అనుకుంటున్నా!

జ్ఞాపకపుస్తక పుటల్ని తిప్పుతూ అనుకున్నా
గడిచిన కాలాన్ని తిప్పగలిగితే ఎంతబాగుండ్నో
కలల ఆశలు అలగా వచ్చిపోతుంటే మేల్కున్నా
జీవితంలో నిజమై నెరవేరితే ఇంకెంత బాగుండ్నో
ఏదోకటి ఆశించి ఆదరించే వారిని చూసనుకున్నా
ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటే ఎంతబాగుండ్నో
మాటలతో మనసు విరిచి మజాచేసే వారితో అన్నా
విరిగిన మనసు అతగడం నేర్చుకో ఎంత మజాగుండ్నో
మనకోసం ఎదుటివారిని భాధించకూడదని నాతో నేనన్నా
చచ్చికూడా నలుగురి మనసులో బ్రతికుంటే ఎంతబాగుండ్నో

అనుకుంటే పరిష్కారమయ్యేవి కావని సహాయం కోరుతున్నా
ఎవరోకరు ఏదోకటి ఆచరిస్తే ఎంతబాగుండ్నో...అనుకుంటున్నా!

అర్థం కాని మనం

నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
మన జీవనవీణలోని తీగలు కలిపాను
ఇరుమనసుల మధ్య దూరం పెంచావు
ఎన్నో భావాలకి కవితా రూపమిచ్చాను
భావం మెచ్చి కవితలో నన్ను వెతికావు
ఎదలోనివ్యధ నీ కంటపడనీయక దాచాను
కనులతో వెతికి మనసుతో చూడ మరిచావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నేనే జీర్ణించుకోవాలని జీవించబోతాను
అర్థమైతే అలుసనుకుని అందకుంటావు
నీకు అనుగుణంగా అమరి అల్లుకుపోతాను
తామరాకుపై నీటిబొట్టులామారి జారిపోతావు
అలవాటుపడి సర్దుకుపోవాలి అనుకుంటాను
ఆలోచనలకే అందనంత అలజడిని సృష్టిస్తావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నిండైన నిబ్బరంతో నిన్ను చూస్తాను
ఆశలన్నీ అణచివేసి నిరాశ పరుస్తావు
చివరి ప్రయత్నమని మొదలుపెడతాను
మారని నీవు మళ్ళీ మొదటికి వచ్చేస్తావు
నా నీ తప్ప మనదంటూ లేని నువ్వు నేను
ముడిపడలేమని తెలిసికూడా ఒకటే అంటావు

మనసుందా!

ఇప్పటికీ నా వద్ద ప్రేమించే మనసుంది
ఇప్పుడు దాన్ని నమ్మించే శక్తి నీకుందా
నిన్నునీవు ప్రేమించుకోలేని నీమనసుంది
దాన్ని మభ్య పెట్టవలసిన అవసరముందా!

రాతినుండి సైతం రాగాన్ని రప్పించగలను
విని మురిసిపోయి కరిగే మనసు నీకుందా
తెమ్మెరఊసుల వింజామరతో సేదతీర్చెదను
ఒళ్ళంతా చెవులు చేసుకుని వినే ఓపికుందా!

ఇప్పటికీ నాదికాని నీమనసు నాదగ్గరుంది
అది నా సొంతం అని చెప్పే ధైర్యం నీకుందా
నీమనసునే నిర్దేశించలేని నీకూ మనసుంది
అది తెలిసికూడా ప్రేమించలేననడం బాగుందా!

రాత్రివేళ కలనై పగటివేళ వెలుగునై రాగలను
జీవితాంతం నాతోనే ఉంటాననే సత్తా నీకుందా
నీవు లేదని చెప్పే మౌనంలో నేనేం వెతకను
ఇవన్నీ తెలిసి మనసివ్వడంలో అర్థముందా!

మసకబారిన అద్దం!!


వద్దు నాకీ రంగులుమారే స్నేహం
అది కలిగిస్తున్న అభధ్రతా భావం!!
బంధాల నడుమ భావాలని మారుస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమొలకబోస్తూ
ఎందుకీ నటనంటే నేనే ప్రాణమంటూ
బాధ్యతలతో బంధీని అయ్యానంటూ!!

వద్దు నాకీ దాగుడుమూతల అనుబంధం
నలుగురిలో పలకరించాలంటేనే సంకోచం!!
బంధుత్వమా అనడిగితే నీళ్ళు నమిలేస్తూ
స్నేహం కాదంటూ బిత్తరచూపులు చూస్తూ
ఎందుకిలాగంటే నేనో అమాయకురాలినంటూ
ఏకాంతపు బిగికౌగిలిలో సర్వస్వం నేనంటూ!!

వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!!!

మూగబోయిన భావం


అనురాగపు సిరా తరిగి నా కలం మూగబోయింది
తడారినకుంచె బండబారిన మదిని ముద్రించనంది
ప్రేమపొందని అక్షరాలు ఒత్తుల్లేని అనావిష్కృతాలై
భావాలని ఎదలోనే బంధించి మూగగా రోధించింది!

అంతరంగపు మరువని తలపులు చదరంగమాడాయి
పరిమళించని జ్ఞాపకాలు విరియలేమంటూ వాడాయి
తోడులేని ఒంటరితనం ఒకవైపు పూడిపోయిన వేణువై
మది ఆర్తనాదాన్ని మౌనరాగాలుగా ఆలపిస్తున్నాయి!

అందలం ఎక్కిన ఆలోచనా సౌరభం కుప్పగాకూలింది
తనువు గాయమైతే మానేది, మనసుకి గాయమైంది
ప్రేమార్తితో ఎదురుచూస్తున్న గుండె అనురాగధారలంటి
ఓదార్పుని ఆశిస్తే ఆ పదమే దాని అర్ధం ఏమనడిగింది!

రెప్పలులేని కళ్ళు తెరచినా మూసినా కన్నీళ్ళేవస్తాయి
వ్యధ నిండిన మది ఏం రాసినా నిట్టూర్పులై రాలతాయి
రాయాలంటే భారమైన మది అనురాగపు కడలిలో కరిగి
భావంపొంగి కవితాక్షరాలకి ఊపిరులూది జీవంపోయాలి!

ఇంకేమడగను?

ప్రశ్న జవాబులు ఏమి అడిగాను
నన్ను తలచావన్న వెక్కిళ్ళు తప్ప

ప్రేమకావ్యం ఏం లిఖించమన్నాను
నీ ప్రేమాక్షర నా ప్రాణగుళికలు తప్ప

వెన్నెలరేయిలో నాతోడు నిన్నేం కోరను
పగటి ఆనందపు వెలుగుని చూడ్డం తప్ప!


కొద్దో గొప్పో నీ ప్రేమని పంచమంటున్నాను
నీవో లేక నీ కలలకౌగిలిలో నే కరగడం తప్ప

మనసుని నీకిచ్చి నాజీవితాన్ని ఏం అడగను
నా చావు నీకన్నా ఒక్క క్షణం ముందు తప్ప

ఇస్తానంటే మనవైన గడియలు కొన్ని కోరతాను
వేయిజన్మల ప్రేమామృతాన్ని ఈ జన్మలో తప్ప!

అతడే నా...


నాకేమో వానలో తడవడం
తనకేమో నన్నుచూసి మురవడం

నేనేమో కిలకిలా నవ్వడం
నానవ్వు చూసి అతడు పరవశించడం

నేను గలగలా మాట్లాడ్డం
నా మాటల్నివింటూ నన్ను చూడడం

నేను అల్లరితో ఆటపట్టించడం
నే చేసే అల్లరిలో తను ఆనందించడం

నేనేం చేసినా తనకి భలేఇష్టం
ఇంకేం చెప్పను!....అతడే నా సర్వస్వం

రంగులద్దుదాం రండి....

 లోకంలోని రంగులన్నీ రంగరించి ఒకటవనీ
రంగువెలసి కళచెదిరిన చిత్రాలని పూర్తికానీ
రక్తం అందరిదీ ఎరుపేనని చిత్రానికి బొట్టద్దనీ
మిగిలున్నవారికి మన అన్న భరోసానివ్వనీ
ఆకుపచ్చరంగద్ది బ్రతుకుపై ఆశను చిగురించనీ
స్వచ్ఛందంగా సేవలందించి క్రొత్తజీవితాలనివ్వనీ
అధికార అహంకారాలపై తెల్లని ముసుగువేయనీ
ప్రాంతాలువేరైనా అంతా మానవజాతేనని తెలుపనీ
నీలంలో ప్రేమపాలుపోసి గంగకోపానికి లేతరంగద్దనీ
ఆ రంగే ఆకాశంలో వంతెనై వారిని గమ్యానికిచేర్చనీ
ప్రళయభీకర చిత్రం చూసి కార్చిన కన్నీటిని కలవనీ
 సహాయపు ఐక్యతాకుంచెలతో చిత్రకారులుగా మారనీ

మనిషిలో ప్రాణమిచ్చే కళాకారుడున్నాడని తెలుపనీ
పూరించిన చిత్రాన్ని చూసి ప్రకృతే యోచిస్తూ జంకనీ
మానవత్వం ముందు వైపరీత్యాలు ఎంతని పారిపోనీ!

(ఉత్తరాఖండ్ విషాదంపై నా భావం)