నేరమేది!?

మనిద్దరి మధ్యా ఎడబాటు మౌనంగా రోధిస్తుంటే
నీనా మధ్య పరిచయాన్ని పెంచే పరిభాషే స్పర్శ
దానికీ దూరమైతే కన్నీళ్ళు రావడం నేరం కాదు
ఏడ్చి ఇంకిన వ్యధలకు తేమలేపనం తప్పుకాదు
వలపు వాక్యాలు తిరివితిప్పి ఆనందభాష్పాలియ్యి! 

మనిద్దరి మధ్యా జ్ఞాపకాలు రాచకార్యం చేస్తుంటే 
నీనా మధ్య సంభాషణలకు అక్షరరూపమే కవిత 
దానికి స్పూర్తినిచ్చే రసస్పందన ఇవ్వనంటే నేరం    
భావజాలాలకు నిప్పు పెట్టి కాల్చివేయడం ఘోరం
యుగళసంభాషణచేసి అక్షరసునామీ సృష్టించెయ్యి!

మనిద్దరి మధ్యా రాయబారమై పదాలుపొర్లుతుంటే
నీనా మధ్య అహం తొలగించడం ఎంతో నేర్పరితనం
దానికి వాదోపవాదాలని చర్చలు జరపడం ఎందుకు
నిద్రాణ నిఘాఢత్వాలను నిద్రలేపక పద ముందుకు
కలనైనా భువనగగనాల్ని కలసికాపురం చేయనియ్యి!

నా సమయం!

రాబోయే ప్రతీ క్షణమూ వచ్చి పారిపోతుంది 
వీలైతే పట్టుకో లేదంటే పొమ్మని వదిలేసెయ్ 
నీ జీవితం కదా నీకు నచ్చినట్లు జీవించు..
లేదంటే ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది!

గడచిన క్షణం వెళ్ళిపోతూ సమయంతోటంది 
పారిపోతున్న కాలాన్ని ఎక్కడని వెతుకుతావ్ 
నేను ఏడిపించినా నువ్వు నవ్వి నవ్వించు.. 
కాదంటే కనులుమూసి తెరిచేలోగా వెళతానంది!

రాబోవు కాలం కనుల ఎదుట కలై తిరిగింది
నిన్న నీది కాదు నీ రేపటికై ఎదురుచూసేయ్ 
 మొన్న జరిగింది తలచేం లాభం ఆలోచించు.. 
నీకంటే తోపులు నీతిమంతులులేరు పొమ్మంది!

అయిన గాయాలకి కుట్లేయడమెలాగో వచ్చింది 
జ్ఞాపకాల్లో జీవిస్తూ వ్యధలని నేలకేసి నలిపెయ్ 
మిణుగురుల మెరుపులో నక్షత్రాల్ని లెక్కించు.. 
కుదరకుంటే నీలోకం నీ నీడలా నీతోటేగా ఉంది!
 
నిశ్చలమైన సమయం రేపటి ఆశలో దాగుంది
కాలం విలువ స్పందించే హృదయంతో చెప్పేయ్
ప్రేమను పంచి మేఘంలా నింగిని జయించు.. 
ఇచ్చేదుంటే దోచుకోలేని నిక్షేపం కోరాలనుంది!  

తెలియనితనం..

చిన్నప్పుడు అల్లరిగా ఎగిరిగెంతులతో తెలియలేదుకానీ..
సమయం రావడం వచ్చి వెళ్ళిపోవడం నేను చూడలేదు!

సూర్యుడు ఉదయించి అస్తమించడం చూసా అంతేకానీ..
అదృష్టపు ఆరోహణ అవరోహణలు నాకస్సలు తెలియదు!

ప్రతీపని శ్రద్ధానిష్టలతో సాధించాలనే ప్రయత్నం చేసాకానీ..
విజయమెప్పుడూ నన్ను వరించి అందలం ఎక్కించలేదు!
 
కనులుమూసి నిదురపోయినప్పుడు కలగన్నాను కానీ..
ఆ అందమైన కలలు ఫలించి ఆనందాన్ని ఇచ్చిందేలేదు!

గోళ్ళు పెరిగితే గుచ్చుకుంటాయని కత్తిరించుకున్నా కానీ..
మనుషులపై మమకారం పెంచుకుంటే బాధని ఎరుకలేదు! 

పాలపళ్ళు ఊడి జ్ఞానదంతాలొచ్చి ఊగుతున్నాయి కానీ..
లోకంలోని కుళ్ళూ కుతంత్రాల గురించి అవగాహనేరాలేదు!
 
వయసు పైబడింది ఇంకేం సాధించాలని అడుగుతారు కానీ..
చచ్చేదాకా ఏదోకటి చెయ్యడమే జీవితమని తెలియడంలేదు!

వద్దన్నా వీడదు..

మనసుదోచి ఇప్పుడు నా నిద్రను దోచిన చోరుడా
నీకూ నేను మనసిచ్చానుగా నిద్ర నీకూ రాదులే
పున్నమి వెన్నెల నిన్నూ వేధించకుండా వదలదు!

కలలోకి రమ్మని అడిగితే కసురుకున్న ప్రియుడా
నీకూ నిద్ర కరువైతే నువ్వు ఏం కలలు కంటావులే
పట్టెమంచము పరుపు నిన్ను వెక్కిరించక మానదు!

రుచులన్నీ  హాయిగా ఆరగిస్తే ఆటపట్టించినవాడా
నీకూ రుచులూ ఆకలి దప్పికలు మాయమౌనులే
ఆరోగ్యం అలసట నిన్ను చూసి గేలిచేయక వీడదు!

శింగారించుకుని ఎదురువస్తే ఏదో అవుతుందన్నోడా
నీకూ అసలు తలకూడా దువ్వుకోవాలనిపించదులే 
తలనిమిరి చెరిపివేసిన నాచేష్టలు ఏమార్పునివ్వదు!

పనిలోపడి నీవు పరధ్యానంతో సర్దుకున్న చిన్నోడా
నీకూ నాపై ధ్యాసమళ్ళీ ఏదీ సక్రమంగా చెయ్యవులే
ఇవన్నీ శాపనార్ధాలు కావు స్వీయానుభవం తప్పదు!  

కుబుసం వీడు..

బ్రతకాలంటే పాత కోరికలను కలలని మరచి
పాము కుబుసం వీడినట్లు మనగతం విడచి
కొత్త ఆశయాలకు ఊహల చిగుర్లు తొడగాలి!

పాతపద్దతుల్ని పట్టుకుని వ్రేలాడకు చింతించి
కొత్తను అనుసరించేటి ఆశల్ను మనలో పెంచి
గడిచిన జ్ఞాపకాలకు మరపు లేపనం రుద్దాలి!

 పాము కాంతితో మెరిసేను కొత్తచర్మం మొలచి
తనువునంటుకున్నది వీడాలంటే బాధని తలచి
మదనపడితే కుళ్ళుతూ కృంగిపోయి జీవించాలి!
    
కుబుసం వీడిపోయి పాతరంగు రాలేదని వగచి 
వచ్చిన పొరని అతిగా రుద్దకు మనసు చలించి  
గతాన్ని పాతిపెట్టి ఏదోలా పబ్బం గడుపుకోవాలి! 

 ఏ సబబు ఎరుగని సర్పము కుబుసం విసర్జించి
ఆడుతూ పాడుతూ అడ్డదిడ్డంగా అది సంచరించి
అనుకుంటాది ఎలాగైనా అనుకున్నది సాధించాలి!

అన్నీ తెలిసి తెలివైనది నీతి నియమాలాలోచించి 
వదిలే మనసురాక విడచినదాన్నే మరల ధరించి 
 బుస కొట్టక భవిష్యతంతా జీవచ్ఛవంలా బ్రతకాలి!

గట్టిగుండె

అనుభవాలను ఆసరాగా చేసుకుని 
నన్ను నేను నిలద్రొక్కుకుంటున్నాగా
ఎవరైనా ప్రేమించాననంటే ఆలోచించి
లాభనష్టాలు సరితూచుకుంటున్నాను!

గట్టి గాయమే తగిలె కదా మనసుకి 
ఓచెంపన కొడితే మరోచెంప చూపనుగా
కర్ణకఠోరమైన మాటలు విన్న చెవులివి
బాకువంటి జవాబులతో సిద్ధమయ్యాను!

ఒకప్పుడు నా నీడకు నేను భయపడితి
వెలుగు నీడకుతోడని చీకటిని కోరానుగా 
కుతంత్ర కుట్రలతో కష్టపెట్టాలని చూసినా 
మనసు వినకుండా గట్టిగా డప్పుకొడతాను!

చాలాసార్లు వేళ్లు అనవసరం కాల్చుకుని
మండినా మనసును గట్టిపరచుకున్నాగా
గాజుహృదయం ఉన్నప్పుడు కాపాడుకున్నా
గుండెరాయాయె గజ్జెకట్టి గెంతులు వేస్తాను!

ఎందుకని?

 

అనుకోకుండా ఒక మలుపులో అధ్భుతంగా అగుపడి
కాసేపాగి అంతలోనే అంతర్ధానమైపోయావు ఎందుకని?

చేయిపట్టి నడిపించి అందమైన లోకాలు ఎన్నో తిరుగాడి
నింగీనేల ఒకటైనట్లు కలిసి కనుమరుగైనావు ఎందుకని?

రాలిపోయే నక్షత్రాన్ని రాలిపోక చేరాలనుకున్నా నీ ఒడి
భాగస్వామివై అనుకోని అపరిచితుడివైపోయావు ఎందుకని?

ప్రవహించే వాగు పై తేలియాడు ఎండిన ఆకులా రాలిపడి
అయినా నీ సాన్నిహిత్యాన్నే కోరుతుంది మది ఎందుకని?

మేఘాలమాటున నక్కిన తేజోపేతమైన సూర్యకిరణాల వేడి
బానిసైన నీకు నాహృదయం దాసోహమంటుంది ఎందుకని?

నీవు లేకుండా నిన్ను చూడకుండా ఇన్ని యుగాలు గడిపి
ఇప్పుడు చివరిమజిలీలో నిన్ను చూడాలనే కోరిక ఎందుకని?

సొగసు చూడనేల!

కలువ పూలకోసమని కొలనో కాలుపెడితి..
కస్సున కాలుజారిపడి ఒళ్ళంతా తడిసిపోతి
పట్టు వదలక మరల పడవలో పయనమైతి!

నా సొగసు వలలోపడి చేతికొక చేప చిక్కె..
నా భాగ్యం పండెనని చేతపట్టి లొట్టలు వేసితి
అంతలో చేపచేజారి చిటుక్కున మాయమయ్యె!

ఎక్కడజారెనో అక్కడే దక్కించుకోవాలని వెళితి..
ఎదచూసి ఎదమాట ఎరుగక చేప ఎగిరె నేపట్టితి
పై పొంగులు చూసి పైత్యమెక్కిన వారికిదే గతి!

ఆపై చెప్పడానికి ఏముందని చేపను కడిగితి..
సప్పున సన్నని ముక్కలుగా కోసి మసాలపెడితి 
నూనెలో వేపి వేడిగా నాలుగు ముక్కలు లాగిస్తి!  

                                                                                                             *****