చక్రంలేని ఇరుసు

నా మనసంటే అతడికి ఎప్పుడూ అలుసే
బహుశా నేనతడిని రమ్మన్నందుకో ఏమో
లేదా ఎందునా సరితూగను అందుకేనేమో
నా బ్రతుక్కి పెట్టుబడి వడలిన నా సొగసే
బహుశా ప్రేమన్నది నా వ్యాపారమో ఏమో
లేదా అనుభవాలు నే పొందిన లాభమేమో
నా కన్నీటి కధలు చేష్టలూ తనకు బిరుసే
బహుశా నేను తన గూటిచిలుకని కానేమో
లేదా తెగిపోయిన గాలిపటపు తెగ నాదేమో
నా కోరికల ఖరీదు తనకు బొమ్మా బొరుసే
బహుశా నా ఆశల అంగడి బరువైంది ఏమో
లేదా తన వాంఛలకు విలువ నే కట్టలేనేమో
నా అనుభూతులన్నీ అతడి కంటికి నలుసే
బహుశా ఆలోచనల్లోని తారతమ్యమో ఏమో
లేదా మా ఇద్దరి వయసుల వ్యత్యాసమేమో
నా సావాసం అతడికి శవం ఇస్తున్న భరోసే
బహుశా నాది ఏ బంధంలేని అవసరం ఏమో
లేదా ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయతేమో

సగటు ఉద్యోగిని..

అన్నింటా సమానత్వమంటూ రెచ్చిపోయి
తీసిపోమని లేనిపోని ఢాంభికాలకు పోయి
ఉద్యోగం చేస్తూ అక్కడిక్కడా నలిగిపోయి
ఏంచెప్పుకోని వెర్రిమాలోకాలం మేమోయి!

ఉద్యోగినుల పై జాలి ఎలాగో లేకుండాపోయె
దానికేం అన్నీ తెలిసినాడదని అపవాదాయె
ఇంటిని ఏలే ఇల్లాలేమో అమాయకురాలాయె
అన్నీ సర్దుకుపోయే ధిమాకోళ్ళం మేమాయె!

మేమెంత కష్టపడ్డా మాకు గుర్తింపే లేదాయె
బయట జల్సా చేస్తుందనే నింద మాకేనాయె
ఉద్యోగినులు అంటే ఇంటాబయట అలుసాయె
అవేం పట్టించుకోని గుండె నిబ్బరం మాదాయె!

సంపాదన కష్టనష్టాలు మాకు తెలుసునాయె
కావాలని అడగటానికెంతో మొహమాటమాయె
ఇల్లాలికి ఉండే కాస్త తీరిక మాకు లేకపాయె
ఇంటికి చేదోడూ సలాహాదారులం మేమాయె!

పనిచేసే స్త్రీలకి ఎప్పటికీ ఆదరణ కరువేనాయె
గారాలుపోయే ఆడాలంటే మగాడికి మోజాయె
అవుననీ కాదనీ వాదించినా వాస్తం ఇదేనాయె
ఏదైతేనేం ఉద్యోగిని పని చేయక తప్పదాయె!!

ఆరని ఆశలు

ఆశల కొక్కానికి కొన్ని కోర్కెలు వేలాడదీసాను
రాత్రివేళ మంచు కురిసి తుప్పు పట్టింది ఏమో
ఆశలరెక్కలు రాలిపోబోతుంటే చమురును అద్ది
ఊగిసలాడుతున్న ఊహలకు ఊతమిస్తున్నాను!

ఆరని మోహాల మత్తులో మనసుని జోకొట్టాను
తీరనిదాహంతో నిశ్చింతకు నిద్రపట్టలేదో ఏమో
ధీమా ఢీలాపడి వికారంగా వాంతిచేసుకో బుద్ది
గతాన్ని నరికివేసి సంతోషాలని సర్దుతున్నాను!

ఆవేశానికి ఆనకట్టవేసి ఆలోచనల్లో బంధించాను
గాలికి ఎగిరిపడే చంచలధూళి తడిబారెనో ఏమో
మొహమాట మోజుబూజుపై మొట్టికాయలు గుద్ది
కొన్ని జ్ఞాపకాల్ని బొంతలా కుట్టి కప్పుకున్నాను!

ఆలోచిస్తూ ఆకాశంవైపు అదోలా చూస్తుంటాను
ఏం ఆశించి పాక్షికంగా కలగంటున్నానో ఏమో
తప్పని తెలిసి కూడా ఆరి అరిగిన కోర్కెలనే దిద్ది
తలపుల ఎడారిని తడిపే కళ్ళాపి జల్లుతున్నాను!
 

పోలీసోడి పెళ్ళాం..

ఖాకీపొలంలో వలపువిత్తుల నారెడుతున్నా
పోలీస్కి ప్రియురాలినై హక్కులుకోరుతున్నా
యూనిఫాం నీతికి అద్దమని చదువుకున్నా
వారికది మరింత బలమని తెలుసుకున్నా
సమస్య సావధానంగా తెలుసుకోమంటున్నా
నమ్మకాన్ని లంచంగా అడుక్కోవద్దంటున్నా
శాంతి పర్యవేక్షరక్షణ గురించి తెలియకున్నా
సురక్షితంగా ఉంచే బాధ్యతని అప్పగిస్తున్నా
తుపాకీ తూటాలతో పావురాల్ని కాల్చకన్నా
గూండాల గుండెలవైపు గురిచూపమంటున్నా
దొంగలపై నిఘావేసి మదిలో నిదురపొమన్నా
ప్రేమతో విధులు నిర్వర్తించమని చెబుతున్నా
ఎండవాన రేయింబవళ్ళూ కాలం చూడకున్నా
రక్షించేవాడే రక్షకభటుడని నిరూపించుకోకన్నా
చిట్టచివరికి భద్రతా భరోసా మాటలు ఎట్లున్నా
పోలీసోడి పెళ్ళామైతే మస్తేమో అనుకుంటున్నా

అన్నీ తెలిసీ..


ఆచార వ్యవహారాలను క్రిందా పైనా కాచి వడపోసి


పండిత పామరులందరితో వితండవాదనలెన్నో చేసి

తెలుసుకున్న పుస్తకపాండిత్యం అంతా ఎగేసి దిగేసి

జ్ఞానమెంతో నింపుకుని నీ అజ్ఞానాన్ని తిరగమరగేసి

గండుపిల్లి ఎదురు వచ్చిందని పెళ్ళిచూపులు మానేసి

ఆషాడమాసం అచ్చిరాదని ఆత్రంగా ఆచారిని కలిసి

తొడపైన పెద్దపుట్టుమచ్చ ఉంటేనే అదృష్టమని తెలిసి

నేరుగా నా మనసునేం చూడక నా అందాన్ని చూసి

అగుపడిని అరుంధతిని ఆకాశాన్న చూపి మనువాడేసి

ఆగలేక ఆవేశపడుతూ శివరాత్రినాడు శోభనం చేసేసి

చేతకాక తుస్సుమన్న సంసారాన్ని చూసి తిట్టుకునేసి

సన్యాసివై సూక్తులెన్నో బోధిస్తున్నావుగా చివరికి వెరసి 

నిందాలాపం..

నీ జ్ఞాపకాలలో కూరుకుపోకుండా ఉండాలని
నన్ను నేను నిలద్రొక్కునే ప్రయత్నం చేస్తూనే
ఆశల రెక్కలను ఆడిస్తూ ఆలోచిస్తుంటాను..
నిన్ను నన్ను వేరుచేసిన వ్యవస్థను తిట్టేస్తాను!

నీ అంతట నీవు కావాలని తెలిసీ మర్చిపోవని
అన్నీ అకస్మాత్తుగా మారిపోతాయిలే అనుకునే
సర్దుకుని నన్నునే సముదాయించుకుంటాను..
అంతలోనే మాటమార్చి మనల్ని నిందిస్తాను!

నీ నా అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిదని
దూరభారపు అంచుని పట్టుకుని వ్రేలాడుతూనే
జవాబు తెలియని గట్టిప్రశ్న వేసుకుంటాను..
నేరం మనది కాదని మెదడుని మందలిస్తాను!

నీ ధ్యాస దిగులే నా మదిని నులిమే తెగులని
తెలిసీ జ్ఞాపకాల అస్పష్టతని అంతం చేయాలనే
గడిపిన గడియల కొలతలు కొలుస్తుంటాను..
వాటిని నెమరు వేస్తూ నిన్ను నేను ధూషిస్తాను!

లింకేంటో!

నీకు నాకూ మధ్య ఉన్న లింకు ఏమిటో
నీకేం తెలియదు నాకేమో అంతు చిక్కదు

మతంలేని మమతకి అడ్డంకులు ఎందుకు
అలవికాని ప్రేమకోరుతూ ఆరాటం ఆగదు

ప్రేమించి అనురాగం అడుక్కోడం ఏమిటో
నాలాంటి వెర్రిది నీకు వెతికినా దొరకదు

ప్రత్యేకత కోరుతూ పెనుగులాట ఎందుకో
నాది కాదని తెలిసీ అలమటించ కూడదు

అస్థిరంలో స్థిరత్వాన్ని కోరుకోడం ఏమిటో
నూలుపోగుతో ఏ బంధమూ ముడిపడదు

లేనిరాని హక్కు కోసం పోరాటం ఎందుకో
ఏదేమైనా నువ్వు కావాలన్న ఆశ చావదు

అర్పిత చెప్పే ఈ సూక్తులు ఎవరికై ఏమిటో
చెప్పింది చదవాలే కానీ చరిత్ర అడక్కూడదు

స్వీయ మదింపు..

తాగుబోతుతో పదినిముషాలు తర్కించి చూడు
ఒత్తిడిలేని ఒయాసిస్సు జీవితం అనుకుంటావు
భీమాఏజెంట్ తో భావాలు పంచుకుని చూడు
ఊపిరివీడి చచ్చిపోతేనే మంచిదని భావించేవు
రాజకీయ నాయకుడి పక్కన కూలబడి చూడు
నీవు చదివిన చదువులు పనికిరావని అంటావు
వ్యాపారస్తులతో లావాదేవీలు మాట్లాడి చూడు
సంపాదించినదంతా చాలా తక్కువని తలచేవు
కర్షకుడు కార్మికుడితో కాసేపు కబుర్లాడి చూడు
నీ శ్రమకు మించిన ఫలం దక్కెనని మురిసేవు
సాధువు సన్యాసి పూజారిని సంప్రదించి చూడు
ఉన్నది ఊడ్చి దానంచేసి తపస్సు చేయబూనేవు
సైనికుడితో సానుకూలంగా సంభాషించి చూడు
మీరు చేసే సేవ త్యాగాలన్నీ చిన్నవి అయిపోవు
పండిత శాస్త్రవేత్తల ప్రసంగాల్లో పాల్గొని చూడు
నీ అజ్ఞానాన్ని నీవే స్వయంగా కొలుచుకోగలవు
భార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
భువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు

ఎవరైనా!?

నాశనమవ్వడం అంటే నాకు భలే సరదా
అవ్వకుండా ఆపగలరా నన్ను ఎవరైనా!?
తన ప్రేమ నావలోన మునగడం నాకిష్టం
సమాధానపరచి పైకి తీయరా ఎవరైనా!?
చుక్కలు లెక్కించి చంద్రుడ్ని ఎంచుకున్నా
చెదిరిపోయే నన్ను సరిచేయరా ఎవరైనా!?
ఏవో తర్జనబర్జన చర్చలే జరిగి ఉంటాయి
విడివడే మనసుల్ని కలపగలరా ఎవరైనా!?
శీతాకాల సాయంత్రం పొగేదో కమ్మేసింది
మసగబారిన అద్దాన్ని తుడవరా ఎవరైనా!?
రేయంతా గాలి నన్ను గేలి చేస్తూనే ఉంది
కంటికి కునుకుని బదులీయరా ఎవరైనా!?
పద్మార్పిత పందెం ఖచ్చితంగా ఓడుతుంది
మూసిన కళ్ళని తెరిపించగలరా ఎవరైనా!?