ఎలాచెప్పను?

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
వేటగాడివి నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
నిన్ను మరణించమని ఏలాచెప్పను?

వృధ్ధాప్యం!

ముళ్ళబాటలో పయనిస్తున్న నాకేం తెలుసు పూల సుకుమారత్వం
నన్ను నేనే మరచిన నాకేం తెలుసు ఎదుటివారిని గుర్తుపట్టడం
పలుచటి గంజికై ప్రాకులాడే నేను ఆశించలేను పాలపాయసం
పరుల చెంత చేరిన నాకెక్కడివి పట్టుపరుపుల సోయగం
వృధ్ధాప్యంలో ఎందుకులే ఈ జీవిత సారం
నీకై ఎదురు చూస్తున్నాను...ఓ మరణం!

ఆచరించడానికి ఆరు!

మీ దయాదాక్షిణ్యాలు మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తాయేమో
అయినా చలించక దయ చూపండి.

మీ సహాయసహకారాలు నిరుపయోగమై ఎవరూ గుర్తించరేమో
అయినా నిరాశపడక సహాయపడండి.
మీ నిజాయితీని ఎవరూ హర్షించక మిమ్మల్ని గేలిచేస్తారేమో
అయినా నీతినియమాలతో జీవించండి.
మీ భక్తిశ్రద్దలు ఎదుటివారికి చాదస్తంగా అనిపిస్తాయేమో
అయినా మీ నమ్మకం మీదనుకోండి.
మీ విజయపధంలో అవరోధాలెన్నో ఏమో
అయినా వెనుతిరుగక ముందుకి సాగిపొండి.
మీ మంచితనాన్ని ఎదుటివారు గుర్తించరేమో
అయినా మంచిని మరువకండి.

ఆ నలుగురు!!!!

ఒక రాజుగారికి నలుగురు భార్యలు....
నాలగవభార్య
అంటే ఎంతో ముద్దు అందుకే ఆవిడని వస్త్రవైఢూర్యాలతో మురిపించేవాడు.
మూడవ భార్యని
కూడా మురిపంగానే చూసుకునేవాడు, ఆవిడని ఒంటిస్తంభం మేడలోవుంచి ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవాడు ఆవిడ తనని వదిలి సామంతరాజులతో వెళ్ళిపోతుందేమోనని భయం.
రెండవభార్య
అంటే అమితమైన అభిమానం, ఆవిడ రాజుగారికి అన్నివిధాల సహాయం చేసే శాంతమూర్తి మరియు సలహాదారిణిగా వ్యవహరించేది.
మొదటి భార్య
గురించి చెప్పాలంటే, ఆవిడ పట్టపురాణి. రాజుగారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆయన ఆలనాపాలనా చూసుకునేది. కాని రాజుగారు ఆవిడని పట్టించుకునేవారుకాదు, అది కనపడకుండా గాంభీర్యం అనే ముసుగువేసుకుని ఆవిడతో గడిపేవారు.
ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి.....

రాజుగారికి అనారోగ్య కారణంగా ఆయనలో మృత్యుభయం చోటు చేసుకుంది.

నాలగవభార్యని
పిలచి నిన్ను నేను అమితంగా ప్రేమించాను నాతో పాటు మృత్యువులో తోడుంటావా అని అడిగితే లేదు అని ఆవిడ చెప్పిన సమాధానం రాజుగారి గుండెలో బాకులాదిగింది.
మూడవభార్యాని
తోడు రమ్మంటే...నేను రాలేను నా జీవితం ఎంతో మధురమైనది మీరు మరణించిన పిదప నేను వేరొకరిని వివాహమాడుతానన్న మాటలకి రాజుగారు కృంగిపోయారు.
రెండవభార్యతో
నీవైనా నా వెంట వస్తావా, నాకు ఇన్నాళ్ళు అన్నింటిలో సహాయ, సలహాలనిచ్చావుగా చరమాంకంలో కలసి పయనించమని వేడుకున్నాడు. దానికి ఆవిడ మీతో కలసి రాలేను కాని కడవరకు మిమ్మల్ని సాగనంపుతానంది.
"నేను వస్తాను మహారాజా మీవెంట మీరు ఎటువెళితే అటు"... అంటూ మొదటిభార్య గొంతు నిస్తేజంగా కృంగిపోతున్న మహారాజవారికి వినిపించింది. అప్పుడు చూసారు నీరసంతో క్షీణించిన మహారాణిగారి వంక, మనసుని నులిపెట్టే భాధతో అనుకున్నారు అయ్యో! నేను ఇంతకాలం ఈవిడనా నిర్లక్ష్యం చేసింది, తనని శ్రద్దగా చూసుకోలేక పోయానని అప్పుడు పశ్చాతాప పడ్డారు.

మనజీవితంలో ఆ నలుగురు.....
నాల్గవభార్య మన శరీరం:- మన శరీరాన్ని యవ్వనంలో ఎంతో మోహించి, శ్రద్దవహించి, ఎంతో సమయాన్ని వెచ్చించినా సమయానికి అది మనతో సహకరించదు.
మూడవభార్య మన అధికారం ఆడంబరం:-
మనల్ని మృత్యువులో వీడి వేరొకరికి సొంతమౌతాయి.
రెండవభార్య సంసారం సంతానం:-
ఎంతమనకి సహాయంచేసి సహకరించి సలహాలిచ్చినా వారు సాగనంపటానికే కాని సాంతం మనతోరారు. మొదటిభార్య మన ఆత్మ:- ఆడంబరాలకి, ఐశ్వర్యార్జనకు, పేరు ప్రతిష్ఠలకై మనం ఆత్మని ఎంత అశ్రద్ద చేసినా కడవరకు తోడుంటుంది.

2010కి స్వాగతం...

పెరగాలి మనందరిలో ప్రేమానురాగాలు
తరగాలి నిత్యావసర వస్తువుల ధరలు
చేసుకోవాలి అందరు నూతన ప్రణాలికలు
నెరవేరాలి మన అందరి అభిలాషలు
విరియాలి ప్రతి ఇంటా సుఖఃసంతోషాలు
కావాలి అవి మనకి నూతనోత్సాహాలు
సహకరించాలి మనకి పంచభూతాలు
పెంచాలి అవి మన సిరిసంపదలు
చేయాలి బ్లాగ్ మిత్రులందరూ మరిన్నిరచనలు
దోచేయాలి అవి మనందరి హృదయాలు
చెప్పేయాలి మనమందరం 2009 కి వీడ్కోలు
పలకాలి మనం ఆశలతో 2010 కి స్వాగతాలు.

"అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు"