24గంటల్లో క్షణమైనా...

ఒంటిగంటకు పడుకుంటే
రెండింటికి కలలోకి వస్తావు!
మూడుకి మగతగా కనుమూస్తే
నాలుగ్గంటలకే నన్ను లేపేస్తావు!
ఐదింటికి పక్షుల కుహుకుహూలతో
ఆరింటికి గాలితెమ్మెరవై నను తాకుతావు!
ఏడుగంటలకి ఎదురుగా లేవనుకుంటే
ఎనిమిదింటికి కర్తవ్యమంటూ కంగారుపెడతావు!
తొమ్మిదిగంటలకి తోవంతా నీ తలపుల్లో ఉంటే
పదిగంటలకి పనిలో మనసులగ్నం చేయమంటావు!
పదకొండింటికి తోటివారితో కలసి "టీ" త్రాగుతుంటే
పన్నెండుకి గడియారంలో ఏకమైనముళ్ళై కవ్విస్తావు!
పదమూడోగంటకి పదిమందితో కలసి భోంచేస్తుంటే
పద్నాల్గవగడియలో పదవే నీతోపాటే నేనున్నానంటావు!
పదిహేనుగంటలకి పని ఒత్తిడిలో మునిగి ఉంటే
పదహారుగంటలైందికదా... అల్పాహారం సేవించమంటావు!
పదిహేడవగంటకి హడావిడిగా పని ముగిస్తుంటే
పద్దెనిమిదవగడియకి పదిలంగా ఇంటికి చేరుకోమంటావు!
పంతొమ్మిదవగడియలో నీ పలకరింపుతో మురుస్తుంటే
ఇరవైగంటలకి నేనున్నాను నీతో భోజనంకానిమ్మంటావు!
ఇరవైఒకటిలో ఒంటరినై నిన్ను తలచి నేను విలపిస్తుంటే
ఇరవైరెండోగడియలోనైనా లోకంతీరు తెలుసుకోమంటావు!
ఇరవైమూడవగంటలో అలసి కునికిపాట్లు పడుతుంటే
ఇరవైనాలుగు గంటలతో ఈ రోజు గడిచింది ఇకచాలంటావు!


ఇరవైనాలుగ్గంటలూ నాతో ఉండే నీవు... నాకంటికెదురుగా క్షణమైనా లేవంటే!!!
కర్తవ్యపాలనలో నేను, ఉద్యోగరీత్యా నీవు... ఒకరికొకరం వేరైనా ఒకటేనంటావు!!!
(ఆర్మీలో పనిచేసే భర్తకు దూరంగా ఉన్న ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలి దినచర్యకు నా కవితారూపం)

ఉండిపోవే!

భాధలోను భావంలోను నీవే
ఓదార్చ నా చెంత నీవు లేవే!
దూరంగా ఉన్నాను అంటావే
చెంత చేరే మార్గమేదో చెప్పవే!

పగలంతా ఏదోలా గడిపేస్తావే
రేయిమాత్రం క్షణమైనా కదలవే!
అందమైన ఆకారమేల కోరతావే
మనసునెరిగి ప్రయత్నించి పొందవే!

కలలసౌధాలను ఇకనైనా వీడవే
వాస్తవాల్ని అక్కున చేర్చుకొనవే!
అబద్ధపు ఆసరాతో చేరువకాలేవే
నిజమై నిలకడగా నాతోనే ఉండిపోవే!

??????


ఆనందంగా ఉంటే ఓర్వలేదు ఈ లోకం

ఈ లోకానికి ఎందుకో ఈ మాయరోగం?

ప్రేమించే మనసులో నాటుతుంది ద్వేషబీజం
అది ఎదుగుతుంటే చూసి ఎందుకో అంత ఆనందం?

మాటల ముళ్ళని గుచ్చి చేస్తుంది మదిని గాయం
ఎందుకని ఆశిస్తుంది ఎదుటివారి నుండి పూలహారం?

గాయమై రోధిస్తున్న వారిని చూస్తే అదో చోద్యం
ప్రాణం వీడిన దేహానికెందుకో అభ్యంగనస్నానం?

తప్పును సమర్ధించుకుని క్షమను కోరే మనం
ఎదుటివారిలో తప్పునెంచి ఎందుకు శిక్షించడం?

అందరిలోను కొలువై ఉన్నాడు కదా దైవం
మరెందుకని గుడి-గోపురాల్లో ఆ నైవేద్యం?