బ్లాగర్స్ కి భలే విందు:-)

పద్మార్పితా....ఎప్పుడూ ఏవో ప్రశ్నలతో, నీ రాతలతో ఇబ్బంది పెట్టకపోతే చక్కగా వంటచేసి విందు భోజనం పెట్టమని ఒక బ్లాగ్ మిత్రుడు అడిగితే...... ఒక్కరికి కాదు వందమందికి పెట్టేస్తానని పేట్రేగిపోయి పార్టీ కోసం పొయ్యి మీద  హైదరాబాదీ బిరియానీని దమ్ముకు పెట్టి, ఖుర్బానీ కా మీటా చేయనా లేక డబుల్ కా మీటా కావాలా అని అడుగుదామని  నా మొట్టమొదటి బ్లాగ్ మెంబర్ గా చేరిన Prakashగారిని పలుకరించబోతే పత్తాయేలేకుండా పోయారు:-( సరే కానీయండి ఒక్కరికోసం తొంభైతొమ్మిది మందిని పస్తులుంచడం సబబు కాదని ఈ రెండింటికన్నా  సులువుగా అయిపోయే పాయసం చేసి మీ అందరికీ ప్రీతిపాత్రురాలిని కావాలని శ్రమపడి స్యేమియా నేతిలో వేపి చేసి అందరికీ ఇస్తాను అనుకుంటే పొరపాటేనండోయ్!!!! ( మనలోమాట బాంబినో ఇన్స్టంట్ ఖీర్ మిక్స్ ప్యాకెట్స్ తో పని కానిస్తున్నా;-) పాలు మరిగించి అందులో ఈ పాకెట్స్ కట్ చేసి వేసి కలిపితే రెడీ, ఇదో పనా ఎగస్ట్రాలు కాకపోతే అని పాకప్రావ్యీణులు నన్ను ఆడిపోసుకుంటే అతి చెత్త కవిత రాసి ఒకటి పోస్ట్ చేయగలనే కానీ వారిలా ప్రావీణ్యంతో పంచబక్షపరమాన్నాలు కాదు పాయసం కూడా ఇవ్వలేననేది కొందరికే తెలుసు ఈ పార్టీ ముగిసేలోపు అందరికీ తెలుస్తుందిలెండి......కబుర్లు తరువాత ముందు వంటకానీయమని అంటున్న మాటలు చెవి విన్నంత మాత్రాన్న నా మెదడుకి అది చేరవేయలేదులెండి.....ఎందుకని అడిగితే ఏమి చెప్పను అన్నీ చెత్త ప్రశ్నలు ఆలోచనలతో హౌస్ ఫుల్ అయిపోయి ఇలా పనికొచ్చే సంకేతాలని త్రోసివేస్తుందని చెప్పుకుంటే చీప్ అయిపోతాను కదా!
అమ్మో! ఇలా నా వీక్ పాయింట్స్ చెప్పుకుంటూపోతే ఈ బక్రీద్ నాడు ఇవ్వాల్సిన పార్టీని న్యూ ఇయర్ నాటికి ఇస్తానని నాకు మాత్రమే తెలుసు. అందుకే చకచకా తొంభైతొమ్మిది మంది మెంబర్స్ ని మదిలో స్మరించుకుని అందరినీ పలుకరించే టైం లేక పార్టీలో పలుకరింపుతో పాటు పద్యమొకటి పద్మ అర్పించక పోదా....అది విని బ్లాగ్ మిత్రులంతా పరవశించి పోరా అన్న ధీమాలో పార్టీ లుక్ కోసం నేనే రంగులద్ది మీకు కన్నులపండుగ గావించాలని కుంచెని, కాగితాన్ని కిచెన్ లోకి తీసుకుని వెళ్ళి ఎడమ చేత్తో ఖీర్ మిక్స్ ని కలిపేస్తూ కుడి చేత్తో కుంచెని రంగులో అద్ది తిప్పేస్తుంటే.......చిత్రం అబ్బో అదిరిపోద్ది, నా పాయసం టేస్ట్ పడిపోద్దనుకున్న పాలు పొయ్యిమంట సహాయంతో పొంగిపొర్లి పేపర్ నంతా తడిపి తరించాయి. పాలులేని పాయసం పేస్ట్ లా మారింది, పేట్రేగి పోయి పార్టీ ఇస్తాను, స్వయంపాకం చేస్తానని ప్రేలాపనలకి పోయి ప్యారడైజ్ హోటల్ నుండి బిరియానీ ఫ్యామిలీ ప్యాకెట్స్ తెప్పించి గిన్నెలో బోర్లించి దమ్ముకెట్టి మీ ముందు నేనే చేసిన ఫోజు కొడదామనుకున్నా.......
పాయసమేనా పేస్ట్ లా మారేది మేము అంతకు మించి అదరగొట్టగలం అంటూ గిన్నెలోపలా అడుగునా కూడా అడుగంటి బిరియాని ఒక గిన్నె అచ్చులా(మోల్డ్) తయారై తిక్క కుదిరిందా అంది....
ఈ గోడు ఎవరికైనా వెళ్ళబోసుకుంటేనే కాని తీరదని నా నూరవ బ్లాగ్ మెంబర్ కి చెప్పుకుందామంటే పేరునే "తర్కం" అని పెట్టుకుని నన్ను భయపెడితే తికమక పడి దానికన్నా మీ అందరితో తిట్టించుకుంటే జ్ఞానమైనా వస్తుందని ఇలా మీ ముందు మోకరిల్లాను.

ఇంతకీ పార్టీ ఎందుకని మీరు అడకపోయినా చెప్తానండి.....ప్యార్ సే పార్టీ అంటే మీరు రీసన్ అడగరనుకోండి అయినా మిమ్మల్ని అందరినీ కలవాలన్న కోరిక దానికి రీసన్ వెతికితే దొరికింది నా "బ్లాగ్ మెంబర్స్ 100" కి చేరారని..... 

 తెలిసింది కదాండి.....ఇంక ఆగకండి, దీని మూలంగా నీకు అర్థమైంది ఏమిటి పద్మార్పితా.... ఎవరు చేసే పని వారు చేయాలనో లేక వందమందిలో కనీసం 100% అయినా సంప్రదించాలనో, నాన్ వెజ్ తినని వాళ్ళు సంతోషంగా, తినేవాళ్ళు అంతంది ఇంతంది ఆఖరికి ఆకలితో మాడ్చిందనో నన్ను నాలుగు దులిపి మీతో పాటు ఇంకో 900 మందిని మెంబర్స్ గా చేర్చి వాళ్ళతో కూడా అంక్షింతలు వేయించుకోవాలని చిన్ని చిట్టి ఆశ అంతే:-)

కలలో కలసిపోదాం!

లోకంతో పనిలేదు పద పారిపోదాం
కారుచీకట్లో ఇరువురం లేచిపోదాం!
వద్దని వారించేవారికి దూరమైపోదాం
ఒకరిలోఒకరిగా ఏకమై కలసిపోదాం!
కాలమా నీ పనిలేదంటూ వెలివేద్దాం
శృంగారంలో శిఖరాగ్రాన్ని తాకివద్దాం!

మరో తాజ్ మహల్
మనకై కట్టేసుకుందాం
ప్రేమైక జీవులమని ఎలుగెత్తి చాటుదాం!
అలుకతీర్చగ ఇచ్చే వజ్రాల బహుమానం
కనకం అంటేనే కలిగె నాలో విరక్తి భావం!
 
రెక్కల గుర్రమెక్కి ఊహల్లో విహరించేద్దాం
 కాసులతో పనిలేని లోకమొకటి నిర్మించేద్దాం!

కాలయాపన ఏల గాలిలో తేలుతూ వేగిరం రా
కళ్యాణమెందుకు కలలోనేకదా ఎగరేసుకుపోరా
కలలకౌగిలిలో కోరికలు ఎన్నున్నా తీర్చేసుకోరా
కళ్ళు తెరిచాక వాదులాడి ప్రయోజనం లేదురా
కలలయామినైతే చుక్కాని నీవై రేయి గడిపేద్దాం
కరిగిన కలలని కలవరింతలుగా సమాధి చేద్దాం!

బ్రతికున్న చావు...

కాలచక్రానికి బానిసలై తిరుగుతూ
అందని ఆశలకు నిచ్చనలువేస్తూ...
వేరొకరికై కాలాన్ని వెచ్చించనివారు
వారుపోతే చుట్టూ చేరి రోధిస్తారెందుకు?

స్వార్ధపు మేడమిద్దెల్లో బ్రతుకుతూ
పలికితే గడియ వ్యర్థమని తలుస్తూ...
పలుకరించి నవ్వుల పూలీయనెరుగరు
నిర్జీవైతే పూలదండలతో పరామర్శలెందుకు?

వివిధ రుచులన్వేషణలో గడుపుతూ
ఆకలితీర్చుకోక తినడంకోసమే జీవిస్తూ...
ఏనాడూ తనవారితో కలసి భోంచేయనివారు
చచ్చాక సంతర్పణ సంవత్సరీకాలు చేస్తారెందుకు?

అన్నీ తమసొంతం కావాలని మ్రొక్కుతూ
అశాశ్విత విజయపు వెలుగులో మురుస్తూ...
చీకటివేళన చిగురాశల చమురు దీపమెట్టరు
ప్రాణంపోయాక దీపమెట్టి దేవుడిలోకలిపేస్తారెందుకు?


కనులుమూసుకున్న శవమనుకుంది నవ్వుతూ
అందరూ మూడుగంటల జీవన్నాటకంలో నటిస్తూ...
తమబ్రతునే ప్రేమించే స్వార్ధపరులు రోజూ చస్తుంటారు
చావుని ప్రేమించి సహాయపడితే రోజూ బ్రతికుంటారని!

నా కవితవై....

పంజరాన్న బంధించిన భావాలనేమి వ్రాయను
మూగనోము పట్టిన ఊసులను ఎలా తెలుపను
వెన్నెలే దాగుడుమూతలాడితే పదం పలుకలేను
కలబోసిన రంగులు విడదీసి ఏబొమ్మ నే గీయను
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?


వర్ణాలే తెలియని నేను వర్ణించేదా ప్రకృతి అందాలని
ప్రేమే ఎరుగని నేనేమి వివరించేది ప్రేమరాహిత్యాన్ని
ఆకలన్నదేలేని నే తెలపనా పేదవాని ఆకలిఘోషని
నీతిలేని రాజకీయాలపై రాయ నేను ఎంతటి దానని
కవితా నేడు ఏమని అడగను? దేనిపై చర్చించను?

నా కనులు తెరిచి చుట్టూ చీకటినే చూస్తున్నాయి

నగ్నసత్యాలు సంకెళ్ళను తెంచుకు రాలేనన్నాయి
చీకటి నుండి వెలుగు రేఖలు తప్పక ప్రకాశిస్తాయి
కలమా.......నేడు నీవే కదిలే కాలంగా మారిపోయి
నీ స్థాయి కవితేదో లిఖించి పద్మార్పితవై విరబూయి!

ఎప్పటికీ ఇలాగే...

నీ ఊపిరిలో నన్నుండిపోనీ, గుండెమూల నన్నొదిగిపోనీ
ఎడబాటులో ప్రేమలోతుని చూడనీ, ఊహలు ఊసులవనీ
ప్రేమున్నా లేకపోయినా, నీ ప్రతితలపులో నన్నుండిపోనీ
వీలుకాదని వదిలెళ్ళిపోతే వేదనే వర్షమై నినుతడిపేయనీ!

వదిలేయాలనుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా చూపించి దారిమళ్ళిపో
సృహలో ఉంటే  జీవించలేని నన్ను పిచ్చిదానిగా మార్చిపో
మమతలగూళ్ళైన నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో!

నన్ను మరచిన మైమరపుకే ఆనందమంతా సొంతమవనీ
పలుకనిభావమేదో లిపిలేనిభాషై నీ పెదవులపై విరబూయనీ
కలకాలం ఆ నవ్వేదో నిన్ను వీడని నీడలా నిన్నంటుండిపోనీ
ప్రాణం వీడి నా దేహం దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ!

నలుపు/తెలుపు

తెలుపు స్వచ్ఛతకి చిహ్నమైనప్పుడు...
దాన్ని చూపే కనుగుడ్డు నలుపెందుకు?
కనుముక్కు తీరు చక్కగున్నప్పుడు...
నల్లగా ఉందంటూ ఆ విముఖతెందుకు?
మనసంతా మసిపులుకున్నప్పుడు...
పాలరాతి బొమ్మంటూ బిరుదులెందుకు?
ఎర్రగున్న ఎర్రిదాన్ని చూసినప్పుడు...
కుంటిగుర్రం సైతం రంకెలేయడమెందుకు?
కళ్ళతో మనసు చూసే కర్రెబండోడు...
ఎర్రతోలున్నదే కావాలని కోరడమెందుకు?
రంగుదేముంది ఏదైనా ఒకటనుకున్నప్పుడు...
తనకైతే తెల్లపిల్లనెంచుకునే ప్రభుధ్ధులెందుకు?
కనడానికి కారణమైనిరువురు నల్లగున్నప్పుడు...
తెల్లసంతతికై  కుంకుమపువ్వు మెక్కడమెందుకు?
నిగారింపు నాణ్యత నలుపులో ఉన్నప్పుడు...
అందమంతా తెలుపుదేనంటూ ఆధిపత్యమెందుకు?
తెలుపునుచూసి నల్లనిగుడ్డే చొంగకారుస్తున్నప్పుడు...
తెలుపు నలుపుల తారతమ్యమేలంటూ వాదనలెందుకు?

(సాధారణంగా తెల్లగున్న అమ్మాయి చీమకళ్ళు, చప్పిడిముక్కు, లావుపెదవులు ఉన్నా వాటిని మరచి అమ్మాయి తెల్లగా లేదా ఎర్రగా బాగుంది అంటాము. అదే అందమైన కళ్ళు, అవయవసౌష్టవం చక్కగా ఉన్నా నల్లని పిల్లైతే......ముందుగా వచ్చేమాట అమ్మాయి నల్లగా ఉందనే. మీరంతా కాదని పైకి అన్నా మనసు మాత్రం తెలుపువైపే మొగ్గుతుందనేది మాత్రం జగమెరిగిన సత్యం)
దానికి రూపకల్పమే నా ఈ తెలుపు/నలుపు:-)
కాదనో, అవుననో తిట్టండి.....ఆలస్యమెందుకు?