చేయొద్దని...

నా భావాల్లో ఇన్ని రంగులెందుకని
బయటపడి నీకు అలుసవ్వొద్దని...

నీ ఆలోచనలని చుట్టుముట్టొద్దని
నా కంట నీరుగా బయటపడొద్దని...

నా మోముపై ఈ వెలుగెందుకని
నీ హృదయంలో నేను బంధీనని...

ఆస్వాదించలేని అందమైన ప్రేమని
బంధాల గుప్పెట్లో బందిచ్చొద్దని...

అధరాలపై ఈ ధరహాసమెందుకని
ఎదలోని వేదన నీకు తెలియొద్దని...

నేను మరణిస్తే నా చితికి నిప్పెట్టొద్దని
హృదయంలో ఉన్న నిన్ను కాల్చొద్దని.

ఒంటరినై....

అందరిలో నే ఒంటరిగా ఉన్నా
ఒంటరిలో నిన్ను తలంచి...
నలుగురిలో నవ్వేస్తున్నా!

గువ్వలు గూటికి చేరుకున్నా
నువ్వులేని గూడునెంచి...
ఒంటరినై విలపిస్తున్నా!

నీవస్తావని సింగారించుకున్నా
అద్దంలో నన్ను నేగాంచి...
మిడిసిపడలేక మిగిలున్నా!

కలనైనా కనిపిస్తావనుకున్నా
మూతపడని కనులుతెరచి,,,
నిదురకై నేను ఎదురుచూస్తున్నా!

అనురాగానికి అర్థం నేనన్నా
అందని నీకేం అందించి...
ఆప్యాయతను ఇవ్వననడుగుతున్నా!

భావాలెన్నో..

నాలో పొంగే భావాలే నన్నుమరి మరి వెంటాడి వేధిస్తున్నాయ్..
నాతో సహకరించని నిజాలు నన్నుతప్పు చేయమంటున్నాయ్..
నా ఈ చేతకాని ఆలోచనలు కలల నిప్పుల్లో కాలిపొతుంటే..
ఆనంద గడిలెన్నోఆదర్శాల అగ్నికి ఆహుతి అవుతుంటే..
నీవు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిదురపోతున్నావ్..
నాలో నీ తలపులతో కూడిన చింత ఎందుకు రేపుతున్నావ్..
నీపై నాకు లేని అధికారానికై ఎందుకింత తాపత్రయం..
నీ ఆనందం తప్ప ఇంకేమీ ఆశించని నా ఈ ప్రయత్నం..
నిర్మలమనసు నియమనిబంధనలను లెక్కచేయకన్నాయ్..
భీతులెన్నో ముసురువీడిన మబ్బులవోలె వెంటాడుతున్నాయ్..
అయినా చంచలమైన భావాలు చెలరేగిపోతూనే ఉన్నాయ్..
తెలిసీ తెలియకుండానే తీయని భాధను వెతుకుతున్నాయ్..

నా కనులు...

నా కనులు...
నన్ను నాకు చూపాయి
లోకాన్ని చూడమన్నాయి
మంచీచెడులను చూసాయి
ఎన్నో కలలకు రూపాలైనాయి!
నా కనులు...
ఎదఘోషను తెలిపాయి
పెదవి పలుకని పదాలైనాయి
మౌనంగా ఊసులే చెప్పాయి
భావాలకు భాష్యాలు నేర్పాయి!!
నా కనులు...
ఎన్నెన్నో కళలు నేర్చాయి
భాధలో భాష్పాలై ఓదార్చాయి
ఆలోచనలకు బంధీ అయినాయి
మనసుకు మాత్రం లొంగిపోయాయి!!!

కలర్స్...


పసిడి మెరుపుల పసుపుతనం
చెక్కిళ్ళపై మెరవాలి ఎరుపుదనం
నలుపై విరియాలి కురుల అందం
కళ్ళలో నీలి కలల అలల చల్లదనం
పలుకులు కావలె తేనెలతీయదనం
ఆకుపచ్చని ఆరోగ్యమే హరిచందనం
గులాబి పువ్వులోని సుకుమారత్వం
మనసు మాత్రం తెల్లని మంచుముత్యం
కేసరి సూర్యతేజమై వెలగాలి మీ జీవనం
మహిళాదినోత్సవ హోలీ శుభాకాంక్షలు....