పూలలో మనమిద్దరం....

నా నవ్వు నిన్ను చేస్తుందంటే పరవశం
స్వఛ్ఛమైన మల్లెల నవ్వులే నీసొంతం

పిలచి చూడు నా పేరులోని ఒక్క పదం
పద్మాల కొలనునై సేద తీరుస్తాను నిత్యం

ఎడారిలోని మండుటెండలో నీతో పయనం
నాకది గులాబీల తివాచిలాంటి మెత్తదనం

నీ హృదయంపై నా తలవాల్చి నిదురించడం
చామంతిపూల పరుపుపై పవళించిన చల్లదనం

నీవు నా చెంతన ఉన్నప్పుడు ప్రతినిముషం
నాశ్వాస అవుతుంది మొగలిపూల సుగంధం

మదివిప్పి మాట్లాడకుండా నీవుంటే మౌనం
నా మనసే అవుతుంది గంపెడుబంతుల భారం

ఒకరి మెడలో ఒకరం వేసుకుంటే పూలహారం
కనకాంబరాల గుత్తై చేస్తుంది నామది నాట్యం

జీవితం ఏమిటి?


విధివ్రాతను ఎవరూ మార్చలేరు

కాగలకార్యాన్ని ఎవరూ ఆపలేరు

మార్చగలిగితే! ఆనందం ప్రతిఒక్కరిదంట
ఆపగలిగితే! భాధలకి చిరునామాయేలేదంట

తలచినది జరగని నాడు చింత పడవలదు
పలుమార్లు ప్రయత్నించడంలో జాప్యంవలదు

నిరాశ పడకు నీవు, ఏదీ నీకు సాధ్యం కాదని
తెలుపు సాధనతో అసాధ్యం కూడా సాధ్యమని!

ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం...
భాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం...
గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం...
ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం జీవితం!

వెలిగిస్తున్నా!!!



నరకచతుర్థినాడు నరికేసాను...
నాలోని అహాన్ని
అది కలిగిస్తున్న అంతరాయాన్ని!

అమావాస్యనాడు తొలగిస్తున్నాను...
నాలోని అంధకారాన్ని
మార్చాను వెలుగువైపుకి నా గమ్యాన్ని!

దీపావళి జ్యోతులతో వెలిగిస్తాను...
రెక్కలులేని ఊహల భూచక్రాలని
మమతల్ని విరజిమ్మే మతాబులని
హద్దులు దాటని ఆశల చిచ్చుబుడ్లని
అలుకలా మాయమైపోయే సిసింద్రీలని
ఆకాశానికి ఎగిరే ఆశయాల తారాజువ్వలని!
బాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!!

నాకివ్వు...


నాకు నీపై చెప్పలేని అనురాగం...
తప్పలేదైనా మనమధ్య దూరం...
దొంగిలించావు నాశ్వాసలోని సగం...
అంటున్నావు చేయలేదని ఏనేరం...

ఈ దూరాన్ని ఎడబాటు అనుకోకు...
నా మౌనాన్ని అలుక అని అనుకోకు...
నిన్నేతలచే నన్ను అలుసుగా చూడకు...
విధివ్రాతకు మన బ్రతుకును బలికానీకు...

ఆనందాన్ని అందరికీ పంచి నీ నవ్వుని నాకివ్వు...
సమయాన్ని అందరికిచ్చి నీ జీవితాన్ని నాకివ్వు...
ఆప్యాయాన్ని పదిమందికిచ్చి నీ హృదయాన్ని నాకివ్వు...
ఎందరు నిన్ను ప్రేమించినా నీ ప్రేమను మాత్రం నాకివ్వు...