జబ్బుదేజాతి!?

కులమతాలతో పట్టింపులేని జబ్బులకు నా సలాం
నిమ్నజాతైనా నీతిమాలినా అన్నీ వాటికి సమానం
బేధభావాలు లేనట్టి జబ్బులకి అందరమూ గులాం!
ఏజాతైనా ఆజాతికేగా పుట్టి అక్కడేగా పెరుగుతాం
అందుకే నా జాతికి అన్యాయం జరిగెనని అరుస్తాం
అదే వేరేజాతికి జరిగితే మూసుకుని కూర్చుంటాం!
రోగాలు ఎప్పుడూ కనబరచవు ఎటువంటి వత్యాసం
మొన్న పుట్టిపెరిగిన కరోనా వైరసే దీనికి నిదర్శనం
ఆసుపత్రిలో చేరడానికి అక్కర్లేదు ఏ ప్రత్యేక కులం!
ఎవరి కులాన్ని వారు సమర్ధిస్తే ఏమిటి గొప్పతనం
నా మతం నాజాతి మనోళ్ళని పలుమార్లు చెప్పడం
వారికి వారే జాతి కులాలను పలికి వక్కాణించటం!
అంటు వ్యాధులది అదో రకమైన అభిమాన తత్వం
అధికపేదని కాక అంటినాతుమ్మినా అంటేటి గుణం
ఉమ్మడిగా అంటుకుంటే ఊడ్చిపెట్టుకుపోతాం మనం!
కులం చూసి కూడెట్టే మనిషికన్నా రోగాలు నయం
మందులేస్తే మతం చూడక మరణించి ఇచ్చు ప్రాణం
రాజకీయ రాజ్యాంగం తెలియని రోగంలా కలిసుందాం!

గప్ చుప్..


చిన్నతనంలో లొడలొడా మాట్లాడేస్తుంటే
అమ్మ అనేది....చుప్....నోరుమూసుకోవే
ఆడపిల్లలిలా ఎక్కువ మాట్లాడకూడదని!

కొంచెం పెరిగిపెద్దయ్యాక మాట్లాడేస్తుంటే
అమ్మ మందలిస్తూ అనేది చాలింక ఆపవే
ఎదుగుతున్న పిల్లవు కుదురు ఉండాలని!

యవ్వనంలో నాక్కావల్సినవి అడిగేస్తుంటే
అమ్మ గట్టిగా కేకలు వేస్తూ సర్దుకునిపోవే
రేపు వేరొకరి ఇంటికి వెళ్ళాల్సినదానివని!

అత్తగారింట్లో అడుగిడి మాట్లాడబోతుంటే
అత్తగారు అనేది...ష్....నోరు మెదపకువే
ఇది నీ పుట్టినిల్లు కాదు మాట్లాడ్డానికని!

ఇల్లు చక్కబెట్టే ఇల్లాలిగా ఏమన్నా అంటే
భర్త మందలిస్తూ అనే చెప్పిందిక చాల్లేవే
లోకమంటే అసలు నీకు ఏం తెలుసునని!

ఉద్యోగం చేస్తూ వాస్తవాలు చెబుదామంటే
పనిచెయ్యాలనుకుంటే చెప్పింది చెయ్యమనే
అధికారి ముందు నోరు ఎత్తితే వ్యర్ధమని!

వయసు కాస్త పెరిగాక మాట్లాడదామంటే
పిల్లలు అంటున్నారు...గప్ చుప్ ఉండని
ఈ విషయాలతో నాకు అసలు పనేమిటని!

వృద్ధాప్యం వచ్చాక ఏదైనా చెప్పబోతుంటే
ష్....ష్.....ష్......ఇక చెప్పడం ఆపేయమని
మాట్లాడకు విశ్రాంతి అవసరమంటున్నారు!

ఈ నిశ్శబ్ద ఆత్మలోతుల్లో నుంచి అరవాలని
చెప్పాల్సినవి అన్నీ మనసు విప్పి చెప్పాలని
అంతలో......గప్ చుప్ ఆగంటూ అరుపొకటి
ఇంతకాలం మాట్లాడక ఇప్పుడేం మాటలని
ఆకాశం చేతులు చాచి వచ్చేయమని అంటే
చివరికి మౌనంగానే అంతం అయిపోయాను!

నేను నేనే...

నేనొక విచిత్ర విహంగాన్ని!
మబ్బులకు భయపడి వానంటే పడిచస్తా
గాల్లో ఎంత పైకెగిరినా నేలనొచ్చి తాకేస్తా
అవును నేనో చిత్రవిచిత్ర విహంగాన్ని...

నేనొక విశాల సాగరగర్భాన్ని!
సముద్రరాయైనా ఇసుకనై ఒడ్డుని కలుస్తా
ఇంద్రధనస్సులా ఏడు రంగులు మారుస్తా
అవును నేనో అలుపెరుగని సముద్రాన్ని...

నేనొక వింత నిగూఢతత్వాన్ని!
నన్ను విసిగించే విషయాన్ని నేను విసిగిస్తా
కోపంతో అలిగినా వాటిగురించి ఆలోచిస్తా
అవును నేనో వింత మనస్తత్వవేత్తన్ని...

నేనొక విలక్షణ విస్పోటకాన్ని!
మనసున ఏమున్నా ఉన్నదున్నట్లు చెప్పేస్తా
ప్రేమిస్తే ప్రాణం తియ్యను కానీ నాదిచ్చేస్తా
అవును నేనో ముక్కలైన విస్పోటకాన్ని...