మిగిలింది!


ఆకాశ మేఘాన్ని తాకి ప్రేమజల్లుగా కురవక
ప్రకృతితో కూడి  పిడుగువై గుండెల్ని పిండగా
నీ ఉనికి పిడిబాకై నాలో ఉప్పెనగా పెల్లుబికె!

వలపు అలగా మారి మనసు తీరం తాకలేక
కోరికల కెరటమై మనసుని కబళించబూనితే
నిన్ను నీవే కోల్పోయి నన్ను కోల్పోయినావె!

ధరణిలా దరి చేరి నాలో నిన్ను దాచుకోలేక
ప్రణయ ప్రకంపనలను పట్టి పిప్పి చేయబోవ
నీవు నలిగి నాకు నేనే శత్రువై సాక్షాత్కరించె!

చీకటి హృదయంలో జ్యోతివలె వెలగడం రాక
ఎగిసిపడే జ్వాలవై హృదయంలో మంటలురేపి
నీవు కాలి నేను కాల మిగిలింది బూడిదాయె!

వచ్చి వెళ్ళిపోకు..

ఇదిగో వచ్చి అంతలోనే వెళ్ళిపోతాను అనకు
వసంతకాలం వచ్చి క్షణాలేగా అవుతున్నాయి  
గాలి పరిమళం మారి మది పులకరించబోయె
ఊపిరి ఉల్లాసమెక్కి మత్తుకళ్ళే అరమోడ్పాయె 
నేనేం చెప్పనైనా లేదు నువ్వేం విననైనాలేదు  
అంతలోనే సద్దుమణగనీయక చల్లగా జారిపోకు!

తారలింకా నీతో ఊసులాడనేలేదు వెళతాననకు
వస్తున్న చంద్రుడేమో నిన్నుచూసి చిన్నబోయి
మన్మధుడ్ని కోప్పడగా ఓరగా రతి నిన్నుగాంచె 
వలపురాగిణులు వయ్యారంగా నిన్ను చుంబించె
నేనది చూసి ఈర్ష్యపడి కౌగిట్లో కట్టిపడేయనేలేదు   
అంతలోనే చలించి మతి మారెనని మాయమవకు!

తీరని దాహం తీర్చక అలజడికి ఆస్కారమివ్వకు
మనసులు రెండూ ముడిపడి పరిభ్రమిస్తున్నాయి
ప్రణయమేను పరిపక్వతతో నాట్యమాడ పురివిప్పె
అదిచూసి నింగి నేలను రమ్మని రాయబారమంపె
రసికత రంగులు ఇంకా పూర్తిగా పులుముకోలేదు     
అంతలోనే అలిగి ఆగలేక వంకలు వెతికి వెళ్ళిపోకు!

అ'సంతృప్తి

నా పయనం మరియు గమ్యం నీవైనప్పుడు
నీవు లేకుండా జీవించమనడం న్యాయమా?

నా ఒంటరితనం నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు

నీవే సమస్తమని నా అసమర్ధతకి తెలుపనా?

నా అభిరుచుల ఆశలపందిరై నీవున్నప్పుడు

నిన్ను ఆశించరాదని ఆంక్షలు పెడితే ఎలా?

నా తనువూ ఆత్మా నావే అనుకున్నప్పుడు

నాలో నేను లేనేలేనని అంటే అది అబద్ధమా?

నా రక్షణకవచంగా నీ ఉనికి ఉంటున్నప్పుడు

నీ నా శరీరవాంఛలు చేస్తున్నవి పెద్ద నేరమా?

నా తృష్ణకు సంప్రాప్తి మన సంగమమైనప్పుడు

నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా? 

జన్మసార్థకత..

నాలో నేను సేదతీరే గదులు ఎన్నో..
ప్రతి గదికీ వివిధ విశ్లేషణలు వివరాలు 
కొన్ని గదులు క్రొత్త సామాగ్రితో కులుకగా 
మరికొన్ని విరిగిన వాటితో చెల్లాచెదురుగా
నే రాసే అక్షరాల్లా..కాదు నా మనసులా!

ఖాళీగా ఉన్నాయి కొన్నిగదులు గొళ్ళెంవేసి

గొంతులోని మాటలు లోలోపల ధ్వనిస్తూ.. 
గోడలేమో వెలసిన రంగుతో వెలవెలబోతూ
భావాలు భాష రాక మౌనంగా సమ్మె చేస్తూ
ప్రతీకారం తీర్చుకో రాక లోలోనే దౌడెడుతూ!

ఈ తెలియని తర్కవిసర్జనలో పొరలు ఏర్పడి   

ఆ రహస్య పొరల మధ్య నవ్వు ఆవిరైపోయి
గడచినకాలపు స్మృతులు మరుగునపడగా..
అనుబంధాలు ఆప్యాయతలూ అంతరించినట్లు
చందమామలో మచ్చలా కనబడీ కనబడనట్లు!

నేను మాత్రం తొణక్కబెణక్క నిలబడి ఉన్నాను

కుళ్ళిన సంప్రదాయాలని చంపలేక పాటించరాక 
విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక
గులాబీరంగు శరీరంలో మూసి ఉన్న గదుల్లో..
విచ్ఛిన్నమవని విలువైన గదులకి తాళమేస్తున్నా!

గోప్యంగా దాచుకున్న సంస్కారం పెరిగి పెద్దదై..

చిరిగిపోతున్న మానవత్వానికి ఊపిరిపోయాలని
ఈ జన్మకు సార్థకత కూర్చి ఋణము తీర్చాలని! 

భామాప్సర..

ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతమాకు తిలోత్తమని కానంటే
నీ మేను చూడ వేయికళ్ళు చాలవే వలపువిపంచీ అంటావు!

మునినే మురిపించి మాతృత్వ రూపినైన మేనకని కానంటే
నీ కామకోరిక తీర్చేటి కల్పతరువంటి కామాక్షిని అంటావు! 

ఇంద్రియాలను రెచ్చగొట్టి కవ్వించే రంభను అసలే కానంటే
 నీ ఇష్టానుసారంగా అన్నీ అమరిన అందాలరాశిని అంటావు!  

విశ్వామిత్రుడి ఉర్వుల నుంచి ఉద్భవించి ఊర్వశిని కానంటే 
నీ ఊహల్లో ఊపిరి పోసుకున్న మోహినీనయగారిని అంటావు!

మాయచేసి మరులుగొల్పి మోహంలో పడేసే మోహిని కానంటే
నీ ప్రాణం నిలిపే అమృతభాంఢమే నా అణువణువని అంటావు!

అప్సరసల అందాలు ఏ కోణంలోను కానరావు నాలో అనంటే
నీవు నాలో చూసేది ఆత్మసౌందర్యం అప్సరోభామిని అంటావు!

ముందస్తు చూసేది మోమునే కాని మనసుని కాదని నేనంటే
నీ మనసే నాదైనప్పుడు సాక్ష్యమెందుకే సమ్మోహినీ అంటావు!

అవ్యక్త భావాలు ఆశ్రువులుగా రాల్చలేక అక్షరాలుగా రాస్తానంటే
 నీ అక్కున చేరిన అన్నీ మరిచెదవే మదికమలరమణీ అంటావు! 

మార్చి పాడవే కోయిలా..



రాతిరివేళ రగిలి గొంతు చించుకోకే కోయిలా
కొత్తరుచులు తెలియనప్పుడు నీవు పాడితే
నాడు కమనీయం అదే సర్వం కడు రమ్యం
పాతబడి నేడా రాగం వెగటుపుట్టి కర్ణకఠోరం!

నీ గళానికి కొత్తరాగమేదో నేర్పించు కోయిలా
శృతి రాగం తాళమంటే వినే వారు లేరెవ్వరు
వెర్రి పాశ్చాత్య వ్యామోహంలో గెంతులేస్తున్నాం
నీకు కూడా పాప్ రాగాలతో షేక్ సమంజసం!

పిలవని పిలుపుగానైనా ప్రేమతో రాకే కోయిలా
రాగానికి కొన్ని రంగులద్దుకుని తూగుతూ రావే
గళంతో పనిలేదు వేషాన్ని మార్చి గెత్తులేయడం
బ్రేక్ డాన్సులంటూ స్టెప్పులు వేస్తూ అరిచేయడం!

తొలకరీ పాటనే పరవశాన్న పాడబోకే కోయిలా
వినీ వినిపించని పదాలు పాడుతూ కేకలు పెట్టు  
గుండెకోత ఆక్రందనల్ని కేరింతల్లో కలిపితే క్షేమం
ఏగూటి పలుకులు అక్కడ పలకడమే న్యాయం!