ఇది చాలు...


చేయి చేయి కలిపి

నడిచినా నడవకున్నానేమీ...
జ్ఞాపకాల్లో కలిసిమెలసి
నవ్వుకుంటే చాలు!!

ఎదురుగా కూర్చుని
కబుర్లు చెప్పకపోతేనేమీ...
మనసులో నిండుగా
ఉండిపోతే చాలు!!

నిరాశ నిస్సహాయతలో
నిష్టూరపు వాక్యలాడనేమీ...
విడచి ఉండలేనట్టి
వలపుజాడ్యమనుకో చాలు!!

చేతిలోన చెయ్యేసి
బాస చేయకపోతేనేమీ...
నన్ను నా ప్రేమను
నమ్మితే చాలు!!

ఆశలను నేరవేర్చక
అలుక తీర్చకుంటేనేమీ...
అనురాగ అభయహస్తం
అందిస్తే చాలు!!

చావు వరకూ చెరిసగం
కాకున్నా మాత్రమేమీ...
అర్ధంతరంగా మధ్యలో
వదిలివేయకు చాలు!!

నీ రోగం కుదుర్చుకో...

జీన్స్ ప్యాంట్లో నొక్కబడ్డ పిర్రల్ని చూసి పిచ్చెక్కేస్తుందని
జాకెట్ హుక్కుల మధ్య రొమ్ములు బిగుసుకున్నాయని
చీరకట్టులో వంపుసొంపులు వద్దనుకున్నా పదిలమేనని
చుడీదారు వేసి చున్నీ చుట్టుకుంటే చూడ్డానికేం లేదని
మిడ్డీలు వేసినా జబ్బలషర్ట్ చూసినా బాడీషేక్ అవునని
లంగా జాకెట్టు పై పైట కప్పుకోకుంటే పై ఎద పొంగునని
బికినీబాడీలు భారతీయ సంస్కృతి ఎంత మాత్రం కాదని
మ్యాక్సీలు రాత్రుళ్ళు వేసుకుని ముడుచుకు పడుకోమని
స్త్రీ వస్త్రధారణపై వెయ్యినొక్క వ్యాఖ్యలు వల్లించే వీరులారా
చూస్తేనే కారిపోయేంత వీక్ అన్నమాట మీ వీర్యకణాలు!

నిండుగ చీరకట్టి నుదుట బొట్టు పెట్టుకుంటే పత్తిత్తులని
ప్యాంటుషర్టు వేసుకుని బయటకు వెళితే పోరంబోకుదని
కాళ్ళకు మెట్టెలు మెడలో మంగళసూత్రాలే ముత్తైదువని
ఆడది ఎప్పటికీ తానుగా ఉండకూడదా అలంకరించుకుని
ఇంటిపట్టున వండి వడ్డిస్తే ఆమెను ఆహా గొప్ప సతి అని
బయట పనిచేసి ఇల్లు చక్కబెట్టుకున్నా బరితెగించిందని
పాటుపడే దానికన్నా పరాన్నజీవైన పెళ్ళామే బెల్లామని
తెలివితేటలే కాదు అన్నిటా ఆమె ముందున్నా అదిదని
మాట్లాడ్డమే మగతనం అనుకునే మెండైన మగవాళ్ళారా
చూసేచూపు ఆలోచనా ధోరణి మార్చి సర్దుకో నీగుణాలు!

ఎగసిపడకే...

పాత కిటికీగుండా కొత్తసూర్యకిరణాలు చూసి
మార్పు తప్పక వచ్చునని కనురెప్పలాడించి
కొత్తకోరికలను పాత అందాలతో ముస్తాబుచేసి
వసంతంలో వర్షం కోసం ఎదురుచూడ్డం కదా?

కోకిలలన్నీ పావురాలుగా మారి ఆకశాన్నెగసి
ప్రేమలేఖల్లోని అక్షరాల్ని రాయబారం అందించి
వాడిపోయిన వలపుసెగను వింజామరతో రాజేసి
మండుటెండలో మంచుముద్దని కోరినట్లు కదా?

గాలితెమ్మరలు ఋతువులన్నిటితో బాసట చేసి
పువ్వుల్లో దాగిన తీపిని తేనేపట్టుగా రంగరించి
జుర్రుకోకుండా జారిపోరాదంటూ మైనంతో మూసి
కాగడాతో కాల్చి కరిగిపోకనడం అన్యాయం కదా?

నిర్జనమైన వనంలో పరిమళ పుష్పాలను చూసి
అందమైన లోకమన్నాదని ఆస్వాదించి రమించి
వికసి విప్పారినంతకాలం దగ్గరుండి ఆపై విసిరేసి
నేలరాలిన పుప్పొడితో సంపర్కం కుదరదు కదా?