సెగ సలపరం

వయ్యారి నడుస్తుంటే వెనుక వెనుకే వెళ్ళి 
దాచిన దాగని వంపులకు దాసోహమయ్యి
వలపేదో పుట్టి ఒళ్ళంతా జివ్వుమన్నదని
తను తాకకనే సొగసు సెగలు రేపిందంటూ
నింద తనపై మోపి భుజం తడుముకోనేల!

కోమలి తలెత్తక తన దారిన తానెళుతుంటే
పొంగిన పసిడిపరువం పైటజార్చ పరవశించి
కన్నె ఎదపై కన్నేసి కానరాని చోట కాలగా    
చివరికి చిన్నదాని చేతికి చేపపిల్లవోలె చిక్కి
వాలుకళ్ళతో వలవేసి పట్టెనని వెటకారమేల!

సొగసరితో సావాసమని సోగ్గాడిలా ముస్తాబై
పెదాలపై నవ్వు చూసి నరాలు సయ్యిమన 
కొత్తగా శృంగారం అదుపు తప్పి గింజుకుంటే
నీలోని వేడి బండారమంతా బయటపెట్టునని  
గోటిముద్రలు తాను కోరెనని అబాసుపాలేల!

రాలిన మనసు


మనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే!

పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో

కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!

మరణించిన మనసు వెతకబోవ సాక్ష్యం దొరికెనని

భావాలని బంధించి వధించాలని ఎత్తులెన్నో వేసెనే!

శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలాగని ప్రశ్నించ

అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయెనే!

తనువంతా పసిడితో అలంకరించి పయనమవబోవ

పెదవులపై నవ్వు విరిసి మనసు ముక్కలై రాలెనే!

స్థిరతిమిరం..

నీ అస్థిర చంచల మనసుతో తూకమేయకు నా ప్రేమను
కవాటాలే కంపించి హృదయమే కదలాడేను గారాభంతో
అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను
నీ అణువణువూ కరిగేను నా అనంత ప్రేమ సామ్రాజ్యంలో
వలపువలకి చిక్కిన మనసుకి వినిపించకు అలజడులను
మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడేను ఆవేశంతో
నీ స్వప్న జగత్తుకి రంగులు అద్దమనకు నా ఆశయాలను
సరిపెట్టుకోలేనంటూ విలవిలలాడేను వివరించలేక తనలో
అదే అలుసుగా గెలుపు నీది అనుకుని శాసించకు నన్ను
నీ అందలానికి నేను సోపానం కానని చింతించకు వేదనతో
తిమిరాల ప్రమిదనని తీర్పు చెప్పి నిందించకు నా ప్రేమను
సౌఖ్యాలు సమిధలైనా అణగారిపోయే కోర్కెలేం కోరుకోను...

వలపువిశాలం..

నిండు చంద్రుడివై నీవు నా ఎదురుగా ఉంటే 
పెదవిదాటి మాటలు రాక మౌనంగా నేనుంటే 
తలపుల్లో లేవనీ కాదు నీ పై ప్రేమ తగ్గలేదు! 

నిలువెత్తున్న నీవు అదోలా నన్ను చూస్తుంటే
నాలో కూడా కోరికలు ఉవ్వెత్తున పడిలేస్తుంటే
ఆశను తెలుపలేనన్న నా సిగ్గుది తప్పుకాదు!

నింగిపైన విహంగిలా ఊహలెన్నో ఎగురుతుంటే
ఎదలో అలజడులు నన్ను గాబరా పెడుతుంటే
భావం బయట పెట్టలేకపోతే పిరికిదాన్ని కాదు!

నిశ్చల మదిలో వలపు ఎగసి ఎగిరిపడుతుంటే
గాయమగునని ఆలోచనలు హెచ్చరిక చేస్తుంటే 
వెనుకంజె వేసే వయ్యారి వగలాడిని కానేకాదు!

నిర్మలమైన ప్రేమని ఓటమొచ్చి కౌగిలించుకుంటే
బెదిరిపోయిన నువ్వు తొణకని నన్ను కాదనంటే
ప్రేమించే మనసున్నంత కాలం లోకం గొడ్డుపోదు!   

అరువు బంధాలు...

ఉమ్మడిగా ఉండడమన్న ఊసే వింతగా ఉంది
ఉమ్మడి కుటుంబాల అర్థమేంటో తెలియకుంది!
అమ్మ-నాన్న,అక్క-బావ,చెల్లి-మరిది
అన్న-వదిన,తమ్ముడు-మరదలు,మేనత్త-మేనమామ,
పిన్ని-బాబాయ్,పెద్దమ్మ-పెదనాన్న, 
తాతయ్య-అమ్మమ్మ,నానమ్మ,ముత్తాత-తాతమ్మ...
ఇటువంటి వరుసలు ఉండేవని చెబితే 
నేటితరం విచిత్రంగా చూస్తూ నివ్వెరపోతూ
మమ్మి-డాడీ, అంకుల్-ఆంటీ అనేవి తెలిస్తే చాలు
లోకంలో బంధువులకు కొదవు లేదన్న భావనలో ఉంది!
అందానికి అమ్మపాలు అరువెట్టి పోతపాల పెంపకాలు
మూతి తుడిచి ముడ్డి కడగకుండా డైఫర్స్ వాడకాలు
పుట్టిన పిల్లల్ని ఆయాలకు, క్రెచ్ లో వేయడాలు...
రెసిడెన్స్ స్కూళ్ళు, కాన్వెంట్ చదువులు, ఏవో కోర్సులు
అమ్మచేతి ముద్ద పోయే, పిజ్జా బర్గర్లైన పిండి వంటలు  
వీటితో రక్తసంబంధం అంటే ఏమిటో తెలియని దుస్థితి
ఎవరు చుట్టాలో, ఎవరు మనవారో తెలియని పరిస్థితి
ఇంకెక్కడి నుంచి పుట్టేను ప్రేమాభిమానాలు ఆప్యాయతలు?