గతితప్పకు

చిందులేసి చిలిపిగా చూడు పర్వాలేదు
పెనవేసుకోవాలనుకో అదేం తప్పుకాదు
పేట్రేగిపోతే...చీల్చి చెండాడేస్తా చూసుకో

కలలోన కలతగ కంగారుపడితే ఏంకాదు
కావలి కాసి కలవరపెడితే ప్రమాదంలేదు
కావరమెక్కితే...కోసి కారంపెడతా కాసుకో

వ్రాసిన పదాలను చడవడం గొప్పేంకాదు
వలవేసి మౌనాన్ని చదివితే నేరమూకాదు
వలచి మోసగిస్తే...వంచి వాతేస్తా మూసుకో

గాలివాటంగా గతితప్పి గల్లంతైతే గాబరాలేదు
గుంబనంగా చితిరగిలినా బూడిదకాక తప్పదు
గుడిసేటి పనిచేస్తే...గుంతలో పాతేస్తా మానుకో

ఆడదాన్ని అందమైన బొమ్మనుకో హానీకాదు
పెద్దాచిన్నాని చూడక పైనపడితివా ఇదంలేదు
నగ్నంగా నిలదీసి...కాల్చిపారేస్తా చచ్చి పో!!

ఉనికెక్కడ!?

ఓ జ్ఞానీ...నీ విజయాన్ని చూసుకుని
మురిసి ఉప్పొంగి గెంతులు వెయ్యకలా

నీ విజయం కంటే నా ఓటమి పైననే
చర్చలు ఎక్కువ రేగాయి నాతలరాతలా

ఏరి కోరి ఓటమిని వరించిన ఒంటరిని
నేనే కాదు నా అస్తిత్వం కూడా ఒకకల

దేన్నీ కనబడనీయక అన్నిటికీ నవ్వేస్తూ
సగానికి పైగా శత్రువులను ఓడిస్తానలా

శత్రువుల్ని శిక్షించే కిటుకులు తెలుసుగా
కొట్టక నాదృష్టిలో వాళ్ళను చంపేస్తేపోలా

సొంతగా నిలవక వేరొకరిపై ఆధారపడితే
నీ ఉనికినే అడుక్కోవలసి వస్తుంది నాలా

నేనిప్పుడు గాజుముక్కై కంట్లో గుచ్చుకున్నా
అద్దమై ప్రతిబింబాన్ని చూపుతాలే ఏదోలా!

మానసచోరుడా

ముద్దుగా మురిపించే మాటలు ఎన్నో చెప్పి

ముంగురుల లోనికి మునివేళ్ళను జొప్పించే
నీ గాలిచేష్టలెంత చిలిపివో తెలిసెలే చిన్నోడా

రెపరెపమంటూ రెప్పలపై నీ చూపులు గుప్పి
చెంపలు ఎరుపు ఎక్కేలా నవ్వుతూ కవ్వించే
నీ అక్షరమాలాల్లికలు అలరించెనులే అల్లరోడా

నిగూఢంగా నిలువుదోపిడీ చేసి కలలతో కప్పి
జ్ఞాపకాల మాయమంత్రం ఏదో నన్ను ముంచే
నీ కపటంలేని వలపుని ఎరిగితిలే కంత్రీగాడా

చిక్కరాదు అనుకుంటూనే నీ గుండెకు నే చిక్కి
పొరనై పెనవేయ సురక్షితమని నామది ఎంచే
నీ శ్వాసలో చేర నా శ్వాస వీడాలిగా ప్రియుడా...