గిల్టునగ...

వలపు పేరిట నడుము వంపులన్నీ ఒత్తుతూ

వజ్రాలవడ్డాణం చేయిస్తాను అంటివి ఆనాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు

అందాలు అన్నీ ఆహా ఓహో అని ఆరగిస్తూ
రెండు చేతులకూ అరవంకీలంటివి ఆనాడు
ఆ అందాలే ఏం చూడనని అలసినావు నేడు

చిలిపి చేష్టలతో చెక్కిళ్ళు రెండూ నొక్కుతూ
చంద్రహారం మెడలోన వేస్తానంటివి ఆనాడు
చెప్పింది చేయనంటూ చతికిల బడితివి నేడు

నిషా ఎక్కిస్తున్నానని నడిరేయంతా నలిపేస్తూ
మెడకు పచ్చలనెక్లెస్ పెడతానంటివి ఆనాడు
నిషా దిగినాక నీరసంగా కూలబడ్డావు నేడు

ముద్దమందారాన్నని ముద్దుపై ముద్దులెడుతూ
ముక్కుకు ముక్కెరా నత్తూ అంటివి ఆనాడు
మోజు తీరెనేమో ముఖం చాటేస్తున్నావు నేడు

వలచినంత కాలం నగలంటినీ ఆశచూపిస్తూ
మెరుపులేక నాణ్యత తగ్గినాదంటివి ఇప్పుడు
విలువలేని గిల్టునగ నీవు విసిరేస్తున్నా చూడు

అవునేమో..


ఏ బాధ అయినా చెప్పడం కన్నా
అనుభవిస్తేనే బాగా అర్థమౌతుంది
నా కష్టం నీకు రావాలని కాదు..
ఆ బాధ మనతో అలా చెప్పిస్తుంది!

ఓ నెగ్గిన వ్యక్తిని ప్రశంసించే కన్నా
ఓడిన వ్యక్తిని ఓదారిస్తే తెలుస్తుంది
గెలచినవారిని పొగడవద్దని కాదు..
ఓటమివ్యధ ఒంటరిలో రెట్టింపౌతుంది!

ఏ గాయంపై పూసిన మందు కన్నా
మరొకరి గాయం మనది మాపుతుంది
అలాగని మీరు గాయపడాలని కాదు..
గాయమే గాయానికి ఔషధమౌతుంది!

ఓ కడుపు నిండా తిన్న వ్యక్తి కన్నా
కాలే కడుపుకే ఆకలంటే తెలుస్తుంది
ఆకలితో అలమటించాలని కాదు..
ఆకలే అవసరానికి ఆశ్రయం ఇస్తుంది!

ఏ తీపి జ్ఞాపకమో గుర్తురావడం కన్నా
మరవాలన్న మరుపే గుర్తుకొస్తుంటుంది
తీపిస్మృతులు తలచుకోకూడని కాదు..
మరుపు గతంగుర్తుగా గమ్యంచూపుతుంది!

ఓ నిశ్చింత నిగూఢ నిర్మల మది కన్నా
నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది
నిరాశానిస్పృహతో నీరశించమని కాదు..
లోకజ్ఞానం నిర్లక్ష్యం నుండే ఉద్భవిస్తుంది!

ఎన్నెన్నో..

చలి చీకటి రాత్రిలో చిందులు వేస్తుంటే
మండుతున్న మనసుమంటలు ఆర్పలేక
బదులివ్వని బ్రతికున్న శవంలా చూస్తూ
భూమికి భారమైన శరీరాలు ఎన్నోగా..

సమయం సరదా సాఫీగా సాగుతుంటే
కరుగుతున్న కాలాన్ని ఎలాగో ఆపలేక
అల్లరిచిల్లరిగా అరచి తాగితిని తిరిగేస్తూ
బేకారు ఉనికిలేని జీవితాలు ఎన్నోగా..

అందంగా ప్రకృతి ప్రళయం సృష్టిస్తుంటే
ఏం జరిగిందో జరుగబోతుందో తెలియక
అన్నీ కోల్పోయి కూడా ఏదో ఆలోచిస్తూ
తిరుగాడుతున్న మృతదేహాలు ఎన్నోగా..

సుఖం సుడిగాలి ఊబిలోకి గుంజేస్తుంటే
నడవలేనన్న కాళ్ళతో నాట్యం చేయలేక
జీవిత సుడిగుండంలో మునగేసి లెగుస్తూ
స్మశానానికి సాగే బ్రతుకులు ఎన్నోగా.. 

నాతో నాకేంపని!

అంతా హైబ్రిడ్ హైక్లాస్ తిండే తింటున్నారుగా
పౌష్టికాహార బలంతో అవసరం మనకేముంది!

వేసుకున్న వస్త్రాలు చిన్నవై చిరిగి ఫ్యాషనవ్వగా
ఇంక సిగ్గుని సింగారించుకోవల్సింది ఏముంది!

కాగితం పూలూ ప్లాస్టిక్ పుష్పాలే అలంకారంగా
పరిమళ సువాసనలు కోరడంలో అర్థమేముంది!

ముఖం అంతా మేకప్ వేసుకుని మురుస్తారుగా
సుందర రూపలావణ్యం ఎక్కడ కనబడుతుంది!

ఉపదేశించవలసిన బోధకులే బ్రోకర్లై ఉన్నారుగా
ఇక విద్యాజ్ఞానం ఎక్కడ నుండి పుట్టుకొస్తుంది!

అన్ని ప్రోగ్రాంస్ కేబుల్ కనక్షన్లై వస్తున్నాయిగా
సంస్కారసభ్యతలు తెలిపే ఆస్కారం ఎక్కడుంది!

వ్యాపార లావాదేవీలు యమ జోరుగున్నాయిగా
ఆదరింపులూ ఆశీర్వాదములతో పనేముంటుంది!

అందరూ డబ్బు కూడబెట్టడంలో బిజీగున్నారుగా
ఇక దయకు దాక్షిణ్యాలకు తావేమి ఉంటుంది!

బంధాలూ బంధువుల మాటలన్నీ మొబైల్లోనేగా
కలిసి చెప్పి చర్చించుకోవటానికి 
ఇంకేంమిగిలింది!

నా లోకం..

జీవితం బహుమతిగా ఏమిచ్చినా స్వీకరించేస్తా
నా కోరికలు కలలని చెప్పడం మానివేస్తున్నా..

పట్టుకుని పరాయిలా పారిపోతే చేయి వదిలేస్తా
నా హృదయానికి దగ్గరైన వారినే చేరదీస్తున్నా..

అర్థం చేసుకోకుంటే నా బాధలకు ముసుగువేస్తా
నా గాయాల్ని దాచేసి ముందుకు అడుగేస్తున్నా..

అనవసర పరిమితులను మితం చేసుకుని జీవిస్తా
నా సొంత వాళ్ళైతే కలుస్తారుగా వేచిచూస్తున్నా..

అనుభవసారం తెలిసిన నాకునేను ఓదార్పునిస్తా
నా పలకరింపంటే పళ్ళికిలించడం కాదంటున్నా..

పెద్దవ్యక్తుల పరిచయంలో చిన్న
గా అవ్వక విడిచేస్తా
నా చిన్నిలోకానికి నేనే మహారాణినై ఏలుకోనున్నా..