లేకుండా సాగే కాలము
ఇప్పుడు పొంతనలేని ఆలోచనలతో అలజడి
ఆయువు నిశ్శబ్దంగా జారి కరిగిపోతుందాయె!

తన కోణం..

వివాహితలు కూడా ప్రేమలో పడతారు
మెడలో మంగళసూత్రం కాలిమెట్టెలతో
కొన్ని భావాలు నచ్చేసి వారికి లోబడి
చెప్పకూడదని తెలిసి అన్నీ చెప్పేస్తారు!
అలాగని తను బరితెగించిందనుకునేరు
చెడ్డదని మచ్చవేస్తారు కల్పిత కధలతో
మీకేం తెలుసని తనలోని భావాలజడి
ఆమెలా మీరు ఎందుకు ఆలోచించరు!
స్రీలు శారీరకంగా పెళ్ళి చేసుకుంటారు
లోన కుమిలేరు మానసిక కన్యత్వంతో
వారి మనసుని తాకలేదే ప్రేమ ఒరవడి
తనని అర్థంచేసుకున్న వారిని వదలరు!
మెచ్చిన వారెదుట తెరచిన పుస్తకంవీరు
నమ్మినవారి ముందు నిలచు నిర్లజ్జతో
మోసగిస్తే చూపిస్తారు నగ్ననటనాగారడి
సొంత బ్రతుకుతో సర్వత్యాగం చేస్తారు!

స్వయంకృతం

నేను ఎవరి వల్లనో నాశనం కాలేదు
నేను చేసుకున్న కర్మఫలమేగా ఇది
మరి ఇంకెందుకు ఒకరిపై నిందలు
నేనల్లుకున్న వలలో నేనేగా చిక్కింది!
నా కలల కలతల్నెవరో సృష్టించలేదు
నాకు నేనేనల్లుకున్న ఊహలేగా ఇవి
మరి ఎవరిపైనో ఎందుకు నిష్టూరాలు
నా స్వయంకృతం నన్నేగా ముంచేది!
నా ప్రత్యేకతను నాకెవరూ చెప్పలేదు
నన్ను పొగడాలన్న దురాశయేగా ఇది
మరి నాకేల స్వయంజనిత గాయాలు
నా అస్థిరానందం ఇలా అనర్ఘమైంది!
నేను మహాగొప్ప జ్ఞానురాలినేం కాదు
నా అనుభవాల సారాంశముగా ఇది
మరి ఎవరో చెప్పలేదనేల అభాండాలు
నేనే సమస్య నేనే సమాధానం చెప్పేది!

ఏకం కాదు..

ప్రతి చిరునవ్వు నిజం నవ్వు కాదు
ద్వేషం ప్రేమా అంత సులభం కాదు
నవ్వే ప్రతీ నవ్వూ ఆనందము కాదు
సుఖఃదుఃఖాల కన్నీళ్ళకు తేడా లేదు!
పదాలు ఒకటే కానీ అర్థం ఒకటికాదు
గుండె విరిగితే బాధచెప్పేది భాష కాదు
ఏ కలా పలుమార్లొస్తే అది నిజం కాదు
బ్రతుకు సాగుతుంది కానీ జీవం లేదు!
ముఖాలు ఒకటైనా మనసు ఒకటి కాదు
మన పరాయి గుర్తించడం సాధ్యం కాదు
జ్ఞాపకాల జాతరలో మనిషి ఒంటరి కాదు
అపజయాలు ఎన్నైనా ఆశకి చావు లేదు!
మదిసమాహారం ఎన్నడూ ఒంటరి కాదు
చెప్పలేని భావాలు ఎప్పుడూ ఒకటి కాదు
అస్తిత్వాన్ని కొలవడం ఎవ్వరివలనా కాదు
ఏరకం కన్నీరైనా ఇప్పుడు విలువ లేదు!

గిరిగీసి..

ప్రేమలో షరతులేవీ లేవనుకుంటూనే
నిన్ను షరతులపై ప్రేమించి ఉంటాను
అందుకే కళ్ళలోన నక్షత్రంలా మెరిసి
వెలిగే కొవ్వొత్తిలా కరిగిపొమ్మన్నావు!
ఇప్పుడు నువ్వో జ్ఞానసాగర కెరటంలే
నిన్ను కోరే జలపుష్పాల్లో నేనుండలేను
అందుకే నువ్వు పిలిచినా రాను అలసి
నాలోని నీవేమో దీన్ని సమర్ధిస్తున్నావు!
విచ్ఛిన్నమైన హృదయానికిది ఎరుకలే
నిన్ను ఎవరూ ఇలా వదిలేసి ఉండరు
అందుకే నీకు ఇష్టమున్నప్పుడు కలిసి
మరో కొత్త వ్యాపకాన్ని వెతుక్కున్నావు!
నా అవసరం నీకెప్పుడూ రాకూడదులే
నిన్ను నీ ప్రతిబింబం భయపెట్టదిపుడు
అందుకే నువ్వు నన్ను నలుగుర్లో చూసి
లోకం నీవన్న భ్రమలో బ్రతకమన్నావు!

స్వీట్స్ సైకాలజీ

ఆకారమే అవకతవకలని గేలి చేసినా
చూడ్డానికి గందరగోళ గజిబిజనుకున్నా
స్వభావం పైకి కరకైనా లోన పానకం
స్వరం మధురం అదే జిలేబీ గుణం!!
పరిస్థితులు ఎంత పిండి పిప్పి చేసినా
గుండ్రమైన రూపాన్ని తిరిగి చేరుకున్నా
కృంగి పుట్టుక మరువకపోవడం నైజం
విరిగి ముక్కైనా తీపే రస్గుల్లా గుణం!!
చిన్ని చిన్ని బిందువులు కలిపి చేసినా
నిరంతరం విడిపోక కలిసి జట్టుగున్నా
ఇదేగా అద్భుత ఫలితాలకు నిదర్శనం
బూందీ కలసిన రుచి లడ్డూ గుణం!!
పాకాన్ని పదేపదే లాగేసి పీచు చేసినా
అందరూ కావాలని ఇష్టంగా కోరకున్నా
నీకు నువ్వు గుల్లగా పీచులా మారటం
లక్ష్యాన్ని చేరడం పీచుమిఠాయి గుణం!!
చూడ్డానికి నల్లగా ఉన్నానని గేలి చేసినా
మృదువైన మనసే బలహీనత అనుకున్నా
బలహీనతల్ని మలిస్తే అదే బలం బలగం
రుచి చేసి మెచ్చడం గులాబ్జాం గుణం!!
ఒత్తిడులు ఎన్నో నన్ను చితికేలా చేసినా
తిరిగి మరలా పునర్నిర్మించబడుతూవున్నా
ఆశగా జీవించడానికి అదేనేమో చిహ్నం
ఓపిగ్గా ఒదిగిన తొక్కుడులడ్డూ గుణం!!

(నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు ప్రతీదాన్నుండీ ఎంతో కొంత నేర్చుకోవచ్చని చెప్పే నా ఈ ప్రయత్నం...అలా మిఠాయిల ద్వారా చెప్పిందే "స్వీట్స్ సైకాలజీ")

ఆడనొప్పి..

అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి
ఆడతనమే అంతులేని నొప్పి
అమ్మా నొప్పి అయ్యో నొప్పి
పన్నెండేళ్ళకు పక్వపు నొప్పి
సవత్తాడిన సంబరపు నొప్పి!
అప్పుడు మొదలౌనులే నొప్పి
నెలసరి వచ్చే కడుపు నొప్పి
ఎవ్వరికీ చెప్పుకోలేనిది నొప్పి
అయినాసరే భరించాలి నొప్పి
ఆడతనానికి ఆభరణం నొప్పి!
అచ్చటైన ముచ్చట ఆ నొప్పి
అలా అనుకుని ఓర్చుకో నొప్పి
అరవడానికి అర్హతలేని నొప్పి
సిగ్గుమాటున నక్కే తీపి నొప్పి
అదే సమ్మనైన శోభనం నొప్పి!
అమ్మ కాకపోతే మహాతలనొప్పి
కడుపులో బిడ్డ తంతున్నా నొప్పి
మరో ప్రాణికి జీవమొసగే నొప్పి
మగబిడ్డ పుడితే ఆనందపు నొప్పి
ఆడజన్మ సార్ధకత పురిటి నొప్పి!
అసలు ఆడదిగా పుట్టడమే నొప్పి
అభిమానమున్న ఆడదాని నొప్పి
ఈడైనా ఏడైనా ఆడదానికే నొప్పి
అహర్నిశలు అనుభవించాలి నొప్పి
నొప్పి.....నొప్పి అంతులేని నొప్పి!

వింతనవ్వు

నిత్యం నిర్లిప్తతలు వెంటపడి వేధిస్తే
నవ్వుతూ ఎన్నింటినని ఏమార్చను
ఎన్నని మాయ మాటలు చెప్పను?

అక్కరకు రాని ఆలోచనలు దొలిచేస్తే
మందహాసంతో మచ్చిక ఏంచెయ్యను
ఎన్నిసార్లు నిస్సహాయంగా నటించను?

మదినంతా తిమిరాలు మెలేసి కుదేస్తే
చిరునవ్వుల వరాలు ఎక్కడ వెతుకను
ఏ ముసుగువేసి ఎదను కాపాడుకోను?

బంధాలు అవసరాలుగామారి ప్రశ్నిస్తే
వికటహాసం చేసి ఏ ఆశతో రమించను
స్వార్ధపు సహనానికి ఏంసహకరించను?

లోకాన్ని లోతట్టుగా చూడాలని తలిస్తే
నవ్వూరాక ఏడ్వలేక ఇంకేం చెయ్యను
బ్రతకడానికెన్ని బ్రతుకుపాఠాలు నేర్వను?

నేనొక స్త్రీ..

నేనొక సుధను సుహాసినిని..
గరళాన్ని కంఠాన్న దిగమ్రింగేసి
అమృతాన్ని నవ్వుగా చిలికిస్తాను!

అమాయకాశయాల ఆశాజీవిని..
నిరాశా గుండంలో సుడులు తిరిగి
ఇతరులకు ఆశాకిరణం అవుతాను!

నేనొక సమైక్యస్నేహ స్వభావిని..
ప్రేమరాహిత్య మైత్రితో వంచించబడి
ప్రేమానురాగాన్ని పంచుతుంటాను!

ఆత్మవిశ్వాసానికి మారుపేరుని..
ద్రోహిగా అవమానాల్ని భరించి
గౌరవాన్ని అందరికీ ఇస్తుంటాను!

నేనొక సుగంధపరిమళ పువ్వుని..
విప్పారాక త్రుంచి నలిపివేయబడినా
వారికే సువాసనలు వెదజల్లుతాను

ఇదోమాయ..

నా ప్రపంచపు లోతులు నీకు అర్థంకావుగా
అర్థమైనా కూడా అర్థంకానట్లు ఉంటావేమో
నాలోకపు లోతులు అంతు చిక్కలేదనుకుంటే
హాయిగా నీలోకంలో నీవు ఉండవచ్చు కదా
ఇలా మర్మగర్భంగా ఆలోచించి బ్రతికేసెయ్!
నా ఆలోచనలేమో అసాధారణ అలౌకికంగా
అవన్నీ అనంతసాగర అభిమానపు అలలేమో
నాసామ్రాజ్యపు రాజూరాణీని నేనే అనుకుంటే
మసిపూసి మనసును మభ్యపెట్టుకున్నట్లే కదా
ఇలా జీవితాన్ని నెట్టుకురావాలిగా సాగించేయ్!
నా భావగంభీరత అనురాగవర్ణ మిశ్రమాలుగా
శృంగార దైహికస్థాయి దాటిన అవశేషాలేమో
నాకు నేను నీకు నీవుంటేనే నిశ్చలతనుకుంటే
అది ఒక అలుపెరుగని కవితాయోగస్థితి కదా
ఇలా అంతమైపోవాలుందేమో అలాగే కానీయ్!

అర్థనారీపురుష్

స్త్రీ మరియు పురుషుడు..
ఇద్దరూ పుట్టినప్పటి నుండి
సగం ఆడ సగం మగవాడే!

మగాళ్ళు ఏడవరంటూ...
కారే కన్నీటికి అడ్డుకట్టవేసి
వారి వ్యధని వెళ్ళగక్కనీయక
ఉన్న సున్నితం ముక్కలుచేసి
కఠినత్వమనే సున్నాన్ని పూసి
పురుషుల స్త్రీత్వాన్ని నలిపేసి..
మగతనమనే మాస్క్ తొడిగారు!

ఆడవాళ్ళిలా చేయరంటూ...
పరిమితులు సరిహద్దులుగీసి
వారి ప్రతిభను కనబడనీయక
ఉన్న మొరటుతనాన్ని మాడ్చేసి
కవ్వింపైనా నీళ్ళైనా కళ్ళవే అనేసి
స్త్రీలలో పురుషత్వాన్ని నలిపేసి..
ఆడతనమే అందమైంది అన్నారు!

ఒంటరి గేయం..

నువ్వు ఏ పున్నమి రేయినో వచ్చి కనబడి వెళ్ళిపోతావు
నలగని దుప్పటేమో ఊపిరాడనీయక కౌగిలించుకుంటుంది!
నువ్వు నడిచివెళ్ళే దారంతా జ్ఞాపకాలు విరజిమ్మిపోతావు
కలల్ని విడిచిరాని కళ్ళను కునుకేమో కసురుకుంటుంది!
నువ్వు గమ్యంచేరి చీకటికరిగి ఉదయమైందని చెబుతావు
కాలాన్ని శాసించలేని ఈ జీవితం అలా సాగిపోతుంటుంది!
నువ్వు సూర్యరశ్మిలో కాంతిపుంజాలను ప్రోగుచేస్తుంటావు
నిస్సహాయత నిశ్శబ్దంగా కోరికలకు కళ్ళెంవేసి బంధిస్తుంది!
నువ్వు జ్ఞానకిరీటపు నీడలో ఆలోచిస్తూ అంకురిస్తుంటావు
దిక్కులేని హృదయం దిక్కులుచూస్తూ దిగులుపడుతుంది!
నువ్వు నీవుగా బహుబ్రతుకుల్ని ఉద్దరించాలనుకుంటావు
ఆ బ్రతుకుల్లో ఇమడలేని అనురాగం ఒంటరిగా మిగిలింది!

మైత్రీవనం

స్నేహానికి లింగ విచక్షణ లేదు
స్నేహ స్థాపకుడు ఎవరూ కాదు
మనసులు కలవడం ముఖ్యం.. 
ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలాగని 
ఏ పంచాంగంలో అది చెప్పలేదు!   

మనసుపడే వ్యధకు మందు లేదు 
చెబితే తెలుసుకోవడం గొప్ప కాదు 
సంబంధానికి నమ్మకం ఆధారం..
అడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడుని
ఏ పరిమితి పరిస్థితి దీన్ని ఆపలేదు!

తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు  
అడుక్కుని తీసుకునేది మద్దతు కాదు  
చివరి వరకూ కలిసుండేదే స్నేహం..
వెంపర్లు ఆడ్డం ఎందుకు మనవాళ్ళని    
ఏ బేరమాడో స్నేహితుడ్ని కొనలేదు!  

నాకు నేనే..

నా అస్తిత్వం నాపైనే అలిగిందేమో.. 
అందుకే గడియారం చిన్నముల్లు కదల్లేక 
కాలాన్ని నెట్టడానికి కష్టపడుతుండగా 
నిశ్శబ్దం నా అంతర్మధనపు గానమైంది!

నా నిస్సత్తువేదో నిద్రను తిట్టిందేమో...
అందుకే నిద్ర నా కంటిరెప్పల్ని తాకాలేక
నిట్టూర్పుల వేడి విషాదం నిషా నింపగా
తనువు బాధలో భావుకతని వెతుకుతుంది!

నా పెదవులకు నిజం తెలిసిందేమో...
అందుకే బూటకపు నవ్వుని నటించలేక
ప్రస్తుతాన్ని ప్రక్కన పెట్టి గడిపేస్తున్నాగా
ఇలా గతం నుండి నేను బయటపడింది!

నా భావాలిప్పుడు అలసినాయేమో...
అందుకే కొత్తగా చెప్పి చేయించుకోలేక 
జ్ఞాపకారణ్యంలో నన్ను నేను తట్టినట్లుగా
ధైర్యాన్ని ధీమాతో పెనవేసుకోమంటుంది!

నా నగ్నత్వం..

నేను నగ్నంగా ఉన్నానంటే..
బట్టలు విప్పి ఉన్నట్లు కాదు
నా భావోద్వేగాలు వివస్త్రలై
దిక్కుతోచక సంచరిస్తున్నట్లే!

నాలోన ఏమి దాగాయంటే..
బయటికి కనబడలేక కాదు
నాలోని నిజాయితీని చూడు
నిజాలు నగ్నంగా నర్తించినట్లే!

నేను నగ్నంగా నర్తిస్తున్నానంటే..
బలహీనురాలిని అస్సలు కాదు
నా బలహీనత అందర్నీ నమ్మడమైతే 
ఆత్మవిశ్వాసమలా నన్ను కమ్మేసినట్లే!

నేను కళ్ళు తెరిచాననంటే..
ఎవ్వరినీ నమ్మడంలేదని కాదు
నా ఆవేశాన్ని ఆలోచనల్తో అణచి
ఆత్మబలాన్ని కప్పుకుని నడుస్తున్నట్లే!

నిరాశాకెరటం!

ఎన్నో భావాలను భారంగా మోస్తూ

పలుమార్లు మనసు ముక్కలు చేసుకుని
రోజుకో కొత్తదారి వెతుక్కుంటూ వెళతా!

అసంపూర్ణ ఆశయాలకు ఆకారమిస్తూ
ఆకలి ఆశలను ఆటవిడుపుగా చేసుకుని
ముఖానికి రకరకాల రంగులు అద్దుతా!

చావు వచ్చేదాకా బ్రతుకుని లాగించేస్తూ
విశ్రాంతినే వ్యాపకంగా మచ్చిక చేసుకుని
పరిపూర్ణత నాదని ప్రగల్భాలు పలుకుతా!

ఆఖరిలో గుర్తింపులేని ఆకృతిని చూస్తూ
నెమరు వేయలేని వాటిని గుర్తు చేసుకుని
అదే సంపూర్ణమైన సమాప్తని తృప్తిపడతా! 

ఓ మగాడా..

మగాడి వస్తువే అయినా ఆడదేగా ప్రకటన చేసేది..
బ్లేడు నుండి బనియన్ యాడ్ దాకా అన్నీ మావేగా
ఇక ఎందులో మాకన్నా మీరు గొప్పని విర్రవీగుతారు
సమానత్వంలో సగంకన్నా మేమేగా ముందున్నాం!!
మగాడు పుడితే వంశోద్ధారకుడని సంబరం చేసేది..
ఆడపిల్లని తెలిస్తే కడుపులో కడతేర్చేది మమ్మల్నేగా
మాకున్న ఈ సౌకర్యం మీకు లేకున్నా ఫోజుకొడతారు
సమానమంటూ సమాధి చేసే మీవెంట మేమున్నాం!!
మగాడితో పాటుగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేసేది..
మరెన్నో వెసులుబాట్లు సెలవులూ అదనంగా మాకేగా
మరి మగాళ్ళు ఎందుకని అధికులమని అనుకుంటారు
సమానంగా చదివి సొమ్మిచ్చి మొగుడ్ని కొంటున్నాం!!
మగాడు ఆడదీ కలిసేగా కామంతో కాపురం చేసేది..
ఫలితంగా గర్భందాల్చి ఆడైనా మగైనా కనేది మేమేగా
మమ్మల్ని మరచి మగాడి మగతనాన్నే గొప్పనంటారు
సమానం కాదన్న సమాజాన్ని సవాలు చేస్తున్నాం!!
మగాడా అర్ధనగ్న ఆలోచనలు ఆపి విను చెప్పేది..
లైంగికంగా వేధించే నువ్వు అసలు మగాడివే కాదుగా
స్త్రీని గౌరవించి రక్షించు నిన్నో మగమహారాజువంటారు
సమానత్వంగా సాగిపోతూ ఎన్నింటినో సాధించేద్దాం!!

నీ తలపుల్లో..

మనిద్దరం ఆనందంగా గడిపిన క్షణాలన్నీ..
అందమైన అక్షరాలుగా అలంకరించేసుకుంటా

ఒక్కో యుగంలా గడిపిన ఎడబాటులన్నీ..
అటక మీదకి ఎక్కాయి ఎంచగ్గా అనుకుంటా

టీ అంటూ ముచ్చట్లతో గడిపిన గంటలన్నీ..
ఏదోక వంకతో నవ్వుతూ గుర్తు చేసుకుంటా

వచ్చి వెళ్తూ ఇబ్బంది పెట్టిన నిముషాలన్నీ..
నీకు దగ్గరగా ఉండాలనే నాకోరిక అనుకుంటా

తొలిసారి కలిసినప్పటి మధురస్మృతులన్నీ..
చిరస్మరణీయంగా మిగిలిపోవాలని కోరుకుంటా

నేనున్నా లేకున్నా నా మాటల భావాలన్నీ..
నీ తలపుల్లో తరగని తాకట్టులా పెరగాలంటా

నాదో ఆశ...జీవిత ఆసరాలు ఈ జ్ఞాపకాలన్నీ
పద్మార్పితే ప్రేమంటే అని నువ్వనుకోవాలంటా!