తీరం.....

అద్దమా.....నీవూ నా మనసులాగే
నా మనసుని విరిచి నవ్వమని నన్ను
పగిలిన నిన్ను పనికిరావని పారవేసారు!

ప్రేమా.....వారి అవసరానికి నీ పేరు పెట్టి
నవ్వేపెదవులతో తీయని మాటలెన్నో చెప్పి
దాహం తీర్చిన ముంతని వలదని విసిరేస్తారు!

దుఃఖమా.....నాడు నిన్ను కాలితో తన్నితే
నేడు  పరామర్శించడానికి వచ్చావు నన్ను
కంటనీరింకితే చెక్కిళ్ళపై చారలేం చూడగలరు!

నేస్తమా.....నా మౌనం నిన్ను కలవర పెట్టి
నీ ఎదతడపని కన్నీరు హృదయాన్ని ముంచి
కనపడని గాయమైతే మందేం వేయమంటారు!

ఆనందమా.....నాది కాని నీకై వెదికి అలసిపోతే
చేతిగీతలు చూసి నుదుటి రాతలో లేని నన్ను
గేలిచేస్తూ గోల చేయకే వెర్రిదానా అని నవ్వేస్తారు!

జీవితమా.....ప్రేమలో అంధుడివైన నావికుడిలాగే
నా ఆవేదనంతా దిక్సూచిగా చేసి ఎగురవేసినా
తూఫాను అలజడిలో నౌకను తీరం చేర్చలేరు!

నా స్వర్గం


ఎడబాటు ఎంతకాలమని ఆగలేక
చేరువవ్వాలని నీవు నడిచొస్తుంటే
మది పాదసవ్వడి వినిపిస్తుంది...
ఒంటరితనము ఏడ్వలేక నవ్వుతూ
రేయి సూర్యకాంతిని కావాలని కోరితే
ఆశ అమావాస్యలో వెన్నెలై కాస్తుంది...
గడిపిన క్షణాలు తీయని జ్ఞాపకాలై
నెమరు వేసుకుని నే కూర్చుంటే
దూరంగా సన్నాయి మ్రోగుతుంది...
ఒక్కోబొట్టులా కురుస్తున్న ఆకాశం
నిరీక్షణలన్నీ నదిలా ప్రవహిస్తుంటే
జీవితం జీవించమని పిలుస్తుంది...
నీవెచ్చని కౌగిలిలో సర్వం కోల్పోయి
నీ కనుసన్నల్లో కలకాలం కొలువుంటే 

ఇదే నా స్వర్గం అని చెప్పాలనుంది...
             అందని అతనికి అర్పితం!!

ఈ పిలుపులెందుకు?

మదిలో లేని తలపును, పెదవులతో పలుకనేల?
రంగుటద్దాలలో చూస్తూ వావివరుసలు అననేల?
చుట్టరికాలంటూ మనచుట్టూ మనం గిరిగీసుకున్నా
అంతర్మధన సంఘర్షణలకి అవి అడ్డుగోడలు అగునా?

మూడు ముళ్ళతో బంధించి భార్యభర్తల బంధమన్నా
ప్రేమకరువైతే అది పాశమై ఊపిరాడనీయక అపునా
భాధ్యతలు ఎరిగినవాడు బంధంలేని బావే అయినా
కామాంధుడై కోరిక తీర్చమని అడుగడు తెలుసునా!

అక్కా అన్న అతిచనువు ఆమె అందాలను వెతకినా
అన్నా అని పిలచినంత అతనిలో కోరిక అణగారేనా
వదినా అన్నవాడు ప్రేమవచనాలు వల్లించకుండునా
బాబాయ్ అని అంటే ఆమెలో రగిలిన సెగ చల్లారునా?

వావివరుసలని మనిషి ఈ పిలుపులను నిర్ధేశించినా
పుర్రెలో పుట్టిన బుధ్ధుల్ని పిలుపులు మార్చేయునా
మనసు మలినమై పిలిచే పిలుపులో పవిత్రత ఏల?
మనం పవిత్రంగా ఉంటే ఏమని పిలచినా తప్పేల!!?

పగిలిన హృదయం

నేడు బురదలో నిజాలు లిఖించాలనే తపన నీలో ఎందుకు
పొడారిన ఇసుకను గుప్పిట బంధించే ప్రయత్నం చేయకు
అద్దంలో నీ ప్రతిబింబంలో ఖననమైన నన్ను అన్వేషించకు
నేడు అలజడితో అణచివేయబడ్డ నా భావాల్ని వెలికితీయకు!

నేడు రెప్పలార్పినప్పుడు నా జ్ఞాపకాలని నీకళ్ళలో మూసేయి
ఆకాశాన్ని తాకిన కలల పర్వతం పై నుండి నన్ను జారనీయి
నీ హృదిపంజరంలో రెక్కలు తెగిపడిన నన్ను విముక్తిని చేయి
నేడు నీ ఊపిరిలో దాగిన నన్ను నన్నుగా బ్రతకమని వెలివేయి!

నేడు నేనులేని నీ చీకటి ఎదలో వెలుగుకై కొవ్వొత్తిని వెలిగించుకో
మండే నీ గుండెలో కరిగిపోతున్న నా గుండె మంటను చూసుకో
కాలి బూడిదౌతూ సెగలోడే గుండె పొగ నీ ఆకారమైనది ఎందుకో
ముక్కలైన హృదయ ఘోషను మనసనేది మిగిలుంటే తెలుసుకో!

ఒప్పేసుకోనా?

మంచిగంధం తీసి, ఒంటికి పసుపురాసి
నలుగెట్టి, కుంకుళ్ళతో తలస్నానం చేసి
కురులారబోసి, సాంబ్రాణి ధూపం వేసి

వాలుజడలో బొడ్డుమల్లెల మాలతో
కుచ్చీళ్ళు జీరాడు పట్టు పరికిణీతో
సన్నంచున్న ఎర్రని సిల్కు ఓణీతో

కలువకళ్ళకి చలువనిచ్చే కాటుకద్ది
నుదుటిన గుండ్రంగా సింధూరందిద్ది
పెదవికి గులాబీవంటి చిరునవ్వునద్ది
ముస్తాబై పెళ్ళిచూపులని కూర్చుని
సూటుబూటోడని ఓరకంట చూడగా..

జీన్స్ ప్యాంట్, చారల టీషర్ట్ అనేదోవేసి
తైలంలేని జుట్టుని నిక్కబొడిపింప చేసి
ట్రిమ్మింగని గీయనిగెడ్డానికి మసిపూసి

లోపలికొచ్చికూడా తీయని కళ్ళజోడుతో
చూస్తున్నది ఎటో కనిపెట్టలేని చూపుతో
మోడ్రన్ అంటూ అవేవేవో కొత్త టేస్ట్ లతో

నాలుకళ్ళతో ఎటోచూసి....ఇలా వలదని
చిన్నిచిల్లుల చొక్కా, పొట్టి ప్యాంటేసుకుని
పెదాలకెరుపు, గోళ్ళకి నలుపురంగేసుకుని..
ఎగుడుదిగుడులతో జుట్టు విరబోసుకోమని
ఇంకేవో అరడజనుకు పై ప్యాషన్ పేర్లు చెప్పి


అలాగైతే ఓకే అన్న ఆ "తెలింగీష్ బచ్చాని" ఒప్పేసుకోనా వద్దననా?
"NO" అంటే ఎందుకనో? "YES" అనడం ఎందుకో చెప్పొచ్చుగా:-)

ఏకమవనీ..

నాకు ఎవరూ, ఏదీ నచ్చట్లేదు
చివరికి నీవు కూడా నచ్చట్లేదు
నీజ్ఞాపకాలు, నీమాటలే నీకన్నా బాగున్నట్లు
అందులో నేను తడిసి ముద్ద అవుతున్నట్లు...
బాధే అయినా అవే బాగున్నాయ్
ఎందుకిలా నన్ను కలవరపెడుతున్నావ్
అని నీపై అరిచి గోలచేసి ఛీవాట్లు పెట్టి
ఇరువురమన్న భ్రమలో అందరిలో పోట్లాడి...
నీవు మౌనంగా ఉంటే నిన్ను రక్కి
నీకు గాయమైతే నేను గగ్గోల పెట్టి
నీవు నలుగురిలో ఎదుటపడని భావలని
మన ఏకాంతంలో నీతో పలికింపజేయాలని...
అలుగరాదనుకుని నీపై అలిగికూర్చుంటే
ఇదే గాయమంటూ నన్ను వాటేసుకుంటే
నీ ఎదపైవాలి నేను నీలో కలిసిపోవాలని
అన్నీ మరచి నీ ప్రేమలో కనుమూయాలని!!!

నాకు తెలిసినదేదో!!

                                                 ఈ లోకంలో నటించనివారు ఎవరు??
లేనిది చూపే ప్రయత్నమే నటించడం
ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే
నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు!
ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే
నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు!
ఈ రంగులుమార్చే లోకంలో ఎవరికెవరు??
ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం
స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే
అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు!
తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే
తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు!
ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు??
తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం
విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే
దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు!
కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే
మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు!

ఈ నీతిసూక్తులు నీకేల పద్మార్పిత అని ప్రశ్నించువారు!
వారికి తెలిసిన విషయాన్ని వ్యాఖ్యగా వివరిస్తారిక్కడ
ప్రశ్నించనివారు చదివి కిమ్మనక పలాయనమై చిత్తగిస్తే
చూసిన బ్లాగ్మిత్రులు కొందరైన అవుననో కాదనో అంటారు!
ఎవరు ఏమనుకున్నా మీరంతా తిలకించి ఆనందిస్తే
నా రాతలకి ఏదో కూసింత సార్థకత అని మురిసిపోతా!!