మగాడివా!?


కన్నుమిన్ను కానక కండకావరమెక్కి
కామంతో మధమెక్కువై కొట్టుకుంటూ
ఒళ్ళుబలిసి తిరగబడలేని వారిపై బడి
దారుణంగా ఎగబడి అత్యాచారం చేసేటి
నువ్వు మగాడివా నీది మగతనమా!?

ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి
విచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకుని
రెండు నిముషాల సుఖానికి రాక్షసుడివై
మృగంలా మారి మీద పడి హింసించేటి
నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?

ఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టి
తాళి కట్టించుకున్నాక పెళ్ళాం కదా అని
ప్రతాపమంతా చూపి ఫస్ట్రేషన్ తీర్చుకుని 
సాడిస్టులా సెక్స్ చేసి సంతతిని పెంచేటి
నువ్వు ఒకపెద్ద పుండాకోరంటే కోపమా!?

రాత్రి లేపి కలలో కులుకుతావటని మొట్టి
ఒళ్ళురక్కి రంకుగట్టి పరువు పక్క పరచి
సిగ్గులేకుండా లైంగిక వాంఛతో జబ్బచరచి
అంగము ఉన్నది దానికోసమే అనుకునేటి
నువ్వు మగాడినని నిరూపించ సాధ్యమా!?

ఏటిగట్టున ఎద..

మనసు మట్టికుండలాంటిది దాన్ని భద్రంగుంచన్నావు
మట్టికుండని గట్టిగా మలచినానని భరోసా ఇవ్వమంటే
కుమ్మరోడిని కాను కులికితే కుమ్ముతానంటున్నావు!

నా నాజూకు పలుకులకే పరవశించి ప్రేమించానన్నావు
పరవశానికి ప్రతిరూపంగా ఒక పట్టుచీరైనా ఇవ్వలేదంటే
నేతగాడిని కాను పట్టుకుంటే పట్టుచీరై జారిపోకన్నావు!

బట్టలెంత మురికైతేనేమి మానవత్వం ముఖ్యమన్నావు
మట్టిదేముంది మావా మంచినీళ్ళతో ఉతికేసుకోమనంటే
చాకలోడిని కాను చచ్చుసలహా ఇదని విసుక్కున్నావు!

పగలు కస్సుబుస్సలాడి రాత్రి ముద్దులతో ముంచేస్తావు
మాటలతో ముక్కలుచేసి మురిపాలతో కుట్లువేస్తావంటే
దర్జీని కాను కత్తిరించి కుట్లేయడానికని నవ్వుతున్నావు!

నిలువెత్తు బంగారాన్నని మభ్యపెట్టి వశంచేసుకున్నావు
నడుముకో వడ్డాణమైనా చేయించి విలువ పెంచరాదంటే
కంసాలిని కాను వగలుపోమాకే వగలాడి అంటున్నావు!

సముద్రమంత నీ జ్ఞానసిరులతో నన్ను కట్టిపడేసినావు   
స్వాతిముత్యమంటి స్వచ్ఛమైన నీవు సొంతమనుకుంటే  బెస్తవాడ్ని కానంటూనే నాఎదను ఏటిగట్టున విసిరేసావు!

ఏరికోరి ఎంచుకోగా నా గుండె రాజ్యానికి అధిపతివైనావు
నీ అనంతమైన సరససంపదలపై నాదేలే హక్కనుకుంటే
వృత్తి కాని రాజకీయ రాసలీలలాడి సంబరపడుతున్నావు! 

తప్పుతున్న లెక్కలు

యుక్తవయసొచ్చెనని సందేశంతో మొదలైన లెక్కలు
నెలనెలా క్రమం తప్పక వచ్చి అలవాటైన ఆ లెక్కలు
ఈమధ్య రాక అలుగుతున్నవి రెండుమూడు నెలలు!!

మదిమూల నీడై ఒదిగి జతగా పలుకరించిన లెక్కలు
అవసరం తీరెనో ఏమో మారాం చేస్తున్నవి ఆ లెక్కలు
అలవాట్లు మారేలా చిందులేసి చేసె అంకెలగారడీలు!!

తలపుకి రావలసినవి గుర్తురాక తప్పుతున్న లెక్కలు
వస్తుందనుకున్నప్పుడు రాక విసుగు తెప్పించే లెక్కలు
ముగిసిపొమ్మంటే వినక పట్టిస్తున్నవి ముచ్చెమటలు!!

అడ్డాలనాటి బిడ్డలు పెరిగి గెడ్డాలుపెంచి అడుగ లెక్కలు
అండాల సంఖ్య తరిగిపోయి తడబడుతున్నవిగా లెక్కలు
జవాబులేని చికాకులకి సమాధానం ఆగిన బహిష్టులు!!

శరీరమార్పుకీ మనుషుల్లో మార్పుకీ పొంతలేని లెక్కలు
అయోమయ గందరగోళంతో తైతెక్కలాడుతున్న లెక్కలు
ఇవన్నీ జీవితం తరిగిపోతున్నట్లు చేస్తున్న హెచ్చరికలు!!   
     

మారనా?

ఋతుపవనాలపై గాలితెమ్మెరయే అలిగింది
పువ్వులోని తేనెను తుమ్మెదొచ్చి తాగింది
జీవితం నడవడికనే మార్చి దారిమళ్ళింది
ఈ వంకన నేను నా మనసు మార్చుకొని
బ్రతుకు మతలబు తెలుసుకుని మెలగనా? 

పాతలోగిలి లోనికి క్రొత్తకిరణమొచ్చి వాలింది
మండుటెండకి మోముపై మెరుపు తరిగింది
చిలిపితనం గంభీరరూపానికి బానిసై ఒరిగింది
ఇదే అదుననుకుని నా రూపం మార్చుకుని
బంధాలు త్రెంచుకుని నేను ఎటైనా ఎగిరిపోనా?

కోయిల పావురంలా సమాచారం అందించింది
ఉడుత నిలకడగా నిలబడి ఉన్నది చెప్పింది
అవకాశం అస్తిత్వానికి అవసరమనే రంగద్దింది
ఇలాగైనా రంగువేసి నన్ను నేను మార్చుకుని
అబధ్దపు లోకానికి నా ప్రత్యేకతను చాటుకోనా?