ఏమైందో ఏమో!


మాటలు పలుకలేని పసిదాన్నేమో
నా ప్రేమను  నీకు సరిగ్గాతెలుపలేదు

స్వరం వినలేని చెవిటిదాన్నేమో
నీ మౌనం నాకు అర్థంకాలేదు

జాణతనమెరుగని జవ్వనినేమో
నిన్ను కొంగున ముడివేసుకోలేదు

ఆటలాడ్డం అలవాటుతప్పెనేమో
నిన్నోడానంటే మనసొప్పడంలేదు

మతితప్పిన వెర్రిదాన్ని కాలేదేమో
నిన్ను మరువడమింకా చేతకాలేదు

అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
నన్నేకాదు నా మనసునీ చదువలేదు

ఇలా జీవించడమెందుకు?

ఆదర్శాలు ధృడమైనవైతే ఆశయాలు నెరవేరతాయంటూ
అనుకున్నది సాధించేవరకు కంటిపై కునుకురానీయకంటూ
అలసటనక ఆలోచించి అడుగేస్తే అంబరానైనా తాకొచ్చంటూ
అన్నిసూత్రాలు వివరించి, నెరవేరకపోతే విధిరాతంటారెందుకు?

ఆవేశం పొంగి ఆవేదన రగిలి ఆశయమార్గాన్ని వెతుక్కుంటూ
ఆకాంక్షతో ఆశగా సాగి అందుకో లేకపోతే మదనపడకంటూ
అంతలా అత్యాశ పడడం అవివేకమని ఆనకట్ట వేయమంటూ
అందని చందమామపై ఆశవలదంటూ వెనక్కి లాగేస్తారెందుకు?

ఆచరించడానికి కాదు ఆదర్శాలు వల్లించడానికే అనుకుంటూ
ఆశయమంటూలేక అధోగతిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ
అడుగులో అడుగేస్తూ శూన్యం వైపుకి నిర్జీవిగా కుంటుకుంటూ
అలా జీవఛ్ఛవంలా జీవించాలనుకుంటే ఇన్ని ఆలోచనలెందుకు? 

వెల ఎంతో?

ఏదో కొత్తర్ధమని పాత ప్రేమనే పదే పదే రాశాను
ఆగాగి సాగే శ్వాసతో గుండెలయని ఆలపించాను
చీకటిలో ముద్దాడి, వణికిన నా పెదవుల అలికిడికి
భీతిల్లిన అతడ్ని వర్ణించబోయాను ప్రేమని తెలియక!

ఎన్నో వాక్యాలను కూర్చిపేర్చి ప్రేమావేదన రాశాను
నా రెండునయనాలలోని సాగరఘోషను లిఖించాను
విరహ వేదనతో కలయికాఝంకారాల సడిని వెతికి
తల్లడిల్లిపోయా పదాల్లో నా ప్రేమనంతా ఇమడ్చలేక!

ఏదో కాగితంపై నాలుగందమైన అక్షరాలు రాశాను
పగిలిన గుండెను అతికించి ప్రియపదాలు కూర్చాను
మూల్యం చెల్లించబడింది కొన్ని నావై నచ్చిన భావాలకి
మరెన్నో మౌనాలుగామారి మిగిలాయి ఖరీదు కట్టలేక!

ఆమె ఎవరో?

అల్లంత దూరంలో చూసా...
ఇంకొకరి జతగా అడుగేస్తూ
అలా గలగలా మాట్లాడేస్తూ
సన్నని
కూనిరాగమేదో తీస్తూ
ఆనందంగా ఎగిరి గంతులేస్తూ
సర్వం తన గుప్పిట్లో ఉన్నట్లు!
దరిచేరి అంతరంగలోకి తొంగిచూసా...
చిత్రంగుంది మొత్తం చిత్రమే మారింది
అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది
మౌనంగా తనతో తానే ఊసులాడుతుంది
ఆరాటంతో అసంకల్పితంగా రెప్పవాల్చింది
కన్నీటి ఉనికిని దాచేయబోతూ రాల్చేసింది
దూరం నుండి గమనించలేదు......ఆమె ఎవరో?
నా నీడే అది......దూరపు కొండలా నున్నగుంది!

అంతరంగం

అందమైన కల్లబొల్లి కబుర్లు చెప్పడం
ప్రేమించి యుగళగీతాలు పాడుకోవడం
ఆకాశపంచులుదాటి మిద్దెలు వేయడం
లేననురాగాన్ని రంగుటద్దంలో చూపడం
నాకు చేతకాదు వీటిని అలాగ చేయడం!

నా అంతరంగం నేనే అల్లుకున్న పర్ణశాల
అంతఃపుర అంతర్ముఖంలేని ఆనందహేల
ఆవేశాందోళనలకి అర్థం తెలియని పసిబాల
ఆనందాల అల్లిక నా మనోరంగ నర్తనశాల
శోధనంటూ చేయకు దాన్నొక ప్రయోగశాల!

ప్రేమాక్షరాలునేర్పే నెపంతో అక్షరాభ్యాసమని
ఆర్ద్రమిళిత వాలుచూపు చూసది ఆకర్షణనని
మన్మధుడి వలపుబాణమేసి మదిని దోచానని
శూలమంటి చూపుతో నాగుండెకి గురిపెట్టానని
ఆంతర్యమెరుగక అంబరాన్నంటకు సంబరమని!

వెళ్ళొస్తాననలేదు!!!

వెళ్ళేటప్పుడు వీడ్కోలైనా చెప్పలేదు
వేరై ఉండగలనోలేదో నాకుతెలియదు
నిన్నునీకు దూరంచేసే ఆలోచనేలేదు
మనసువిరిగినా నీరూపు నాలో చెరగదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!

వెళుతూ వెనుతిరిగి నన్ను చూడలేదు
కళ్ళతో మనసుని చదివేవిద్య నీకురాదు
నా-నీ మనసులుమార్చే ధైర్యమైనా లేదు
ఏమైనా నీపై నా వలపువ్యసనం మానలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!

వెళ్ళిపోతూ నా చివరికోరికైనా అడగలేదు
అడిగితే నా ఎదనుదాటి నీ అడుగుపడదు
నీఆలోచనా వల నుండి నాకు విముక్తిలేదు
ప్రేమసంకెళ్ళని మౌనంతో విరచడం వీలవదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!

వెళ్ళేగమ్యం ఇదంటూ నీవు పలుక
నేలేదు
నా కన్నీరింకినకళ్ళు ఏ భావం తెలుపలేదు
చెవిటిదైన నీ మనసుకి నా ఘోష వినపడదు
మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!