జీవనతరంగాలు

                            జీవన కవితాసాగరంలో
                            ఎన్నెన్నో భావాటుపోట్లు
                            ఎగసిపడే కెరటావేశాలు
                            వాటిలో కొన్ని ముత్యాలు
                            లోతే తెలియని అగాధాలు...

                            అలలై పడిలేచే ప్రయత్నంలో
                            నదిపాయలా పారే వయసుకి
                            నిర్ధిష్ట రూపమివ్వాలనుకుంటూ
                            వేసే పసితనపు కుప్పిగెంతులు
                            పెరగాలని వ్యర్థమైన నత్తగుల్లలు...

                            నీటిపై నీరెండలాంటి యుక్తవయసులో
                            ప్రేమవలకందని అందమైన ఆల్చిప్పను
                            భవసాగరం ఈదుతున్నాననే  భ్రాంతితో
                            సుడిగుండాలలో మునిగితేలి తిరుగుతూ
                            తీరంచేరాలని ప్రయాసపడుతున్న కెరటాలు!

సరస సల్లాపం..

కందిచేలల్లో కన్నుగీటి కవ్వించబోతే
కస్సుబుస్సులాడి కౌగిలివ్వనన్నావు..

సరస్సులో సరిగంగస్నానమాడదామంటే
సరసమాడ ఇది సమయమే కాదంటావు..

కారుమబ్బుల కాటుకద్ది ఎదురు చూస్తుంటే
కాయలే కాచిన కళ్ళల్లో కన్నీరు తెప్పించావు..

జాజుల్ని జాలువార జడలోతురిమి జాలిగాచూస్తే
జాణనంటూ నా తోడుగా జాబిలిని కాపుంచినావు..

అలవోకగా అలిగి కూర్చుని కురులు విప్పివిరబోస్తే
అందాల ఈర్ష్యాఉసురులు నాకు తగులునంటావు..

వెన్నెల్లో పక్కపరచి వేగిరముగా నిన్ను రమ్మంటే
వగలరాణిని నేనంటూ వెటకారమాడి నవ్వుతావు..

పగలెంత దొరవైనా మాపటేళకి నాకు రాజువంటే
పరువాల పొత్తిళ్ళలో పసిబాలుడిలా వొదిగిపోతావు..

తెలుపలేకున్నా!

నన్ను చూస్తూనే నానుండి దూరమై
గమ్యాన్ని వెతుకుతూ నీవెళ్ళిపోతే...
ఏమైందో చెప్పమంటే ఏం చెప్పను?
నీవు వెళ్ళినప్పటినుండి నవ్వలేదని
ఒక్క క్షణమైనా కంటికి కునుకులేదని
నిశిరేయిలో నా నీడను నేనే వెతికానని
ఇవేవీ నిన్ను నాకు దూరం చేయలేదని
నన్ను బంధించి భాధిస్తున్న తలపులన్నీ
మదిగోడల్లోనే సజీవ సమాధి అయిపోతే...
ఎందుకీ వేదన అనడిగితే ఏమని చెప్పను?
నీవు లేకపోతే పర్వదినపు సంబరమేలేదని
ఇది తెలిస్తే నీ మనసు కలవర పడుతుందని
అందుకే నీవు వెళుతుంటే కంట నీరిడలేదని 
చెప్పాలనుకున్నవేవీ నీకు నేను చెప్పలేనని
తెలిసి తెల్లకాగితంపై నీ పేరునే మునివేళ్ళతో
రాస్తున్నా రాస్తున్నా.......రాస్తూనే ఉన్నా!!!

ప్రేమ ఇష్క్ లవ్

"ప్రేమ" ఇది శతాబ్దాల వినికిడి
ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ
ఒక్కో కొత్త అర్థాన్ని చెబుతూ
పర్యాయపదం కోసం వెతుకుతూ
ప్రేమకి ప్రేమే, వేరే పదం లేదంది!

"ఇష్క్" ప్రతికాలం ఇదో అలజడి
ఋతువుతో వైఖరిని మారుస్తూ
ఉఛ్వాస నిఛ్వాసలుగా నడుస్తూ
అదెలా కలుగునో అని చర్చిస్తూ
ఇది తెలిసినవారు ఇలలో లేరంది!

"లవ్" అంతుచిక్కని ఎదసవ్వడి
పేద గొప్ప అనే భేధమే లేదంటూ
కులం జాతకం అనేవి వంకలంటూ
ప్రేమపొందని జీవితం ఎందుకంటూ
ప్రేమను పంచు తత్వాన్నెంచకంది!

కాదిలా....



సాగరంతో ఒడ్డెన్నడు స్నేహం చేయదు
నా మనసు నిన్నెన్నడు మోసగించదు
దూరమైనా నీపై నాకింకా ఆశ చావలేదు
ఏరై పొంగు కన్నీరు నీపై నిందమోపదు.

ఉప్పునీరు కాదు కన్నీటి సాగరకెరటమది
నావనునడిపే చుక్కానై సాగుతుంది మది
తీరం చేరాలన్న నీఆశను తీర్చే కోరికనాది
అందుకే నా కంటనీరిలా ప్రవహిస్తున్నది.

ప్రతిమౌనానికి అర్థం వ్యతిరేక భావంకాదు
అలాగే ప్రతిచర్య ఓటమికి ప్రతిరూపమవదు
నాకు దక్కని నీపై ద్వేషంతో కోపమేం రాదు
దక్కితేనే ప్రేమని అంటే నామది ఒప్పుకోదు.

మంచువంటి మనసు మంటలురేపుతుంది
చెప్పుకుంటే తీరదని తెలిసినా భరించలేనిది
నా హృది వ్యధకాదు నీ జ్ఞాపకాల దొంతరది
నీ జ్ఞాపకాలే భాధిస్తే నిందను ఎవరిపై వేసేది.

వెజిటేరియన్స్ ఓన్లీ :-)

పరిగెల పులుసంటే పిచ్చ పసందని
పిత్తపరిగెల కోసం బెస్తపల్లెకు పోయొస్తే
నీ పరువముండగ పరిగలెందుకన్నాడు!

బొమ్మిడాయల వేపుడంటే భలేమోజని
బొంగరంలా బజారంతా గాలమేసి గాలిస్తే
నీముందు బోడి బొమ్మిడాయిలెంతన్నాడు!

బొచ్చెచేపలో ముల్లెక్కువుంటాయని
కారుచవకగా ఇస్తానన్నా కాదనివస్తే
నీ రెండు మీనాక్షి చూపులే చాలన్నాడు!

సందువా చేపను చేపగా వండాలని
సన్నని సందులన్నీ వెతికి నేనట్టుకొస్తే
నా నడుముసన్నలలో ఒదిగిపోతానన్నాడు!

వాలగ/జెల్ల చేపకైతే వంక పెట్టబోడని
పెద్దజెల్లని జామురేతిరి జాగ్రత్తగా జేరేస్తే
జెల్లంటూ జామంత నీవు జారిపోకన్నాడు! 

వంజరం వండి వయ్యారంగా వడ్డించాలని
వద్దని వారించినా వినకుండా వండి వడ్డిస్తే
నా వజ్రాలగనివంటూ గట్టిగా వాటేసుకున్నాడు!
నా రంగూన్ రాజాని నీచువాసనైనా నాన్ వెజ్ తో
నీటుగా మురిపించి మైమరపించాలని అనుకుంటే
కలువభామ చెంతనుండ జలపుష్పాలే వద్దన్నాడు!