వ్యక్తీకరణం

తడవకోమారు తలపుకురాకు..
పొలమారితే పులకరింతనుకోకు!

చిరుగాలివై చిలిపిగా గిల్లమాకు..
మెలికలు తిరిగితే గిలిగింతనుకోకు!

గడియకోసారి గుండెను గుచ్చకు..
తనువు తిమ్మిరెక్కితే తిక్కనుకోకు!

తుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
తృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!

కంటికెదురుగ కనపడక కలలోకిరాకు..
కస్సుబుస్సులాడితే కలవరింతనుకోకు!

వేళకానివేళ వెనకమాటుగా హత్తుకోకు..
వెక్కిళ్ళు ఎందుకంటూ వెక్కిరించమాకు!

మనసుదోచి ముగిసెనని సంబరపడిపోకు..
మరుపన్నది మనిషికి వరమని మరువకు!

ముద్దు మతలబు



ముద్దు ముద్దుకీ ఒక మతలబు ఉంది..
ప్రతి ముద్దుకీ హద్దే కాదు అర్థం ఉంది...

ఎప్పటికీ నువ్వు నా సొంతం అంటుంది
నుదిటిపై నున్నని పెదవి అద్దిన ముద్దు!

శృంగారాన్నే శృతి చేసుకోమని నవ్వింది
చెవిపై చిందులు వేస్తున్న చిలిపి ముద్దు!

నువ్వంటే నాకెంతో ఆరాధన అంటుంది
చేతిపై సాక్షిసంతకం అద్దిన చిరు ముద్దు!

నాకునువ్వు నీకునేను ఒకరికొకరమంది
మెడవంపున మారాంచేసే గారాల ముద్దు!

కష్టమో నష్టమో నువ్వు నాకు కావాలంది
భుజంపై వాలి భేషజాలు వదిలేసిన ముద్దు!

"ఐ లవ్ యు" అని లిపిలేని భాషలో అంది
పెదవులు పెదవులని పెనవేసుకున్న ముద్దు!

అందమైన ఆలు


ఆలుగడ్డ (బంగాళాదుంప) ఒకరోజు బెండకాయకి ఫోన్ చేసి "ఐ లవ్ యు" అంది.
ఇది విని బెరుకులేని బెండకాయ....అబ్బో! నీకు అంత సీన్ లేదు, ఒక ఫిగర్ లేదు, బండలా గుండ్రంగా ఉంటావు. అందరికీ అందుబాటులో దొరికే చౌకరకం నీవు. నీకు నాలాంటి నాజూకుదే కావాల్సి వచ్చిందా అంటూ చెడామడా తిట్టేసింది.
ఆలుగడ్డ అహం దెబ్బతిని, మనసు గట్టిచేసుకుని మెత్తని మాటలతో కనబడిన కూరగాయని పలకరించి మచ్చిక చేసుకుని కలిసి మెలగసాగింది.
దీని పర్యవసానమేంటో ప్రస్తుతం మనం కలిపి వండుకుని తింటున్న కూరల కాంబినేషన్ చూస్తే తెలుస్తుంది.
ఇవి కొన్ని:-
ఆలు-కాలీప్లవర్
ఆలు-మటర్(బఠాణీ)
ఆలు-మెంతికూర
ఆలు-వంకాయ
ఆలు- టమాటా
ఆలు-పాలకూర
ఇలా ఆలుగడ్డ కూరగాలన్నింటికీ చేదోడుగా కలిసి తల్లో నాలుకలా మెలుగుతూ ఆలు లేని ఆహారం అంధకారం అన్నట్లుగా పేరు తెచ్చుకుంది.
బెండకాయ సంగతి ఏంటి అని మీరు అడగక పోయినా విషయాన్ని పూర్తిగా చెప్పాలి కనుక చెబుతున్నాను....ఏముంది నాజుకు నయగారం కూరగారాల బెండకాయ ఏది కలిసినా జిగురు అంటి...ఛీ  ఛీ అంటూ చీదరించుకునేలా మారి ఒంటిగానే మిగిలిపోయింది....ఇదీ సంగతి! :-)

మరి నీతి సంగతి :-).....వద్దు...వద్దు ...వద్దంటారా!
వద్దనుకునే వాళ్ళు చదవకండి....ప్లీజ్ ప్లీజ్!
బెండకాయ నీతి:-
1. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి
2. అందముందని అహంకారానికి పోరాదు.
ఆలుగడ్డ నీతి :-
1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.

నిస్వార్థ జీవి

ఈ తోడేళ్ళ లోకంలో తోడెవ్వరని తొంగి చూస్తే
ఇంతందమైన లోకం వేరేదీలేదు అనిపించింది
అందుకే వాటితోటిదే సావాసమని చేయికలిపి
గర్జించే పులికన్నా చొంగకార్చే తోడేలే మిన్నని
కోరికేదో కోరమని దాని కుటీరాన్నే ఆశ్రయించా..

తొలుత తోడు-నీడ అవుతానని తోకూపిన తోడేలు
తొందరపాటేనని తెలివిగా తనని తానే తిట్టుకుంది
అందినంత జుర్రుకుని గుట్టు చప్పుడేలని జారుకుని
వాసనమరిగి మరునాడు మరల మభ్యపెట్ట చూసె
అనుభూతులే అనుభవమైతే వద్దని మొరాయించా..

మరోమారు మరువలేనంటూ కొత్త అస్త్రం చేతబూని
జిత్తులగారాలే వలపుబాటని వల్లిస్తే మనసే నవ్వింది
తొణకని నిబ్బరం చూసి వణికిన తోడేలు తోకముడిచి
సంధి బాసలే చేసి జామురేతిరి సరసమంటూ దరిచేరె
సర్దుబాటే సరైనది అనుకుని ఆశలచాపనే పక్కపరిచా.

చివరికి మంత్రమేసి తోడేలుని మనిషిగా మార్చబోవ
మాయపొరలు కరిగించి జీవితసత్యమేదో భోధించింది
మార్చడమేల మర్మం తెలుసుకుని మనం మారాలని
మృగమైనాసరే ఎవరి అవసరం వారినే సమర్ధించునని
స్వార్థంలేనిప్రాణిని బ్రతికిఉండగా చూడలేనని గ్రహించా..

జ్ఞాపకాలని వీడిపో

కంటికెదురుగా ఉంటే నీవు తలుచుకోవని
దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
తెలిసికూడా తడి ఆరని తపన ఏలనోమరి!!

నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!

లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!

కన్నీటికి కారణం తెలిసి వెతుకుతావెందుకో
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!

నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!

నా సామ్రాజ్యం



నా అక్షరాల అభిమాన ఆత్మీయులారా!......నేను నేనే
దయచేసి వాటిలో నన్నెతకబోయి మీరు కనుమరుగై
నా అస్థిత్వానికి మసినిరాసి మాయచేసి, మీరు బానిసై
పదాల్లో నా ప్రాత్రకి ప్రాధాన్యతిచ్చి నన్ను నిర్ధేసించకండి!

నా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే
సామంతుల స్వార్థచెలిమికి సమయస్ఫూర్తి సరిహద్దునై
నా పరిమితులు దాటకనే అహాన్ని అణచే స్థైర్య ఖడ్గమై
రక్షించుకున్న అరమరికలెరుగని లోకమిది అడుగిడండి!

నా రచనావనంలో విరిసీవిరియని భావపుష్పాలన్నీ నేనే
మిమ్మలరించే పరిమళపుష్పాలందించాలనుకునే కంచెనై
నా దయనిర్దయ తూనికలతో తులాభారమేసే తోటమాలినై
పర్యవేక్షించిన పదాలసంపద ఏదని ప్రశ్నించక పరికించండి!

నా పుట్టుపూర్వోత్తర గత ప్రస్తుత భవిష్యత్తు భరోసా నేనే
ఆశలాంబర అంచునైనా తాకాలనుకునే కలల కౌముదినై
నా ఆశయకొలను ఎదురీదుతున్న పదపద్మాలే లోకమై
నీట వెన్నెలఛాయతో ఆటాడుకునే వెన్నెల్లో ఆడపిల్లనండి!

నీ రాకతో...

కొలనునీరు తనువు తడుపుతుంటే తిట్టుకున్నా..
ఎడబాటు కన్నీరు తడిమెనని, మది జివ్వుమంది

పైరగాలికి పైట రెపరెపలాడితే పాడుగాలనుకున్నా..
నువ్వువస్తావన్న పదమే పల్లవై పులరింప జేసింది

నేలతాకాలన్న నీలికురుల ఆశని నిందించుకున్నా..
నీవు చేసిన నయగార చరణ విన్నపమే గుర్తొచ్చింది

ఎర్ర్రపుప్పొడి చెక్కిళ్ళగాంచి తుమ్మెదని తిట్టుకున్నా..
నా ఎదను మీటిన జ్ఞాపకతంత్రి తీయగా కసురుకోకంది

వణికేపెదవుల కోరికని మునిపంట బంధించబోతున్నా..
వలపు రేపిన సెగే ఎగసిపడి నీ పెదవి లేపనమే కోరింది

అడుగులసవ్వడి విని అంతరంగ అలజడని ఊరుకున్నా..
నిన్నుచూసిన తనువే అత్తిపత్తి ఆకువలే ముడుచుకుంది