గ్యాస్ కబుర్లు

ఆక్సిజన్ అన్ని జీవరాశులకు అదే మూలమని

రంగురుచివాసన లేకున్నా బ్రతకడానికవసరమని
ప్రాణవాయువులా నాతో ఉన్నంత కాలము ఉండి
దాని సంకేతంలా శూన్యంలో "O"చుట్టి వెళ్ళిపోకు!

నైట్రోజన్ మొక్కలకి అవసరమైనదీ మూలకమని
కృత్రిమ గర్భోత్పత్తిలో ద్రవ నత్రజని పాత్ర ఉందని
స్పృహ తిరిగితెప్పించే అమోనియాకు నేస్తంవంటిది
నవ్వించే గ్యాస్ వోలే నమ్మించి నట్టేటిలోముంచకు!

కార్బన్ డై ఆక్సైడ్ వృక్షాలు వదిలేసిన వాయువని
నీట్లో కలిస్తే సోడా,పదార్ధం పులిస్తే పైకొచ్చే గ్యాసని
మండుతున్న మంటలు ఆర్పడానికి ఉపయోగపడి
మనసున మంటరేపి గాలికంటే బరువై దిగజారిపోకు!

హైడ్రోజన్ గాలిలోన మండి ఉదకఊటను ఇస్తుందని
గాలికంటే అత్యంత తేలికైన వాయువుపేరు ఉదజని
అధిక దహనోష్ణతని కలిగిన పారిశ్రామిక ఇంధనమది
అన్నీ నీవని ఆశగా ఉంటే అంతరిక్షంలోకి ఎగిరిపోకు! 

తేడా తెలుపు


మనిషికే కాదు మృగానికీ గుండె ఉంటుంది
గుండె ఉంది అనుకుని కూర్చుంటే సరిపోదు
చెయ్యాలన్న సంకల్పము ధైర్యము ఉండాలి!

సక్రమంగా జరుగలేదు అనుకుంటే ఏముంది
ధైర్యముంటే చాలు అదే బలం అంటే చాలదు
దానికి తోడు దాతృత్వం శ్రమా కూడిరావాలి!

ధీక్ష పట్టుదల తెగింపు కలిస్తే పని అవుతుంది
అయ్యోపాపం ఎలాగైందని అడిగితే అయిపోదు
ఆపదలో ఆదుకోడానికి హస్తం ఒకటి ఉండాలి!

పగలు తరువాత రాత్రీ గడిచి తెల్లవారిపోతుంది
లేచామా తిన్నామా పడుకుంటిమా అంటేకాదు
మానవత్వంతో మనకూ గొడ్డుకీ తేడాతెలియాలి!

నూతనయత్నం..

ప్రేమ లోతుని పసిగట్టలేని పిచ్చి మనసు
తననితాను ప్రేమిస్తూ ప్రకృతిని ప్రేమించె
ప్రేమించి మిన్నక దాని ఒడిలో పవళించి
వెన్నెల వెలుతురు వేడి తనవేనని తలంచె!
కొండ కోనలూ పచ్చికబయళ్ళూ నదులు
అవన్నీ తనతోటే మచ్చటించాలని ఎంచె
వర్షం వచ్చి రాకున్నా విపరీతంగా తడచి
విసిగిపోని భావోద్వేగంతో విచలితనిచెందె!
తప్పని ప్రాయశ్చిత ప్రక్రియతో ఆవేదనను
ప్రేమ భావాన్ని హుందాగా ప్రకటించనెంచె
సామాజిక స్పూర్తివైపు తన ధ్యాస మళ్ళించి
భావప్రపంచపు దిశను మార్చి మదిరచించె!
భావ వవనపు పూలు నన్ను చూసి నవ్వుతూ
దిశమార్చినట్లు మదిమార్చగలవాని ప్రశ్నించె
సుఖఃధుఖ వలపు శృంగారాత్మకం అనిపించి
ఐహిక మలినాలు కడగ కలం ప్రయత్నించె!

నీ వెలుగు...

వంగతోటలో ఒళ్ళొంచి లేత వంకాయలు కోసుకొచ్చి
మువ్వంకాయల కూరను వంగి వయ్యారంగా వడ్డిస్తే
ఓరకంట చూస్తూ ఒళ్ళు జిల్లుమంటుంది అంటావు!

పూదోటలోకి సందేలకెళ్ళి బొండు మల్లెపూలట్టుకొచ్చి
మరువాన్ని మధ్యెట్టి మాలకట్టి జడలో పెట్టుకొనివస్తే
మత్తెక్కించే మల్లెల మధ్య మరువం గుచ్చెనంటావు!

మావిడితోటకి మండుటెండకెళ్ళి మాగిన పళ్ళట్టుకొచ్చి
తొక్కతీసి ముక్కలు కోసి నా చేతితో నీ నోటికిఅందిస్తే
చిలిపిగా నవ్వి మావిడపళ్ళ రసాలు రంజు అంటావు!

జొన్నచేనుంచి లేతకంకులు నాలుగు దోరగ కాల్చిచ్చి
ఏటిగట్టుకెళ్ళి స్నానమాడి నూలుచీర ఒంటికిచుట్టుకొస్తే
ముతకబట్ట ఇద్దరిమధ్య తెరని తీసి దీపం ఆర్పేస్తావు!

చీకట్లో నీ చూపులే సూదంటురాయై నన్నేడేడో గుచ్చి
చిత్రంగా ఒళ్ళంత తడిమేటి ఆ సరసమే తబ్బిబ్బుచేస్తే
నా ఊపిరిలో దాగి నీ చీకటికి నేనే వెలుగు అంటావు!!