స్నేహానికి విడాకులు

ముడిపడని వివాహానికేనా విడాకులు
విచిత్ర స్నేహానికి అక్కర్లేదా ఏ ఆర్జీలు??
ఆడా మగా అంటూ స్నేహపు లింగబేధాలు
కోరికల్ని నియంత్రించలేక వీడిన నిగ్రహాలు
నలుగురిలో ముసుగు వెనుక దాపరికాలు
ఆకలితీర్చి అక్కరకాని అరటిపండుతొక్కలు
ఇరువురి నమ్మకానికి ఏవేవో సిఫార్సులు
ఆ నిగూఢ స్నేహానికి ఇచ్చేయి విడాకులు
మనసువిప్పి చెప్పలేనిదెందుకీ స్నేహాలు??

మనసులు కలవక కలసిన తనువులు
వివాహబంధంలో వీడితే అది విడాకులు
మనువుకాని తనువుల్ని కలిపే స్నేహాలు
ఎవరూ హర్షించని అక్రమసంబంధ బేడీలు
చీకటిమాటున సాగే రంకు రాచకార్యాలు
ఎదిరించి ఎదగలేనివీ కలుపు మొక్కలు
ఈ స్నేహానికీ అవసరమేకదా విడాకులు??

ఆలోచించండి!

నమస్కారాన్ని "హాయ్" "హెల్లో" కబళించిందని
సంస్కారాన్ని "షేక్ హ్యాండ్" ఇచ్చి విధిలించకండి!

అమ్మానాన్నల్ని "మమ్మీ" "డాడి" దొంగిలించారని
ఆత్మీయత అనురాగాలని దూరం కానీయకండి!

గురుకులాల్ని "మిషనరీ స్కూల్స్" మింగేసాయని
గురువులని అగౌరవపరిచే బుద్ధిహీనులు కాకండి!

కల్లు "బీర్, బ్రాందీ, విస్కీ, జిన్" ల కన్నా మంచిదని
మత్తులో మునిగి చిత్తుగా మందుకొట్టి చిల్లరకాకండి!

మాటామంచిని "టీ.వీ, టెక్నాలజీలు" కబ్జాచేసాయని
అనుబంధాలని వీడి ఒంటరితనానికి బానిసలవకండి!

అన్నాన్ని అట్టును "నూడిల్స్, బర్గర్" లు మెక్కాయని
ఆరోగ్యకరమైన అహారాన్ని వదలి వాటికలవాటవకండి!

పాలవంటి పరంపరలు "కల్చర్-ఫ్యాషన్" లకి లొంగాయని
మానవత్వాన్ని మరచి మీ అస్తిత్వానికి మీరే మరువకండి!

పద్మార్పితా! "వాట్ ఈజ్ దిస్ లెసన్ " అని నన్ను ప్రశ్నించినా
ఇందులోని మర్మాన్ని గ్రహించి ఆలోచించి నన్ను తిట్టుకోండి!

నచ్చడంలేదు!

నాకు అస్సలు నచ్చడం లేదు
గాలితెమ్మెరై కురులు చెరపడం
చిలిపి ఊహల్ని నామదిన రేపడం
కంటిచూపుతో కట్టివేసాను అనడం
కంటినిండా నీరై సుడులు తిరగడం!

ఇలా చేయడం భావ్యం కాదు
అలలా తాకి అలా వెళ్ళిపోవడం
తలచిన తనువు పులకరించడం
కౌగిలిలో బంధీనని బుకాయించడం
పలుకులకే అది పరిమితం కావడం!

నీకు ప్రేమించడం అస్సలు రాదు
ఉఛ్వాసగా చేరి నిఛ్వాసగారావడం
అలిగినా నీవది గుర్తించలేకపోవడం
నానీడగా ఉంటూ నాతో లేకపోవడం
ఇదేమిటంటే! ప్రేమకిదే పరిభాషనడం!

ప్రేమెక్కడో!!!

మెదడుదారి మళ్ళించి ప్రేమించరాదనుకున్నా
చూపుద్వారం ద్వారా మనసుని చేరింది ప్రేమ
మనసుబాటగా పయనించి మెదడుమాట విన్నా
భావోధ్వేగాల నడుమ కొట్టుమిట్టాడుతుంది ప్రేమ
ప్రేమ మత్తులో మునిగి తేలుతూ తెలుసుకున్నా
ఈ వ్యసనానికి నేను కూడా బానిసనైనానే ప్రేమ
ఇంత కఠినత్వమెందుకో దీనికి తెలుసుకోలేకున్నా
ప్రేమికుల వేదనతో అభిషేకించినా కటాక్షించని ప్రేమ
నన్నునేను ధ్వేషించుకుంటూ దూరమవ్వాలనుకున్నా
నాలోని ద్వేషాన్ని తొలగించే శక్తి కూడా నీకున్నదే ప్రేమ
ఇలా మనిషిలో మారుతున్న మనస్తత్వాన్ని చూస్తున్నా
ఇంక లోకమంతా నీ మయమేనని ఏమనుకోను ప్రేమ!

నిజమయ్యే కల!

ఎందుకో మౌనమంటే భయం వేస్తుంది
మనసువిప్పి మీకో నిజం చెప్పాలనుంది
నాకు కలలు కనడమంటే ఎందుకో భీతి
నేడు కలిగె సత్యమంటే అమితమైన ప్రీతి!

కనులుగన్న కలలెన్నడూ నిజం కాలేదు
కల నిజమన్న భ్రమలో సత్యం దరిచేరలేదు
కలలు నేర్పిన పిరికితనం నిజానికి ముసుగేసింది
తెలివిలేనితనం సత్యాన్ని వీడి స్వప్నాల్లో తేలింది!

నేడు అనుకోని నిజాలు ఆకస్మికంగా వచ్చి వాలాయి
కలలో తేలి ఆడుతున్న నన్ను తట్టి నిదుర లేపాయి
సత్యానిది తప్పులేదు, అది హెచ్చరించి ఎదురునిలచింది
వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకి నడిపించింది!

కలలను మరచి నిజాన్ని నిర్భయంగా కౌగలించుకోవాలి
సత్యబాటలో నడుస్తూ ధైర్యంతో కొత్తదిశలో పయనించాలి
చెడు అగ్నికి ఆహుతైతే సత్యం మౌనంవీడి చిందులేసింది
జ్ఞానాన్ని సత్యంతో చేతులు కలిపి నవ్వుతూ సాగమంది...

నాతో నీవు

ప్రేమంటూ నిన్ను మోసగించినా
నీ నమ్మకాన్ని వమ్ముచేసినా..
కలవరపడి కుమిలిపోకు నీవు!
నిన్ను గులాబీలతో పోల్చుకో..
తనని త్రుంచినవారిని వేరొకరితో
ప్రేమగా కలుపుతుంది తెలుసుకో!

మనసు నుండి తొలగించాలనుకుంటే
ముందుగా మనసులో ముద్రించుకో..
తప్పులనెంచి నిందించాలనుకుంటే
ముందుగా నీ తప్పుని నీవు సరిచేసుకో!
ప్రాణమెందుకు తీస్తావు నాచేయి విడచి
జీవితాన్ని చూపించు నీచేయి నాకందించి!