మనసా...నీకు మేకప్ అవసరమా?


కనుపాపకి, కంటిరెప్పలకు కాటుక దానికి చత్రంలా చెక్కిన కనుబొమ్మలు, మొత్తంగా కంటికి అందాన్నొసగేది ఐ మేకప్ విత్ "ఐబ్రోస్ షేపింగ్"
ముక్కుకు ముక్కెర, ఉన్నా లేక పోయినా ముక్కు ఏ షేపైనా మేకప్ తో కోటేరుముక్కులా చూపొచ్చు కాదంటే చేయొచ్చు "ప్లాస్టిక్ సర్జరీ"
పెదవులకు ఒంపులను పెద్దవాటిని చిన్నవిగా సన్నగా చూపి నైపుణ్యంతో మెరిసే రంగులద్ది కవ్వించేలా చూపగల చాకచక్యముంది "లిపిస్టిక్"
ముడతలులేని ముఖంతో మెరిసిపోయేలా మెరుగులుదిద్ది ఆత్మవిశ్వాసం పెంచే క్రీములు, వాటికితోడు బ్లీచింగ్ తో పాటుగా "ఫేషియల్ మసాజ్"
కురులకు రంగులువేసి జీవంపోసి వాలుజడను కొంగ్రొత్త కొప్పులెన్నింటిగానో మలిచి మరల మరల చూసేలా చేసేదే "హెయిర్ కట్టింగ్ & కర్లింగ్"
శరీరాకృతి ఏదైనా మెరుపునిచ్చి అలసిన మన శ్రమని మరిచేల మర్ధనా చేసి ఒంటి నొప్పులను దూరం చేసేది "బాడీ మసాజ్ విత్ స్టీమింగ్"
అవాంచితరోమాలు వద్దంటూ తనువంతా తాకితే తలపింపచేయాలి పట్టుపీతాబరాలని అనుకునే వారికి ఉందిగా "వాక్సింగ్ మరియు థ్రెడ్డింగ్"
సుతిమెత్తని చేతులు సన్నని పొడుగైన చేతివేళ్ళు వాటికి తగ్గ గోళ్ళకు ఎన్నో డిజైన్ల నెయిల్ పాలిష్లు వేసి కేర్ తీసుకునేదే "మానీక్యూర్"
ముఖంలాగే కాళ్ళకి కూడా తగిన శ్రధ్ధ అవసరం అని చెప్పడమే కాదు చేసి చూపడంలో తీసిపోని ప్రక్రియ పేరు మీకుతెలిసిన "పెడిక్యూర్"

ఇవన్నీ ఆడవాళ్ళకే మాకోసం కాదని మేల్ బ్లాగ్ మిత్రులంతా తప్పించుకుందామనుకుంటే......
నా టపాలకి సైట్ కొట్టేవారి రాంకింగ్ గణనీయంగా పడిపోదాండి:-)
అందుకే వీటితోపాటు మీకు అడిషనల్ గా జిమ్మని, గడ్డాలు మీసాలు ట్రిమ్మని ఆడ్ చేసారు...
ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో!!!! చాలా ఉన్నాయిలెండి మగధీరులకు సాధనాలు మరియు చిట్కాలు,
కానీ....కూసింత ఓపిక తక్కువైన మీకు ఖర్చు మాత్రం ఎక్కువండోయ్! ఇది ఎలాగో ఒప్పుకోరులెండి.

ఏంటీ! బ్లాగ్ లో బ్యూటీ పార్లర్ తెరిచారా అని అడగబోతున్నారు కదండి?
అడిగినా మానినా మ్యాటరు మాత్రం అదికాదండి.....
ఈ అవయవాలన్నీ అందంగా కనపడాలంటే సాధనసామాగ్రీలు ఉన్నాయి
"మనసు" అందంగా కనపడడానికి మాత్రం ఏ సాధన సామాగ్రి అవసరంలేదు ఎందుకో???
కేవలం మనసిస్తే చాలు మనిషంతా అందంగా కనిపిస్తాడు ఎందుకో???
ఇదీ సంగతి......మీతో పంచుకోవాలని నేను ఫుల్ మేకప్ తో మీ ముందిలా..
మరి మీరేమంటారో!!!....వితౌట్ మేకప్ మనసువిప్పి చెప్తారు కదూ...:-)

సరసరాగాలు...

మునివేళ్ళు ముంగురులతో సరసమాడుతుంటే
నీవు చెంతనజేరి చిలిపి ఊహవై ఊసులాడమాకు

గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే
నీవు చేసిన అల్లరిని గురిచూసి గుర్తుకురానీయకు

అద్దం నా అందానికి దాసోహమై దాహమని అంటే
నీవు నా ప్రతిబింబమై పెదవిపై గాటుగా మారిపోకు

కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
నీవు కలగావచ్చి కన్నుగీటి కలవరపెట్టేసి పోమాకు

మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే
నీవు మదిలో మెదిలి మోహంతో పరవసింపజేయకు

స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
నీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు

కుచ్చిళ్ళు నన్ను తాకిన భాగ్యానికే తబ్బిబైపోతుంటే
నీవు తనువంతా తడిమిమేస్తున్న భావమై రెచ్చిపోకు

సమానత్వం నిలబడింది!

అయిదేళ్ళు అమ్మఒడిలో గారాలుపోయి
ఆపై నేర్చుకున్నా విద్యలెన్నో బడికెళ్ళిపోయి
పదహారేళ్ళ పరువపు మొగ్గనైన నన్నుచూసి
ఒద్దికైన పనులు నేర్చుకోమంటారు ఆచితూచి
అబ్బాయికన్నా నేనే అన్నింటా ఒకడుగు ముందోయి
అయినా అమ్మాయినని భేధం చూపుతారెందుకోయి?

అబ్బాయినైతే వంశోద్ధారకుడని వెన్నుతడతారోయి
నాకు తోడుగా వేరొకరిని వెన్నంటి పంపుతారుకదోయి
పాతికేళ్ళకి పాణిగ్రహణ
మని ప్రయత్నాలు మొదలెట్టి
తెలియని అనామకుడికి పెళ్ళని అరగంటలో అంటగట్టి
ఆడపిల్లే కాని ఈడపిల్లను కాదని పంపిచేస్తారు కదోయి
నేను చూపని అభిమానం అబ్బాయిలో ఏం చూసారోయి?

అమ్మాయి అందగత్తైతే అదృష్టం అతడిని వరిస్తుందోయి
అతడి చేతకాని తనానికి నాకాలిని ధూషిస్తారెందుకనోయి
ఓర్పునైపుణ్యాలని తోబుట్టువులుగా నాకు ఒప్పగించేసి
నా ఆశల గూటి తాళంచెవులని వేరొకరికి సొంతంచేసి
మాతృత్వమే స్త్రీకి పరమపదసోపానం అంటారెందుకోయి
పితృత్వమనే పదానికి పుట్టగతులెందుకని పెట్టలేదోయి?

ఇద్దరూ అన్నింటిలో సమానమంటూ పలికే పలుకులోయి
ఇవి కేవలం గద్దెపై ఉపన్యాసాలకే పరిమితమని తేల్చారోయి
ఇలా ఎందుకనడిగే అమ్మాయికి ఒద్దిక ఓర్పులేదని తేల్చేసి
ఇంకా వాధిస్తే బరితెగించావంటూ అర్థంకాని సమాధానమిచ్చి
సమానత్వమంటే అతడు ఆకాశమై ఆమె నేలైన నిలువుగీతోయి
గీసింది అతడే కాని ఆమె కాదు అనడానికి ఇదే నిదర్శనమోయి!

చేజారాక....

వెతకి వేసారినా నాలో దాగిన నన్నుకానక
నా అనుకున్నా ఎవరిలో స్వార్థం నేజూడక
తెలిసింది ఈ నిజం పలుమార్లు పడి లేచాక
తెరచాప ఒడ్డున వాలె నావ నీటమునిగాక

మదినొకటి పెదివిపై పలుకొకటని తెలిసాక
నమ్మకమే పోయె అన్నీ చేజారిపోయాక
సంపాదనలో అంబరమంత ఎత్తు ఎదిగాక
తెలిసె చందమామ తారలకే సొంతమైనాక

కోప ద్వేషాగ్నితో చేతులు కాల్చుకున్నాక
శాంత లేపనం పూయనేల బొబ్బలెక్కాక
అంధకారంలో ఆశ్రయ ఆసరాలనందించక
కొవ్వొత్తై కరగనేల సూర్యుడు ఉదయించాక

ఏమైనా గడచిన కాలాన్ని మరింక తలవక
నిరాశచెంది నిసృహలతో కాలం వెళ్ళదీయక
గతం నేర్పిన పాఠాల అనుభవంతో చలించక
జన్మకి సార్థకత చేకూర్చుకోవాలన్నదే కోరిక

విరిబోణి పిలుపు...

పెదవి పలుకలేని పలుకులు
చూపులు చెప్పునేమో చూడాలి
పగలు రాల్చిన సిగ్గుదొంతరలు
రేయంతా పరిమళం చిందించాలి!

మనువుతో కలసిన మనసులు
ప్రేమతో తనువులను ఏకంచేయాలి
తమకంతో మూతపడిన కనురెప్పలు
కౌగిలిలో కలువరేకులై విచ్చుకోవాలి!

దాచిఉంచిన మకరందకుసుమాలు
లాలనగా తన్మయంతో ఆస్వాధించాలి
చీరపై మెరుస్తున్న చెంకీ తళుక్కులు
సిగ్గుపడుతూ చీకటి ఆశ్రయం కోరాలి!

అలవాటులేని పెదవిగాట్ల సరసరాగాలు
తీయని రాగమై అలవోకగా ఆలపించాలి
దాగిన నెలవంకను పిలిచి విసిగిన తారలు
మన్మధునితో కయ్యానికి కాలుదువ్వాలి!

తెలిసికూడా...

ఆశల రెమ్మలే అయినా
చిగురుతొడిగాయి వద్దన్నా
ఎన్నో ఊహలకు ప్రాణం పోసి
నా ఊహల్లో కూడా ఉండలేన
న్నా
నాఊపిరిని నాకు కాకుండా చేసిపోయినా,
ఎందుకిలా చేసావని నేనడగను...
అడిగితే నీ సమాధనం.....
నన్ను బలహీనురాలుని చేస్తుందని తెలుసును!

నా మనసు నిన్ను వీడనని
మొరాయిస్తుందని వీడితే నిర్జీవని
అందుకే దాన్ని నా నుండి వేరుచేసి
నీకే అర్పిస్తున్నా నీవు కాద
న్నా
ఎందుకో చెబుతాను నీవు అడకపోయినా,
అనురాగానికి బంధీ
యిపోయి...
అది నీకు బానిసగామారి.....
నన్ను స్వార్థపరురాలిగా మార్చిందని తెలుసును!

కాలగమనంతో సై...

సెకనుకు సెకనుకు ఒక శ్వాసై
నిముషానికో కనురెప్ప మూతై
గడియకి ఒకమారు పలుకరింపై
దినమంతా చెరగని చిరునవ్వువై
వారానికొకసారి అందమైన అలుకై
మాసమంతా మనోఉల్లాసభరితమై
ఏడాదిపొడవునా సంతోషసరాగాలై
అందించు నూరేళ్ళ జీవితాన్ని నాకై
శ్వాస విడుద్దాం ఇరువురమూ ఒకటై
పెనవేసుకోనీ యుగాలబంధం మనదై
కాలభ్రమణం విడదీయలేని తోడు-నీడై


సై అంటే......మీకో ప్రశ్న
చిత్రంలో ఆమెలో అతడు ఎక్కడ దాగున్నాడో చెప్పండి?
ఆమె పంచముఖాల్లోని విభిన్న భావాలని గమనించండి!
కనిపిస్తే నేను ధన్యురాలను, లేకపొతే మీరే సుమండి.....

ఓ! కమ్మని కవితా...

కవితా! నాలోని భావానివై ఉరకలు వేయి
నీకు ప్రతి రూపంగా నన్ను పలికించేయి

కవితా! నాలో ఏమూల దాగినా వచ్చేయి
నా ఆలోచనలకి అక్షరాలని జోడించేయి

కవితా! అజ్ఞానినని అలుసుగా చూడకోయి
నాతోడై పదకుసుమాలుగా విరబూసేయి

కవితా! నీకు అనర్హమంటూ ఏదీ లేదోయి
నీవు పలికించే ప్రతిపదంలో జీవంపోయి

కవితా! నన్ను కాదని వేరొకరి సొత్తైపోయి
శూన్యానికి నిదర్శనంగా నన్ను చూపకోయి

కవితా! మందబుద్ధినై తప్పులు చేస్తానోయి
పడిలేచిన నేను లేడినై పరుగిడతానోయి

కవితా! ఆచరించే వాటినే లిఖింపచేయి
సాలెగూడై అల్లుకునే పదాలు వలదోయి

కవితా! పసందైన పదపానకానివి కావోయి
పద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!