లవ్వు జ్వరం

చలిగా ఉందంటూ దుప్పట్లో ముసుగుతన్ని తొంగుని
వణుకుతూ మూలుగుతూ అటూ ఇటూ పొర్లుతూ..
వచ్చి పోరాదా ప్రియతమాని పలుమార్లు కలవరిస్తూ
అలసి కూర్చున్న నా ఎద ఎగసిపడేలా కుదిపేస్తావు!

చాపక్రింద నీరులా కిమ్మనక కానరాక ఉందామనుకుని
వలపంతా వేడావిర్లుగా చేసి నీ తనువుకు రుద్దుతూ..
దరికి రాకుండా దాకుందామని శతవిధాలా ప్రయత్నిస్తూ
అరమరికలు లేని హృదయాన్ని ఆపలేక అల్లాడతాను!

వయ్యార సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలిని
ధర్మామీటరునై నీ శరీర ఉష్ణోగ్రతను పరీక్షచేయబోతూ..
పాదరసంలాంటి పరువాలు పదునెక్కి నిన్ను రెచ్చగొట్టిస్తూ
నేను నిగ్రహంగుండి నీ ఒంటి వేడినెలా తగ్గించమంటావు!

పున్నమి పూలను శ్వాస పరిమళాలను మూటగట్టుకుని
మమతల్ని మడతల్లో దాచేసి దాగుడుమూతలాడుతూ..
సరసాన్ని సరైన మోతాదులో రంగరించి మాత్రలుగా వేస్తూ
వెచ్చని దాహాన్ని వేడిపాలతో కాక మురిపాలతో తీరుస్తాను!

"రాంగ్ కనెక్షన్"


నచ్చిందా....నచ్చితే నొక్కు నొక్కు నొక్కంటావు 
నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో నొక్కి చెప్పంటావు
నొక్కి నొక్కి నొక్కించుకోవడం నీకు మజా అయితే 
నవ్వించాలని "కీబోర్డ్" నొక్కడం నాకు అలవాటు! 

మెచ్చితినా చూసి....మెలికలు తిరిగిపోతుంటావు
మెల్లగా ముగ్గులోకి దింపే ప్రయత్నం చెయ్యబోతావు
మతలబులేని నేను నువ్వు సైయ్యన్నావని సైయ్యంటే  
మనసు "మానీటర్" ఒకటనుకున్నామంటే పొరపాటు!

మాటా మాటా కలిసెనా...ప్రపంచమే గుప్పెటంటావు 
మాటల్లో కనబడ్డ నైసర్గిక రూపం నగ్నంగా కోరతావు
వావీ వరుస విస్తీర్ణాలను తెలుసుకునే గుద్దులాటలో
నీదీ నాదీ "నెట్ కనెక్ట్" కాకపోవడం మన గ్రహపాటు!
       

నటన

జీవితనాటక రంగస్థలంపై అందరూ బ్రహ్మాండంగా నటిస్తున్నారు
ఎవరికి వారే నాయికా నాయకులై నటించమంటే జీవిస్తున్నారు
గర్భంలోనే టీవీ సీరియల్స్ చూసి, విలన్స్ గా పుడుతున్నారు 
పుట్టగానే ఏడవాల్సిన వారు నవ్వుతో నటన ప్రారంభిస్తున్నారు!

జీవితం యాంత్రికం కాదంటూనే నిద్ర లేవడంతోటే నటిస్తున్నారు 
స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఇష్టంలేని చదువును బట్టీకొట్టేస్తున్నారు
టీచర్లు చదువు చెప్పేస్తున్నామంటూ విపరీతంగా నమ్మిస్తున్నారు
అమ్మానాన్నలు తమ పిల్లలు వృద్దిలోకి వస్తారని నమ్మేస్తున్నారు!

జీవించే క్రమంలో ప్రేమ కూడ ప్రాక్టికలని నమ్మేలా నటిస్తున్నారు 
ఏది ప్రేమో ఎంత నిజమో తెలియనంతగా డైలాగ్స్ చెబుతున్నారు 
అంతా నటనేనని తెలిసీ తెలియబరచక మేకప్ వేసుకుంటున్నారు
ఏ పాత్రనైనా అవలీలగా నటించడానికి అలవాటు పడిపోతున్నారు!

జీవం పోయాల్సిన డాక్టర్లు డబ్బులు దండుకోడానికి నటిస్తున్నారు
రోగులు ఆరోగ్య పధకాలు అమలు కావని హైరానా పడుతున్నారు
         కూలీవాళ్ళు కూడా పనిచేయక కాలరెగురవేసేలా నటించేస్తున్నారు         
ప్రాణమున్న ప్రతీఒక్కరూ నటించడం నేర్చుకుని జీవించేస్తున్నారు!

జీవించడంలో ఎవరికి వారే హీరో హీరోయిన్లనుకుని నటిస్తున్నారు
నటించడం రాకపోతే వారిని వెర్రివాళ్ళుగా జమకట్టి వెలివేస్తున్నారు
        అసలు రూపాలు మర్చిపోయి మారువేషాలలో మాయచేస్తున్నారు        
నటనతో ఆస్కార్ అవార్డ్ కొట్టేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు!