ఎందుకిలా...???

మట్టితో చేయబడ్డ మనం నీటమునిగి తేలుతున్నాం...

చావే చివరి మజిలీ అని తెలిసికూడా పయనిస్తున్నాం...

కట్టెలపై కాలే శరీరాన్ని సింగారించి మరీ మురుస్తున్నాం...

వెంటరాదని తెలిసికూడా ధనార్జనకై రేయింబగలు శ్రమిస్తున్నాం...

చెడుకి దరిచేరిన మనం మంచిని మంచువలే కరిగిస్తున్నాం...

నలుగురిలో రానినవ్వుని పెదవులపై రంగరించుకుని రాణిస్తున్నాం...

కృత్రిమత్వంతో కరుణను సైతం కఠినంగా కాళ్ళరాచేస్తున్నాం...

ప్రతిరోజు పడిలేస్తూ ఎందుకిలా చచ్చి బ్రతికేస్తున్నాం...?????

ఒక కల...

ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని!!!

ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!

ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని!!!

ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!

ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని!!!

వినాయకుడికి దండాలు!

అమ్మచేతితో మలచబడ్డ అద్వితీయుడు

పదునాలుగు భువనాలకు పరమాప్తుడు

మనందరి మ్రొక్కులలో ముందుంటాడు

విఘ్నాలను తొలగించే వినాయకుడు

కొలచిన ప్రతిమదిలో కొలువుండేవాడు

కలిమిని బలిమిని కలిగించువాడు

శక్తిని యుక్తిగా చూపే స్కందాగ్రజుడు

యఙ్జాలపతిగా నిలచే యశస్కందరుడు

సర్వజనులను రక్షించే సర్వరాయుడు

స్వీట్స్ ప్రపోసల్కి హాట్ ఆన్సర్!

ఓయ్...కుర్రాడా!
నువ్వే నా ఆవడా
నీ దొంగ లుక్స్...
వేడి వేడి ఆలుచిప్స్!
నీ హెయిర్ స్టైల్...
విడివడిన మాగీనూడిల్!
నీ రెండు నయనాలు...
గుర్తొస్తున్నాయి చిట్టిచెకోడీలు!
నీ మీసకట్టు...
మాడిన పెసరట్టు!
మొటిమలతో నీ చెంపలు...
తలపిస్తున్నాయి శెనగపప్పుచెక్కలు!
నీలో ఏముందో నాకు తెలియకుంది...
అయినా నువ్వే నాకిష్టమైన కారప్బూంది!
నీపై ఆలోచనలు సన్నకారప్పూస...
నీ మనసు మాత్రం వెన్నపూస!
నచ్చింది నాపై నీకున్న ఆశ...
అది కమ్మని మసాలాదోశ!
సై అంటున్నాను నీ స్వీట్స్ ప్రపోసల్ కోయ్...
తిందాం చిన్ని ఉల్లి సమోసాలు పదవోయ్!:)

స్వీట్స్ ప్రపోసల్

ఓ...అమ్మాయి!!!
నీవే నా పీచుమిఠాయి
ఓరకంట చూడమాకే ఓ పిల్లా
నాకు గుర్తుకొస్తుంది రసగుల్లా
నీ అధరాలపై దరహాసం
నాకది సేమ్యా పాయసం
నీవు నడుస్తుంటే భలే మజా
తలపిస్తుందది తాపేశ్వరం కాజా
నీ జడలోని గులాబీ
నాకు అక్కర్లెద్దు జిలేబీ
నీ బుగ్గలపై పడే సొట్లు
నా మదిలో మెదిలే బొబ్బట్లు
నీ చీరమాటున దాగిన బొడ్డు
గుర్తుచేస్తుందది తొక్కుడులడ్డు
నీ నల్లని కురుల సిరులు
రాసులై కనిపిస్తున్న పూతరేకులు
అమ్మో! నీ అందాన్ని కొల్వ
సరిపోదు నూరుకిలోల హల్వ
నాకు నీవే సరి అయిన సిరి
నీవుంటే నాజీవితం రవ్వకేసరి
కాదని అనకే ఓ! డింగ్రీ
నేనౌతా తీపిలేని జాంగ్రీ
సరే అని ఒప్పుకోవే నా చెలీ
అందరికీ పంచుదాం చక్కెరపొంగలి!!!

అభ్యర్ధన:-అమితంగా స్వీట్స్ ని ఇష్టపడే ఓ అబ్బాయి తన ప్రేయసికి చేసిన స్వీట్స్ ప్రపోసల్......స్వీట్ స్వీట్ గా చదివి ఆనందించండి, ఆరగించకండేం:):)