బంధం!

అన్నింటినీ మించినది ప్రేమబంధం
అనురాగాలమూటకి శ్రీకారమీ బంధం
ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం
సాగరానికి కెరటానికి ఉన్నది ఈ సంబంధం
జాబిలికి వెన్నెలతో ఉన్నది ఇదే అనుబంధం
అనుమానాలకి చోటివ్వని బంధం
నమ్మకంతో బలపడితే ఈ రాగబంధం
కలకాలం నిలుస్తుందదే అనురాగబంధం

వృధా ప్రయాస!

కరిగిన కలలో నిజాన్ని చూస్తున్నా
రాతిగుండెలో ప్రేమని వెతుకుతున్నా
ఎంతటి పిచ్చిదాన్ని నేను...
మాటేరానివాడ్ని ఒట్టేసి చెప్పమంటున్నా!

మోసాల అంగట్లో మంచిని బేరమాడుతున్నా
అనామకుని కళ్ళలో నన్నునేను వెతుకున్నా
మనసేలేని చోట నేను...
మమతలసామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!

చెవిటివాని ముందు కోయిలనై కూస్తున్నా
విరిగిన కొమ్మ చిగురించాల
నుకుంటున్నా
ఒడ్డున దొరికిన శంఖంలో నేను...
స్వాతిముత్యాలకై అన్వేషిస్తున్నా!

ఇసుక నుండి తైలాన్ని తీయాలనుకున్నా
నడి సముద్రములో నావనై నేనున్నా
ప్రేమని ఆశించిన నేను...
కన్నీటికెరటాలలో ఎదురీదుతున్నా!

నా గది/My room...


నాగది చూపింది నాకు విజయ మార్గం.....

ఉన్నతంగా ఆలోచించమంది పైనున్నకప్పు!
(Roof-Aim high)
సమయం ఎంతో విలువైనదంది గడియారం!
(Clock-Time is precious)
ఫ్యాన్ అంది శాంతంగా ఉండు నీదరిచేరదు ఏముప్పు!
(Fan-Be Cool)
ఏ పనికైనా ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోమంది అద్దం!
(Mirror-Reflect before you act)
కిటీకీ అంది భాధలు ఏవైనా నీ మనసుతో నీవే చెప్పు!
(Window-Take pain)
సకాలంలో పనులను పూర్తి చేయమంది దినసూచకం!
(Calender-Be up to date)
ఎప్పుడూ ముందడుగునే వేయమంది తలుపు!
(Door-Push)
భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకోమంది దీపం!
(Lamp-Light the way for your future)
మంచమంది మత్తులో పడకు అది నీకు తీసుకునిరాదు ఏగుర్తింపు!
(Cot-Don't get Addict)

నామది చెప్పింది పైవాటిని పాటించుతూ సాగనీ నీ పయనం....

చేయూత!!

నేను ఒంటరినై ఉన్నప్పుడు,నెమరైన ఙ్జాపకానివై నీవురావాలి!

మౌనం నన్ను చుట్టేసినప్పుడు,నీ పలకరింపులే తోడుకావాలి!

సమస్యల వలలో చిక్కిన్నప్పుడు,నేనున్నానని నా వెన్నుతట్టాలి!

గమ్యాన్న అవరోధాలున్నప్పుడు,మధురమైన భవిష్యత్తుగా కనపడాలి!

బ్రతుకు పయనంలో అలసినప్పుడు,నీ వెచ్చని ఒడిలో సేదతీరాలి!

చీకటిలో నేను దారితప్పినప్పుడు,ఆశల దీపమై వెలుగు చూపాలి!

జీవనయానంలో పోరాడేటప్పుడు,నన్ను వెంటాడే నీడవైపోవాలి!

నాకై నేను!

నన్ను నేనే మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేనే అద్దంలో చూసుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు...
నన్ను నేనే సమర్ధించుకుంటాను
అది ఎదుటివారికి సమ్మతమైనప్పుడు...

నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను భాధించినప్పుడు...
నాకు నేనే శిక్ష విధించుకుంటాను
నేరం నా వలన జరిగినప్పుడు...
నాకు నేనే దూరమైపోతాను
ఎవరికీ పనికిరానప్పుడు...

నా కంటిని నేనే శాసిస్తాను
సాక్షినై సహాయం చేయవలసినప్పుడు...
నా మనసుని నేనే లెక్కచేయను
అది తప్పు అని నాకు తోచినప్పుడు...
నా ప్రాణమైనా ధారపోస్తాను
పదిమందికీ అది ఉపయోగ పడుతుందనుకున్నప్పుడు...