అటు ఇటుకాని.,

నింగిలోని చుక్కలు వీడ్కోలు పలకడమే తడవు
గరిక కొనల్లోని సూర్యుడు మేల్కొన్నది మొదలు
ఉండీ లేనట్లున్న జ్ఞాపకాల నడుమ రాయబారమే
ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె!! 

ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని తలుస్తూ
నవ్వులు రువ్వ అంతలో ఆకశాన్న ఉరుము మెరవ
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!

హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుకిచ్చి
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని 
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
దిక్కుతోచని గమ్యం అవిటిది అయిపోయి మూలపడె!!

మేలుకో..

హేయ్ నా అల్లరి వయస్సా..
నేను ఏదో చేస్తూ గెంతులేస్తాను
నువ్వు మాత్రం పట్టనట్లుంటావు
బాల్యాన్ని లాక్కుని నవ్వగలవు
నా పసిమనస్తత్వాన్ని ఏం చేయలేవు!

ఓయ్ తెలుసుకోవే వెర్రి మనసా..
ప్రతీ మాటకు సమాధానం ఉండదు
ప్రేమించే ప్రతీ మనసు నిర్మలం కాదు
ప్రతిప్రాణికీ ఏదోక పిచ్చి ఉండక తప్పదు
అలాగని ప్రతీ ఒక్కళ్ళు పిచ్చివారు కాదు!

హాయ్ నీ ఆలోచన్లు నీకు అలుసా..
మౌనంలో మతలబులు లేవనుకోకు
నవ్వేవారికి లోతుగాయాలు ఉండవనకు
తరచుగా నీతో తగువాడి అలిగి కోప్పడితే
వారిది సిసలైన సంబంధంకాదు పొమ్మనకు!

ఒసేయ్ నిర్ణయాలు నీటిబొట్లు తెలుసా.. 
కంటికి కనబడే వారందరూ చెడ్డవారు కారు
విన్నమాటలు చూడని సత్యాలుగా మారిపోవు
తైలము తగ్గి వెలుగుతున్న దీపం ఆరిపోవచ్చు  
ఆరితే తడవతడవా తప్పు గాలిదని నిందించకు!

పెక్యూలర్ పత్నీస్..

ఇది కేవలం సరదా నవ్వుకోడానికి రాసిందే తప్ప మరే ఇతర చర్యలకు పద్మార్పిత భాధ్యురాలు కాదని మనవి చేసుకుంటుంది...నవ్వేద్దురూ హా హా హా :-)   

ఎలా చెప్పేది!



ఏమి చెప్పను...ఎలాగ చెప్పను
నీకు నాకు ఉన్న బంధం ఏమిటంటే
ఇదేనంటూ ఏవేవి చూపించను!?
గుండెలయ గీతానివి...జీవన సంగీతానివి
కాంతి పుంజానివి...తాజాగాలి తెమ్మరవని
నా ఉత్తేజ ఉల్లాస ఉత్ప్రేరకాలు నువ్వేనని
చెప్పే సాక్ష్యాలు ఎక్కడ నుంచి తీసుకురాను!
నా సంబరాల నాంది నీవని నిరూపించలేని నేను
ప్రేమకి ప్రతిబింబమైనావని..ఎలా నమ్మించను!?
కళ్ళ నిండా నీవే...కలలలో నీవేనని
నా శ్వాసలో...నా నిరీక్షణ నిట్టూర్పు నీవేనని
రేయిపగలు ప్రతిపదం నీవే నిండి ఉన్నావని   
నా ఆలోచనల్లో అంతరాత్మలో అంతర్లీనమైనావని
చెప్పగలనే కానీ ఏ విధంగా రూపాన్ని ఇవ్వను!?
అందుకే ఎందుకు ఎలా ఏమిటంటే చెప్పలేను..