బంధం!

అన్నింటినీ మించినది ప్రేమబంధం
అనురాగాలమూటకి శ్రీకారమీ బంధం
ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం
సాగరానికి కెరటానికి ఉన్నది ఈ సంబంధం
జాబిలికి వెన్నెలతో ఉన్నది ఇదే అనుబంధం
అనుమానాలకి చోటివ్వని బంధం
నమ్మకంతో బలపడితే ఈ రాగబంధం
కలకాలం నిలుస్తుందదే అనురాగబంధం

వృధా ప్రయాస!

కరిగిన కలలో నిజాన్ని చూస్తున్నా
రాతిగుండెలో ప్రేమని వెతుకుతున్నా
ఎంతటి పిచ్చిదాన్ని నేను...
మాటేరానివాడ్ని ఒట్టేసి చెప్పమంటున్నా!

మోసాల అంగట్లో మంచిని బేరమాడుతున్నా
అనామకుని కళ్ళలో నన్నునేను వెతుకున్నా
మనసేలేని చోట నేను...
మమతలసామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!

చెవిటివాని ముందు కోయిలనై కూస్తున్నా
విరిగిన కొమ్మ చిగురించాల
నుకుంటున్నా
ఒడ్డున దొరికిన శంఖంలో నేను...
స్వాతిముత్యాలకై అన్వేషిస్తున్నా!

ఇసుక నుండి తైలాన్ని తీయాలనుకున్నా
నడి సముద్రములో నావనై నేనున్నా
ప్రేమని ఆశించిన నేను...
కన్నీటికెరటాలలో ఎదురీదుతున్నా!

నా గది/My room...


నాగది చూపింది నాకు విజయ మార్గం.....

ఉన్నతంగా ఆలోచించమంది పైనున్నకప్పు!
(Roof-Aim high)
సమయం ఎంతో విలువైనదంది గడియారం!
(Clock-Time is precious)
ఫ్యాన్ అంది శాంతంగా ఉండు నీదరిచేరదు ఏముప్పు!
(Fan-Be Cool)
ఏ పనికైనా ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోమంది అద్దం!
(Mirror-Reflect before you act)
కిటీకీ అంది భాధలు ఏవైనా నీ మనసుతో నీవే చెప్పు!
(Window-Take pain)
సకాలంలో పనులను పూర్తి చేయమంది దినసూచకం!
(Calender-Be up to date)
ఎప్పుడూ ముందడుగునే వేయమంది తలుపు!
(Door-Push)
భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకోమంది దీపం!
(Lamp-Light the way for your future)
మంచమంది మత్తులో పడకు అది నీకు తీసుకునిరాదు ఏగుర్తింపు!
(Cot-Don't get Addict)

నామది చెప్పింది పైవాటిని పాటించుతూ సాగనీ నీ పయనం....

చేయూత!!

నేను ఒంటరినై ఉన్నప్పుడు,నెమరైన ఙ్జాపకానివై నీవురావాలి!

మౌనం నన్ను చుట్టేసినప్పుడు,నీ పలకరింపులే తోడుకావాలి!

సమస్యల వలలో చిక్కిన్నప్పుడు,నేనున్నానని నా వెన్నుతట్టాలి!

గమ్యాన్న అవరోధాలున్నప్పుడు,మధురమైన భవిష్యత్తుగా కనపడాలి!

బ్రతుకు పయనంలో అలసినప్పుడు,నీ వెచ్చని ఒడిలో సేదతీరాలి!

చీకటిలో నేను దారితప్పినప్పుడు,ఆశల దీపమై వెలుగు చూపాలి!

జీవనయానంలో పోరాడేటప్పుడు,నన్ను వెంటాడే నీడవైపోవాలి!

నాకై నేను!

నన్ను నేనే మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేనే అద్దంలో చూసుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు...
నన్ను నేనే సమర్ధించుకుంటాను
అది ఎదుటివారికి సమ్మతమైనప్పుడు...

నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను భాధించినప్పుడు...
నాకు నేనే శిక్ష విధించుకుంటాను
నేరం నా వలన జరిగినప్పుడు...
నాకు నేనే దూరమైపోతాను
ఎవరికీ పనికిరానప్పుడు...

నా కంటిని నేనే శాసిస్తాను
సాక్షినై సహాయం చేయవలసినప్పుడు...
నా మనసుని నేనే లెక్కచేయను
అది తప్పు అని నాకు తోచినప్పుడు...
నా ప్రాణమైనా ధారపోస్తాను
పదిమందికీ అది ఉపయోగ పడుతుందనుకున్నప్పుడు...

నా బ్లాగ్ జన్మదినం!

గత సంవత్సరం నవంబర్ 24న రాత్రి 8గంటల 15నిమిషాలకి మౌనం గా ఒక గాజుబొమ్మ లాలింపుల మేలు కలయికకై కలలు కంటూ కూర్చుంటే ఆవేదనే తప్ప ఆలోచనలు రావని.... తన మనసులోని మాటను చిరుభావాల రూపంలో వ్యక్తపరచి, తన వలపుల తలపులనే కాదు ఎడబాటులోని మాధుర్యాన్ని సైతం నివేదనగా ప్రేమ ఉనికిని తన మాటగా చెబుతూ కుర్రకారు కాస్త ఆలోచించండి అంటూ వారి వెన్నుతట్టి మనకేల మృతిచింత ధైర్యముతో సాగిపోదాం ముందుకని తన పయనాన్ని సాగించింది....
ఇదండీ సంగతి అని రాసి మౌనంగానే ఉండేదాన్ని.... నీ తలపులలోని మార్పుతో ఆలోచించమని ఇద్దరు కలసి జీవించనప్పుడు ప్రేమ/స్నేహం అనేమాటలెందుకని,నీలోమార్పుకై ప్రయత్నించి ఓటమిలో గెలుపుని చూడమని నా ఆలోచనలు నన్ను తట్టకపోయి వుంటే....
వక్రించిన విధిని కూడా నిస్వార్ధమైన ప్రేమతో నిదురలేపి ఓ...ప్రేమ నీకు కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ నీ ప్రేమని కలసికట్టుగా అందరికీ పంచుతూ....ఎందుకు? ప్రాప్తం ఉన్నవారికే ఆమె(ప్రేమ) దక్కాలి,ప్రేమ/దోమ అన్నవారికి కూడా ఓ ప్రియతమా! నీకు అక్కరకురాని దానను కానని ఎలా తెలిపేది అని నాలో నీవు చేరి గుస గుసలాడిన ఆ తరుణం నాకు ఇప్పటికీ శిల్పి చెక్కిన సూక్తిగా గుర్తున్నది, అది నేను ఎలామరిచేది ప్రియతమా!(ప్రేమ భావాన్ని).... నీలో నేను ఎప్పటికీ ఉన్న్నానని, అందరూ మెచ్చిన జంటగా ప్రేమ పయనం చేస్తూ ప్రేమ జల్లులలో తడసిన నిన్ను కాంచిన వేళ నా వ్రాతలు(కవితలు) మీ తలపులు ఒకటవ్వాలని ఆశిస్తాను.... అతని రాకకై(నా టపా) ఎదురుచూసిన వారికి శుభాకాంక్షలు అంటూ నీ పిలుపుతో(నా కవితతో) అతడు/ఆమె నే కాక ఏడువింతల లోకంలోని ప్రతి మనసుని ఎలాచేరుకోను అని ఆలోచిస్తాను....

మనమెవరో తెలిపే ఈ రంగుల జీవితం గూర్చి తెలుసుకునే చిరుప్రయత్నంలో ప్రేమ ఎవరికైనా ప్రియమేనని నాడు-నేడు ప్రేమలో అంతరం ఉందని తెలిపిన ఓ నా కవితా ఎక్కడున్నావమ్మ అంటూ వెదికిన నాకు ప్రేమించాకే తెలిసింది(కవిత రాసాక) అది ఎంత సులభమైన కష్టమో కదా ఈ పరుగుల జీవనంలో అని....

నీ రాకకై(మీ వ్యాఖ్యకై) ఎదురు చూసే నాకు మీ ప్రోత్సాహం ఏమి చేయమంటావు(ఏమి రాయాలో)అంటూ నాతలపులను తట్టి లేపుతాయని....

ఎందుకనో మీ అందరినీ నాకు దరిచేర్చాయి ఈ విన్నవించవా అంటూ నేను చేసిన ప్రేమపోరాటాలు(రాసిన టపాలు), కన్నీటి వేడుకోలులు(కవితలు) ఎవరికి చెప్పాలివిన్నపాలు(నా భావాలు), నాలో ఈ ఆనంద ఊయల లూగించిన ఈ కలువ రాసిన కవితలు....

నా ఈ వినతిని(రచనలని) పద్మార్పితా! ఓ పుష్పమా అని పువ్వుని పలుకరిస్తే(ఆత్మీయంగా) పులకరించమని జీవితం నాకు నేర్పింది, కాయగూరలతో కబుర్లు చెప్పినా స్నేహమంటే ప్రేమని కొలచిచూడు అని అన్నా నీవుకావు రావు అంటూ ప్రేమ ఒక స్వప్నం అని రాసినా ప్రోత్సహించి సహకరించిన వారెల్లరికీ ధన్యవాదాలు....

జై భారత్ మాత అని నినాదంతో పాటు పెళ్ళిపందిరిలో ప్రకటనని సైతం మెచ్చి నా బ్లాగ్ పుట్టుకకి ఒక సార్ధకని చేకూర్చి మీ అభిమానాన్ని నాకు బహుమానంగా ఇచ్చినది ఎప్పటికీ అందిస్తే ఎంతో బాగుంటుంది....మీ అభిమానాన్ని నేను ఎన్నడూ చెదిరిన కల కానీయక ఎదురీతతోనైనా దాన్ని నిలబెట్టుకోవడానికి నా ప్రతి పదం ప్రయత్నిస్తానంటుంది....

ప్రేమంటేనే కాదు కృష్ణమ్మ కరుణించవమ్మ అని ప్రార్ధించినా జలపుష్పాలని గాలించినా మేకింగ్ ఆఫ్ మానవా గురించి శోధించినా అంతా మీ అభిమానం....

వేచివున్నా....నా నూరు టపాలని పూర్తిచేసిన ఓ నా జీవితమా నీవు తెలుసుకో సంపాదించుకో అందరి మనసులలో స్థానం....అదే నా ఈ మాటల మర్మం....

నా చిట్టి బ్లాగ్ బంగారం...
ఇదే నీ మొదటి జన్మదినం....
చేయి అందరికీ వందనం....
పొందు ఆశ్శీసులందరివి ఈదినం!

నీలిరంగులోని పదాలు ఈ సంవత్సరం వ్రాసిన నా టపాల సూచికగా గుర్తించండి... వాటిని క్రమబద్దీకరణ చేయడంలో భావ ప్రకటనలోని లోపాలని మన్నించండి...

మాటలోని మర్మం!!

మాటలకి ఉన్నది ఎంతో మహత్యం!
అవి తెలుసుకుని పలకాలి మనం అనునిత్యం!

మాటలకి ఉన్నది ఎంతో కలుపుగోలుతనం!
అవి కావాలి ఎదుటివారికి మధురమైన భాష్యం!

మాటలకి ఉన్నది ఎంతో నేర్పరితనం!
అవి సున్నితమైతే అతికిస్తాయి విరిగిన మనసుని సైతం!

మాటలకి ఉన్నది ఆశని నిరాశ పరిచే గుణం!
అవి మనం చెప్పడంలోనే ఉన్నది మర్మం!

మాటలతో చేకూరుతుంది ఎంతో మనోధైర్యం!
అవి వ్యక్తం చేయడంలో చూపాలి మన నైపుణ్యం!

మాటలతో పెంపొందించగలం ఎదుటివారిలో శక్తిసామర్థ్యం!
అవి చెప్పేటప్పుడు అవలంబించాలి సరైన సమయపాలనం!

అందుకే ఆలోచించి మాట్లాడుదాం మనమందరం!
తానొవ్వక ఇతరులనొప్పించక ఆనందంగా జీవించేద్దాం!!

తెలుసుకో!!!

ఇసుకలో రాతలను నేను రాయను
అవి నిలకడలేనివని నాకు తెలుసును
బండబారిన హృదయం నాదని నీవంటే
రాతిపై వ్రాసిన రాతలను చెరపలేవంటాను!

తపించి చూడు ఎదుటివారి తలపులలో
తెలుస్తుంది నీకు ప్రేమంటే ఏమిటో
అన్నిటిలా ప్రేమ అమ్ముడుపోతే అంగట్లో
ఎలా తెలుస్తుంది నీకు ఎదురుచూపు ఏమిటో!

నిన్ను చూసే నా కళ్ళు తమని తాము చూసుకోలేవు
మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు
నా నీడలో, శ్వాసలో నీవున్నప్పుడు నన్ను వీడి నీవు పోలేవు
మనసు పొరల్లో దాగిన మమతకు ప్రేమమాధుర్యమే తెలియదు!

ఓ నా జీవితమా!

ఓ నా అందమైన జీవితమా!
నాకు చేయూతనీయుమా!
నీతోటిదే నా లోకమా!
ఇరువురమూ కలసి పయనించెదమా!

ఓ నా అదృష్ట జాతకమా!
హృదయానికి నీవు చేరువ సుమా!
ప్రేమను నా నుండి వేరుచేయకుమా!
ద్వేషం నా మదిలో చేరనీయకుమా!

ఓ నా నమ్మకమా!
వెలుగు నీడల సౌధమా!
కష్టాలలో కృంగనీకుమా!
ధైర్యంతో ఎదురు నిలవనీయుమా!

ఓ నా ఆశల నిలయమా!
నీవే నా ప్రాణమా!
నా ఆశయాల సోపానమా!
నా గమ్యానికి నన్ను చేర్చుమా!!!

వేచివున్నా...నా నూరవటపా!

నీ అడుగులో అడుగునై ఏడడుగులు నడవాలని కోరికంట
నీ తోడు నీడనై నీతోటి కలసి జీవించాలి నూరేళ్ళంట
నీ హృదయపు లయనై నీ పెదవులపై చిరునవ్వునవ్వాలనుకుంట!

కంటిది కనురెప్పల వంటిది మన అనుబంధమంట
కనురెప్పలాడకపోతే కొద్దిక్షణాలు జలజల నీళ్ళురాలతాయి కంట
కంట నలుసు పడితే కనురెప్పలు విలవిల కొట్టుకుంటాయంట!

నీ ఎదుట నా మనసుని తెరచి ఉంచినానంట
నీకై మరణించి కూడా కనులు తెరచినానంట
నీవు ఇంకా వేచి చూడమనడంలో అర్థమేలేదంట!!

వినమ్రతతో.....
నా టపాలని ఇష్టంగా చదివినవారు..
అయిష్టంగా భృకుటిని ముడివేసినవారు..
ఆహా! ఓహో అని పొగిడినవారు..
వ్యాఖ్యలతో వెన్నుతట్టినవారు..
అర్థం కాక చదవక వదిలేసినవారు..
తప్పులను ఒప్పులుగా సరిచేసినవారు..
ప్రేమా పైత్యమా అని అనుకున్నవారు..
పిచ్చిరాతలు మనకేల అని తలచినవారు..
ఎవరైనా అంతా నావారు.....ఈ బ్లాగ్ మిత్రులు..
మీ అందరికీ నా అభివందనాలు...
అర్పిస్తున్నది నూరవటపాతో హరిచందనములు...
పద్మ ఆశిస్తున్నది మీ మన్ననలతో కూడిన దీవెనలు...

మేకింగ్ ఆఫ్ మానవ!!!

అవి బ్రహ్మ సృష్టికర్తగా కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు......
మొదటి రోజు శుభసూచకంగా గోవుని సృష్టించి, నీకు అరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదిస్తున్నాను. ఎండని వానని చూడక కష్టపడి రైతుకి అండగా వుండి అవసరానికి అతని ఆకలిని నీ క్షీరముతో తీర్చు అని సెలవిచ్చాడు.
ఆవు అయ్యా! ఇలా గొడ్డు చాకిరీ చేస్తూ అరవై ఏళ్ళు బ్రతకాల? నాకు ఇరవై ఏళ్ళు చాలు భగవంతుడా, మిగిలిన నలభై ఏళ్ళని నీవే తీసుకోమని మనవి చేసుకున్నది. బ్రహ్మ సరే అన్నారు.
రెండవరోజు శునకాన్ని సృష్టించాడు, దానికి ఇరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదించి నీవు ఇంటి ద్వారానికి కాపలా కాస్తు వచ్చే పోయేవారిని చూసి మొరగమని సలహా ఇచ్చారు.
కుక్క, మహాప్రభో! ఈ కాపలా ఉద్యోగం ఇరవై ఏళ్ళెందుకు పదేళ్ళకి కుదించమని మొరపెట్టుకుని మిగిలిన పదేళ్ళు తిరిగి ఇచ్చేసింది. బ్రహ్మ సై అన్నారు.
మూడవరోజు మర్కటాన్ని మహా మోజుతో మలచి నీకు ఇరవై ఏళ్ళ ఆయువుని ఇస్తాను నీ కోతి చేష్టలతో అందరినీ అలరించమన్నాడు ఆ బ్రహ్మ.
కోతి తన కోతిబుర్రతో ఆలోచించి, అయ్యా నాపై మీకు ఇంత అభిమానము వద్దు కాని నాకు కూడా కుక్కకి ఇచ్చినంత ఆయువునే ప్రసాదించండి. మిగిలిన పదేళ్ళు నేను కూడా మీకే ఇచ్చేస్తున్నానంది. బ్రహ్మ వలదు అనలేక ఔను అన్నారు.
నాల్గవరోజు నవ్వుతూ నరుడిని రూపొందించాడు. ఈసారి నరుడి నోట "నో" అనిపించుకోరాదని, నరుడా నీవు ఏపని చేయకు హాయిగా తిని, ఆటలాడుకుని ఆనందించి నిద్రించు, నీకు ఇరవై ఏళ్ళు ఆయువుని ప్రసాదిస్తున్నాను పండగ చేసుకో! అని అలసి కాస్త విశ్రాంతికై ఒరిగిన వేళ......మానవుడు మాహా మేధావి, బ్రహ్మాజీ! ఒక విన్నపము ఈ జీవితానికి ఇరవై ఏళ్ళు ఏం సరిపోతాయి చెప్పండి? తమరు కాస్త పెద్దమనసుతో నా ఇరవైకి గోవుగారి నలభై, శునకానివి పది, కోతివి పది కలిపితే మొత్తం ఎనభై ఏళ్ళు మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాను అన్నాడు. బ్రహ్మగారు మానవుని మర్యాదకి మెలికలు తిరిగి తధాస్తు అన్నారు.
అదండీ అప్పటి నుండి మానవుడు.....మొదటి తన ఇరవై ఏళ్ళు ఏపని చేయకుండా తిని తొంగుని తరువాత నలభై ఏళ్ళు గొడ్డు చాకిరీ చేసి పదేళ్ళ తన కోతి చేష్టలతో మనవళ్ళని మనవరాళ్ళని నవ్వించి మిగిలిన పదేళ్ళు ఇంటికి కాపలా కాస్తున్నాడన్నమాట!
(ఇది సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే కాని ఎవ్వరినీ భాధ పెట్టాలని మాత్రం కాదని మనవండి... చిత్తగించవలెను)

జలపుష్పం!

జలకన్యపై కవితాస్త్రము సంధించ నేనెంతటిదానను!
ఉషగారి కోరికను నేను ఎటుల కాదని అందును!
మరువపు సువాసనలతో నేను మరులుగొలుపలేను!
స్వీకరించుము పద్మ అర్పిస్తున్న జలపుష్పమును!

నీటిలో ఏమున్నది నీలి రంగు తప్ప అనుకున్నది ఆ మీన
ఒడ్డున ఉన్న నీటి బుడగపై రంగుల తళుకులు చూసి మురిసినది జాణ
తీరము చేరిన మీన ఎటుల జీవించునో ఈ ప్రపంచాన్న!

ఇసుక రేణువుల తాకిడికి పగిలిన బుడగను చూసి భోధపడినది క్షణాల్లోన
ఉషాకిరణాలతోనే దానికి అన్ని రంగుల హంగులని తెలుసుకున్నది జాణ
స్వచ్ఛమైన స్వాతిముత్యములెన్నో కదా మీనపు సామ్రాజ్యాన్న!

దూరపుకొండలు నునుపులే అని తలచినది మదిన
ఉక్కిరి బిక్కిరై సాగరము వైపునకు ఉరికినది జాణ
ముత్యమును మించిన రంగేలననుకున్నది మీన తన అంతరంగాన్న!

కృష్ణమ్మ కరుణించవమ్మ!!

కృష్ణమ్మ నీకు ఇంత అలుకేలనమ్మ!
కష్టానష్టాలు పడుతున్న మీ పిల్లలమమ్మ!
కరుణాకటాక్షాలని మా పై చూపించవమ్మ!
శాంతించిన నీ కౌగిలిలో కాస్త సేదతీరనీయవమ్మ!
కరకట్ట బిడ్డలమైన మాకు కన్నీళ్ళనే మిగల్చకమ్మ!
పరవళ్ళు చూసి మురిసే మాపై ఉరవళ్ళు వద్దమ్మ!
ఆగ్రహిస్తే నీ పైనే ఆక్రోశించే అభాగ్యులమమ్మ!
ఆలంబనకై మరల నీ దరిచేరే ఆశాజీవులమ్మ!

ప్రేమంటే!!!

కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!

హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ

హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే!

మనసు మనసు కలవడమే కాదు ప్రేమ
ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే!

తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ
తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే!

చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ
చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే!

భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!

అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ
కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!

ఎదురీత...

భయమన్నది నాకు తెలీదు
ఓటమి అనేదే నాకు లేదు

కెరటాలతో సంఘర్షణ నేర్చుకున్నా
ఎదురీది గెలుపుని కైవసం చేసుకున్నా

గాలిమేడలు ఎన్నడూ నేను కట్టుకోను
గుడిసెనే మహలుగా మలచుకుంటాను..

ఆలోచనలు ఉంటేనే సరిపోదు
ఆచరించకుండా ఏదీ సాధ్యం కాదు

కర్మ సిధ్ధాంతాలని వల్లించడంకన్న
లక్ష్యసాధనలో సాగిపోవడం మిన్న

బాటలోని ముళ్ళని చూసి భయపడితే
గమ్యంలోని పూలు నీకు దక్కవంతే..

చెదరిన కల!

క్షణమొక యుగమై సాగుతున్నది
మనసు మారాము చేస్తున్నది
నిదుర రాని నాకనులు నిన్నేకోరుతున్నవి!

నెలవంక నన్ను ప్రశ్నిస్తున్నది
వెన్నెల అంతా ఆవిరై పోతున్నది
ఎదురు చూసి నాకనులు కాయలు కాస్తున్నవి!

నా మనసు నీ చెంతన ఉన్నది
నీ మనసు నా మాట వినకున్నది
మదిన అలజడులు సుడులు తిరుగుతున్నవి!

ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
తలపులతో తనువు బరువౌతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువౌతున్నవి!

ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది
మరణం విజయ దరహాసం చేస్తున్నది

పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి!

స్వప్నం కూడా నిన్ను కాలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!

బాగుంటుంది!

పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుంది!
నిదురలోని ఊహా పుష్పాలు నిజ జీవితంలో విరబూస్తే విడ్డూరమౌతుంది!
హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!

మనసుకి ముసుగు వేయక మమతలని పంచే తోడుంటే ఎంత బాగుంటుంది!
ఆలోచనలని ఆచరణలో పెడితే చేరవలసిన గమ్యం చేరువౌతుంది!
మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటే మరింత బాగుంటుంది!

ఆశించి ఆదరించక, అభిమానంతో ఎవరైనా అక్కున చేర్చుకుంటే ఎంత బాగుంటుంది!
మంచితనాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తే మక్కువౌతుంది!
జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!

జలమునై గళమువిప్పిన!

నేను జలమునై గళము విప్పితే!
శివుని శిరమున గంగనై, భగీరధుని తపస్సునై
పరవళ్ళు తొక్కుతూ సముద్రుడిలో ఏకమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
వర్షించే మేఘమై, వరద కాని వాగునై
హరివిల్లుల జల్లులతో మీకు ప్రియమై మీలో ఒకరినౌతా...

నేను జలమునై గళము విప్పితే!
పంటల పచ్చదనానై, కర్షకుల ఆశాజ్యోతినై
సస్యశ్యామల జగతికి సోపాన మార్గమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
జీవనాధారమై, సేదతీర్చ చల్లదనానై
ఆకలి దప్పికలు తీర్చి అందరి పెదవులపై చిరునవ్వునౌతా...

నేను జలమునై గళము విప్పితే!
ఒక వ్యధా గాధనై, కన్నీటిధారనై
చెంపన జలజలా జారి, ఎదను చేరి ఓదార్పునౌతా...

జలమేలే అని జారవిడిచి వృధాచేస్తే?
బీడువారిన నేలనై, స్వేదబిందువునై
గాయపడిన హృదయముతో ఆవిరై మీకు దూరమౌతా!!!

బహుమానం!!

వస్తువు రూపంలో బహుమతులు అందరూ ఇస్తారు....
ఈ విధమైన బహుమతులు ఇస్తే ఎలా వుంటుందంటారు??

మనకిమనం....స్వాభిమానం, ఆత్మపరిశీలన, వ్యాయామం, సంతృప్తి!
తల్లిదండ్రులకి....ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలు, ఆత్మీయత, ఓదార్పు!
జీవితభాగస్వామికి....ప్రేమ, ప్రశంస, నమ్మకం, తోడు, సమయం!
సోదరీసోదరులకు....అనురాగం, మనోధైర్యం, సహాయం, అర్థంచేసుకోవడం!
సంతానానికి....జ్ఞానం, సలహా, ప్రేమ, దయ, నీడ!
స్నేహితులకు....చేయూత, సద్భావం, సమయం!
సహాయపడినవారికి....మెచ్చుకోలు, కృతజ్ఞతలు, గుర్తుంచుకోవడం!
తోటి ఉద్యోగులకు....పలకరింపు, సహాయగుణం, హాస్యం!
అధికారికి....గౌరవం, నమ్మకం, నాణ్యత, సమయపాలనం!
శత్రువులకి....క్షమించడం, చిరునవ్వు, స్నేహభావం!
దేశానికి....గౌరవం, అభివృధ్ధికి మార్గం!
దేవునికి....నిర్మలమైన మనసుతో ప్రణామం!
మరింకెందుకు ఆలస్యం....పదండి బహూకరిద్దాం!!

సార్థకత!

గాయమైన వెదురు పలుకుతుంది రాగం...
ఎవరికొరకై చేస్తుంది కోయిల గానం...
రాగద్వేషాలతో రగలడమెందుకు...
ప్రేమానురాగాలతో పద ముందుకు...
వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
నలుగురికి ఆదర్శం కావాలి జీవనం...
అదే మానవ జన్మకు పరమార్థం...

పెళ్ళిపందిరిలో ప్రకటన!!

పెళ్ళిపందిరిలో వధువు కావలెను అనే ప్రకటనని ఎవరెవరు ఎలాఇచ్చారో ఒక్క లుక్ వేయండి:)...:)

డాక్టర్....కొద్దిరోజుల క్రితమే నాకు ప్రేమ అనే బాక్టీరియా సోకి పెళ్ళి అనే రోగానికి దారితీసింది. కావున అందమైన రోగిణులు మందు మాకు గురించి తెలిసిన వారు ముందుగా రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించవలసిందిగా ప్రార్ధన. రోగనిర్ధారణ(అన్ని అభిప్రాయాలు కలిస్తే) జరిగిన పిమ్మట నేను ఒక మంచి వైద్యునిగా(భర్తగా) సేవలందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను!!!

లాయరు(న్యాయవాది).... నేను భర్తగా ఆమోద యోగ్యతను పొంది, వివాహమాడ తలచినాను కావున అవివాహితల నుండి ధరఖాస్తులను కోరడమైనది. ఆమె తన పరిధిలో నాకు మనసావాచా అర్పితమవ్వాలి. ఎటువంటి అభ్యంతరమున్నా ఓవర్ రూల్డ్ కావించబడుతుంది, సస్టండ్ చేయబడదు!!!

బిక్షగాడు....అయ్యా దేవుని పేరుపై నాకు ఒక సహధర్మచారిణిని దానం చేయండి. వేరొకరి పత్ని కాకపోయినా మీపత్ని అయినా పర్వాలేదండి. మీరు ఒకళ్ళని దానం చేస్తే మీకు భగవంతుడు నలుగురిని ప్రసాదిస్తాడు. అ
య్యా ఆలోచించక దానం చేయండి బాబయ్యా!!!

బ్యాంకర్....వధువు కావలెను, ఎవరైతే వారి ఆస్తిని జమా చేసి చక్రవడ్డీ లాంటి సేవలతో లాభాలని అందించగలరో అటువంటి అమ్మాయిల నుండి నెలలోపు ధరకాస్తులను కోరడమైనది. గడువు తరువాత అయినచో ఆలస్య రుసుముతో స్వయముగా సంప్రదించ గలరని ప్రార్ధన!!!

కవి....బహుకాలానికి నాకొక కోరిక కలిగినది,
పెళ్ళికై నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది,
ఇన్నాళ్ళు పెళ్ళితో నాకేమీ పనిలేదన్నది,
ఇప్పుడిక ఇంటపని బయటపని నాతో కాకున్నది.
అందుకే సరి అయిన జోడీ కొరకు వెతుకుతున్నది!!!

కారు మెకానిక్....పాతదైనా కొత్తమోడల్ గా కనబడే వధువు కావలెను. మంచి కండిషన్ లో ఉండి తక్కువ సొమ్ముతో ఎక్కువ హంగూ ఆర్భాటాలు చేయగలిగి, సంవత్సరంలో రెండు సర్వీసులు( సినిమాలు) మాత్రమే కోరుకునే 362436 మోడల్ వధువునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్రోకర్లను వదలి పార్టీ డైరెక్టుగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము!!!

తాగుబోతు....నాకు పెళ్ళాం కావాలి. పిల్ల తండ్రికి తప్పక సోడా ఫ్యాక్టరీఉండి తీరాలి. నేను ప్రతిరోజూ కాకుండా వారానికి ఏడు రోజులు మాత్రమే తాగుతాను. ఇంటి వద్ద కాదంటే బార్ లో సరిపెట్టుకుంటాను. బార్ నుండి నన్ను ఇంటికి మోసుకెళ్ళే అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సోడాని సాంపుల్ గా పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!!!

గమనిక:- ఇప్పటి వరకు పై వ్యక్తుల ఆలోచనల మేరకు ప్రకటనలను ఇవ్వడం జరిగినది. ఎవరైనా ఆశక్తిగలగిన వారు తమకి తోచిన విధముగా ప్రకటనలు ఇవ్వదలచిన వ్యాఖ్యల రూపంలో ప్రకటించమని అభ్యర్ధన!!!

బ్లాగ్ మిత్రులారా! ఇది కేవలం హాయిగా నవ్వుకోవడానికి చేసిన చిరు చిలిపి ప్రయత్నమే కాని ఎవ్వరి మనసునీ నొప్పించాలని మాత్రం కాదని మనవి....



జై భారత్ మాత!

దివిని భువికి బహుమతిగా ఇద్దాం
తారా చంద్రులతో అలంకరించుదాం....
ఇంటింటా విద్యాజ్యోతుల్ని వెలిగిద్దాం
దేశపురోగాభివృద్దికి పాటుపడదాం....
విధ్రోహశక్తుల వెన్ను విరిచేద్దాం
మన శక్తిసామర్ధ్యాలని నిరూపించుకుందాం....
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదిరిద్దాం
మనకి మనమేసాటి అని తెలియ చెబుదాం....
చెడుకి బానిసలం కామని ప్రమాణం చేద్దాం
దేశమాతకి ముద్దుబిడ్డలమని చాటిచెబుదాం....
భరతమాత ఒడిని సుఖఃసంతోషాలతో నింపేద్దాం
బాట కఠినమైనా, గమ్యాన్ని మనం చేరుకుందాం....
పైన వ్రాసిన వ్రాతల్ని చేతల్లో చేసి చూపిద్దాం
బ్రహ్మాండమైన సంబరాలు మరింకెన్నో జరుపుకుందాం....

ప్రేమ ఒక స్వప్నం

ప్రేమ ఎంత మధురం అని అనుకున్నా
ప్రేమించి ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నా

ప్రేమలో నేను ఇంతగా కూరుకు పోయివున్నా
అసత్యాలని కూడా సత్యమని నమ్ముతున్నా

ప్రేమలో నా కంటిని నేనే నమ్మకున్నా
మెరిసేదంతా పసిడి అనుకుంటున్నా

ప్రేమలో ఎవ్వరినీ లెక్కచేయనన్నా
స్నేహితులు చెప్పింది పరిహాసమనుకున్నా

ప్రేమ నన్ను ఎంతగా మార్చిందో చెప్పలేకున్నా
నా అన్నవారినందరినీ దూరం చేసుకున్నా

ప్రేమతో నా హృదయాన్ని నేనే గాయపరచుకున్నా
మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా

ప్రేమ ఒక స్వప్నమైతేనే బాగుంటుంది అనుకున్నా
నా ప్రేమకి ఇంక అక్కడే స్థానం కల్పిస్తున్నా......

నీవు కావు..

ప్రణయానికి ప్రేరణ నీవు
విరహానికి వేదన కావు..

నా కంటి చూపునీవు
దాహాన్ని తీర్చలేని కన్నీరు కావు..

ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు..

జీవించడానికి ఆశవి నీవు
మరణానికి ఎన్నడూ మూలం కావు..

ప్రేమని కొలచిచూడు!

ప్రేమకి కొలమానం నీవడిగిన వేళ
నా గుండె గొంతు విప్పి చెబుతున్నానీవేళ
నీపై నాకున్న ప్రేమను హృదయకవాటాలని తెరచిచూడు
నమ్మకపోతే నా హృదయంతో నీ హృదయాన్ని మార్చిచూడు.

నా ప్రతిశ్వాసపై నీపేరే లిఖించాను
నీకై నా అస్థిత్వాన్నే నేను మరిచాను
నీవుకూడా ప్రేమలో హద్దులు దాటి చూడు
నా నిద్రలేని రాత్రులతో నీ రాత్రుల్ని మార్చిచూడు.

నా ప్రేమ కన్నీరై ప్రవహించినవేళ
ఆనీరే నీ హౄదయాన్ని కడిగి వేస్తుందావేళ
ఆరోజు కుడా నా పెదవి నీపేరే పలుకుతుంది చూడు
ఆ పలుకులకి ప్రతిస్పందనగా నీవేమైనా పలికి చూడు.

నీకై నా జీవితాన్నే అర్పిస్తాను
నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను
అప్పుడు నీ హృదయమెలా ఘోషిస్తుందో చూడు
నా ప్రేమని నీ ప్రేమతో కొలచివెల కట్టలేవు చూడు.

స్నేహమంటే!!!

చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంకాదు స్నేహమంటే
జీవితంలో పైకి ఎదగడానికి మెట్టది***
రోజూ ఒకరినొకరు చూసుకోవడంకాదు స్నేహమంటే
మనల్ని మనం అద్దంలో చూసుకుంటే గుర్తుకొచ్చేదది***
కాలక్షేపానికి రోజూ కబుర్లు చెప్పుకోవడంకాదు స్నేహమంటే
గుండెలపై చేయివేసుకుంటే గుర్తుకొచ్చే అనుభూతది***
పేరు పేరునా పిలచి పలకరించుకోవడంకాదు స్నేహమంటే
పదిమందిలో మనపేరుతో పాటు పలుకరించే పదమది***
ఎన్నటికీ ఎడబాటే ఎరుగనిది స్నేహమంటే
దూరమైనా దగ్గరగా ఉన్నామన్న భావమది***
కలసి ఉండాలని కలుకనడంకాదు స్నేహమంటే
భాధ ఇక్కడైతే అక్కడ కన్నీరు కార్చేదది***
ఆనందంగా జీవించడానికి ఔషదంలాంటిది స్నేహమంటే
అన్నింటినీ మరిపించి హాయిగా నవ్వించగలదది***
ఒక్కరోజు శుభాకాంక్షలతో సరిపుచ్చుకుంటే సరిపోదు స్నేహమంటే
చిన్ననాటి నుండి చివరివరకు ఉండే చక్కని బంధమది***
నేను ఒప్పుకోను మన బ్లాగ్ మిత్రులంతా దీన్ని కవిత్వమంటే
నన్ను తిట్టినా మొట్టినా మీకందరికీ అంకితమిది***

కాయగూరలతో కబుర్లు!!!

పద్మా...పూలపై, ప్రేమపై, జీవితంపై ఇన్ని రాసావు...మమ్మల్ని రోజూ ఉపయోగిస్తూ కూడా ఒక్కటైనా మాగురించి వ్రాయాలనిపించలేదా? అంటూ ప్రశ్నించాయి....
ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తున్న నాతో...
వంకాయ...వద్దు వద్దంటూనే వండిన విధంగా వండకుండా వివిధ విధాల్లో వండుకుని తింటారంటూ వయ్యారాలుపోయింది.
బెండకాయ...జిగురని, ముదురని, పుచ్చని అంటారేకాని అందరికీ నా తెలివితేటలు ఎంతైనా అవసరమంది.
చిక్కుడుకాయ...చిన్నగా, సన్నగా, గింజవున్నా, లేకపోయినా చీల్చి చెండాడి నారతీసి మరీ వండుకుంటారని చిన్నబోయింది.
గుమ్మడికాయ...ఆకారంలో పెద్దనైన నాకు కూరల్లో మొదటి స్థానం ఇవ్వకపోయినా గృహంలో అడుగిడాలంటే నేను లేనిదే జంకుతారెందుకంటూ గుసగుసలాడింది.
మునక్కాయ...ముక్క ముక్కలై నేను మునగనిదే సాంబారుకి రుచెక్కడిదంటూ ముద్దు ముద్దుగా మూలిగింది.
సొరకాయ...సొంత సోది నాకు లేదుకాని పప్పుకి, దప్పళానికి నేను చేదోడు వాదోడునంది.
దొండకాయ...పండుగా నేను పనికిరానని, చిన్నదాన్నైనా ఉడకడానికి కాస్త బెట్టు చేస్తానంటారే కాని నన్ను ఇష్టపడేవారున్నారంది.
కాకరకాయ... చేదు చేదంటూనే దాన్ని విరచడానికి విశ్వప్రయత్నంచేసి ఆరోగ్యానికి మంచిదని కిమ్మనకుండా కమ్మగా తింటారంది.
అరటికాయ...అల్లం, ఆవపోపుతో నన్ను అలంకరించి మరీ ఆరగిస్తారు అది చాలు నాకంది.
మిరపకాయ...నేను లేనిదే మిగతా కూరగాయలకి ఉనికెక్కడిదంటూ, మీసాలు మెలివేస్తూ మిడిసిపడింది.
పొట్లకాయ...పొడుగైనదాన్నని పొగరునాకేల, పనిజరగాలి కాని పొగడ్తలతో నాకు పనియేలనంది.
టమాట...కూరగాయల సామ్రాజ్యానికే మహారాణిని, నాకు వేరొకరితో పోలికేలనంది.
దుంపకూరగాయలు...దురదని, వాతమని మా జాతిని ఎవ్వరూ వదలకుండా పిండి పిప్పిచేసినా మాకు ఆనందమేనంటూ ఆలు(బంగాళా దుంప) అలవోకగా నవ్వింది.
ఆకుకూరలు...అతితక్కువ ధరలో అందరికీ అత్యవసరమైన ఆహారం మేమేనని అదే మాకు ఆదర్శమంది.
క్యాబేజి, క్యారెట్, కాలీఫ్లవర్...దొరలనుండి దొరలి వచ్చినా మాకు భాష రాకపోయినా కాకాలు పట్టవలసిన అవసరం లేదు, ప్రస్తుతం మాదే పైచేయంది.
పద్మా!! మా పలుకులెప్పుడు ఆలకిస్తావంటూ ఫలాలన్నీ పరుగున వస్తున్నాయండి!!!
అమ్మో!!...ఇదేదో పోటీల వ్యవహారంలా తయారయ్యేటట్లు ఉందండి!!!
ఇంతటితో ముగిస్తాను.....చిత్తగించండి!!!