నువ్వుంటే


కొత్త ఆశలే మొలకెత్తేను నీవు నా చెంతనుంటే
గ్రీష్మమే గురితప్పి వసంతమాడేను నువ్వుంటే

జీవితంలో కోరినవేవి పొందలేదన్న వ్యధలుంటే
అవీ మది నుండి మాసిపోతానన్నాయి నీవుంటే

నీవు లేనప్పుడు పరామర్శించి పలికేవాళ్ళకంటే
కోటికి పైగానే కుళ్ళుకుంటారు నువ్వు నాతో ఉంటే

లోకమే కపట కలహాల నడుమ కల్లోలమైయుంటే
కలలు కవాటాలనే తెరిచాయి నీ కౌగిలిలో నేనుంటే

వాయిద్యాలు వినసొంపుగా మ్రోగుతామని కబురెట్టే
మనిద్దరి గళాలు ఒకటై యుగళగీతమే పాడుతుంటే

జరభద్రం..


 
కట్టుబొట్టు కుదురుగా లేకపోతేనేం
కుదురైన కోమలాంగిని నేనురోయ్!
కబుర్లే చెప్పి కళ్ళతో కవ్విస్తానే కాని
కుళ్ళుకుతంత్రాలు నేనెరుగనురోయ్!



అడవికాచిన అందాలు ఆరబోస్తేనేం
అరమరికల్లేని  అమాయకురాలినోయ్!
నేను నవ్వుతూ నవ్విస్తుంటానే కాని
నడవడికలో నటించడం నాకు రాదోయ్!



ఆత్మాభిమానం ఉంది, ఆస్తి లేకపోతేనేం 
అట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని కానురోయ్!
జీవితపాఠాలు చదివి అక్షరాలు దిద్దా కాని
అబద్ధాలాడి అపోహగ్రంధాలు రాయనోయ్! 



నీతినియమాలే నా బలం, ఏదైతే నాకేం
నిజాయితీగా నచ్చినట్లు బ్రతుకుతానోయ్!
బడాబాబులు, బద్మాషోళ్ళు ఎవరైతేనేం
వెకిలివేషాలేస్తే బండకేసి బాదుతానురోయ్!

అన్నీ నీవే

జీర్ణకోశానికే జిహ్వరుచులు చూపించి
కిడ్నీలని కవ్వించి కితకితలు తెప్పించి 
పెద్దప్రేగులని ప్రేమబంధాలతో పెనవేసి
నరాల్లో నడుస్తూ నన్ను నాకే దూరంచేసి
చిన్నప్రేగుల నిండా చిలిపిచేష్టలు దూర్పి
ఉదరకోశానికే ఊపిరి తీసుకోవడం నేర్పి
కాలయంకి కావల్సినవి కడుప్రియంగా ఇచ్చి
ఎముకల మధ్య ఉన్న ఎడబాడునే ఏమార్చి
అన్నవాహికకు అనుబంధంతో ఆకలి తీర్చి
వెన్నుపూసకి బాసచేసి బలాన్ని సమకూర్చి
గ్రంధులన్నింటిలో రసికతనే నింపి రంజింపజేసి
స్వరపేటిక మౌనం వీడి నీ పేరునే జపించగా...

మెదడు మాత్రం కాదని అంటే ఒరిగేది ఏమిటని
గుండెల్లో నీవుంటే గుర్తురాకపోవడానికేముంది!
నా అవయవాలన్నీ నీ అధీనంలో ఆడుతుండగా
ప్రేమించానని చెప్పవలసిన అవసరమేముంది!?

వ్యసనాల వీరుడు



ఆజానుబాహుడు అందగాడు నాకే సొంతమని
అరవైఎకరాల ఆసామి అనుకుని మురిసిపోతే
మురిసినంతసేపు లేకపోయెను ఆ మురిపెం..
పదినెలల పేకాటతో ముగిసింది ఆ సంబరం!!


రైస్ మిల్లు, రొయ్యల చెరువులున్న రిచ్ మ్యానని
ఆకాశానికి రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిగెంతితే
ఎగిరిందే తడవుగా ఎత్తికుదేస్తివి కుయ్యో మొర్రో..
గుర్రప్పందాల్లో గుట్టుకాపురం రట్టు చేసినావయ్యో!!
 

ఏడంతస్తుల అద్దాలమేడలోని ప్రతీఅద్దంలో నేనని
సొగసు చూడతరమా అన్నావని నీ సొంతమైపోతే
కన్నుకొట్టి పిలిచిన ప్రతి ఆడదాని పక్కలో చేరి..
ఏడాదికొక అంతస్తు ఎయిడ్స్ రోగానికి ఖర్చుచేస్తివి!!


కండలున్న మగాడినని మీసం మెలేసి నాకేమని
మద్యంలో మునిగి మనిషివే మృగంగా మారిపోతే
వ్యసనాలతో విర్రవీగిన కావరమంతా ఆస్తిలా కరిగి..
చివరికి అస్తిపంజరంగా మారి మట్టిలో కొట్టికుపోతివి!

తెలిపేదెలా!?

నువ్వు వస్తావని నేను ఎదురు చూసే ప్రతీక్షణం
ఒక యుగమై బాధించినప్పడు ఎంత బాగుంటుందో
అంతకు వేలరెట్లు తిరిగెళతావన్న తలపే మరీ బాధిస్తుంది
అందుకే తలచుకోరాదని తలచి మరింత తలచుకుంటాను
నిన్ను చూసి పొంగిపోరాదనుకుని చూడగానే ఎగిరి గెంతేస్తాను
లేని గంభీరత్వాన్ని ముఖానికి పులుకుని, నీ వైపు చూస్తే
సడలిపోతాను అనుకుంటూ పక్కకు తిరిగి నవ్వుకుంటాను
అది చూసి ఆనందం అనుకునే భ్రమలో నువ్వు ఉన్నప్పుడే...
నేను చెప్పాలనుకున్నవి చెప్పలేక మౌనానికి లిపి వెతుకుతాను
నువ్వేమో నిన్ను చూడక దిక్కులు చూస్తున్నానని అలుగుతావు
అదిగో సరిగ్గా అప్పుడే అనుకుంటాను...నేను మూగబోతేనేం
నీవు గుండె చప్పుడు వినలేని చెవిటివాడివి ఎప్పుడైనావని!
అంతలోనే నన్ను నేనే సరిపుచ్చుకుని,  సర్ది చెప్పుకుంటానిలా...
మనసుని చదివే మర ఏదో కనుగొంటే నీవు నా మనసు చదువుతావని
నీవు వలచావని తెలిపేది నా జ్ఞాపకాల నీడలకేనని తెలిసి నిట్టూరుస్తాను!