కసి...

ఈ కళ్ళ సరదా కబుర్లన్నీ వినేవారే
ఈ కలలుకనే కళ్ళని ప్రేమించే వారే
కైపెక్కించే కళ్ళని కవితలు అల్లేవారే
కనపడని కన్నీటిని తుడిచేవారే లేరే!

ఈ పెదవి పలికే ముత్యాలు ఏరేవారే
ఈ పెదవి వంపు మెరుపు చూసేవారే
తడారనీయకంటూ పెదవి తాకబోతారే
పంటితో పెదవి అదిమిన భాధని కనరే!

ఈ నల్లనికురుల నిగారింపు గాంచెదరే
ఈ పట్టుగిరజాలకై గింగిర్లు తిరుగుతారే
సవరించబోతూ సన్నగాగిల్లి సైగచేస్తారే
కారుమబ్బు కురుల కసిని కోరికంటారే!

ఏదో అనుకుంటే...

మాటకి మాట తోడనుకుని
మౌనంవీడి పలకరించబోయి
మనసుని మరీ గాయపరిచా...

కళ్ళలో కళ్ళుపెట్టి చూసుకుని
ఎద ఊసులు ఏవో చదవబోయి
తడబాటులో అక్షరార్థం మరిచా...

తనువుల ఎడబాటు మిధ్యనుకుని
ప్రేమ మేఘసందేశాలు పంపబోయి
ఉలికిపాటు ఉరుమువానలో తడిచా...

వేదనా రుసుము కోరి తీసుకుని
ఆనందాన్ని అత్యాశతో అమ్మబోయి
నష్టమని కన్నీరు వరదయ్యేలా ఏడిచా...

ఇదిచాలదని తలచినదే తలుచుకుని
భావలఝరిలో ఎదభాధ తీర్చుకోబోయి
నవ్వులపాలై జీవన రూపురేఖలే మార్చా!!

ఒకే ఒక్కసారి....


ఒకోసారి నీవు నాలో ఐక్యమైనట్లనిపిస్తావు
అంతలోనే....అల్లంత దూరాన అగుపిస్తావు
ఎందుకిలా? అని నన్ను నే ప్రశ్నించుకుంటే
నీడనని.....వెలుగులోనే అగుపిస్తానంటావు!

మరోసారి నీవు మారువేషంలో మరిపిస్తావు
క్షణాల్లో....కంటికెదురుగా కనుమరుగౌతావు
ఏమైందని? మేలుకుని తరచి చూసుకుంటే
కలనని.....కనులు తెరిస్తే మాయమంటావు!

ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు
అందులో....అగుపడని అనురాగమందించేవు
ఏమిటిదని? విసురుగా కసిరి పొమ్మని అంటే
మనసని.....మాటవినదు వేదనపడమంటావు!

ఒక్కసారి నా అనుమతి అడగకనే కౌగిలిస్తావు
నాలో....నా అనుకున్న బంధాలన్నీ తెంచేస్తావు
ఎవరని? నే అడిగేలోపే పాశమేసి జవాబిస్తావు
ప్రాణమని.....ఉన్నంతవరకే ప్రాకులాటలంటావు!

సొగసు చూడతరమా!

నా గుండెలయలో నీ జాడ తెలుసుకోనా
మనసు చూపిన దారిలో నీదరికి చేరనా

నా కనుల నీడలో నీ రూపు చూసుకోనా
కలలు కనే కాలాన్ని కాసేపు ఆగమననా

నా అధరాలతో నీ నామమంత్రం జపించనా
తలపులతో నీ తనువునంతా తడిమేయనా

నా కర్ణాల కలువరేకులనే విప్పార్చి విననా
ప్రియతమా అన్న పిలుపుతో పరవశించనా

నా నాసిక పీల్చే శ్వాసలో నిను బంధించనా
ప్రేమ పరిమళ పుప్పొడితో నే అభిషేకించనా

నా మెడ వంపులో నీ మోమునే దాచుకోనా
అనురాగ అత్తర్లతో అనువణువు ఆక్రమించనా

నా కురుల వింజామరతో వీచి అలసట తీర్చనా
సేదతీరువేళ ప్రేమ ఊసులే చెప్పి గారాలుబోనా

నా మునివేళ్ళతో నీ ఎదపై నా చిత్రాన్ని గీయనా
సరససరాగాలెన్నో నీలో సుకుమారంగా మీటనా

పిడికెడు హృదయం

నా పిడికెడంత మనసుకు ఎందుకిన్ని ఊహలో!!
ఆశల ఊగిసలాటలో ఎందుకు ఈ తర్జన బర్జనలో
సమస్యల సుడిగుండాలు వద్దంటూ వెన్నెల్ని కోరి
వేడిసెగ నిట్టూర్పులతో అణగారిన ఆవేశం చెంతజేరి
వేదనపడినా వెర్రిమోములో కనబడని మదిచారలో
తోడున్నామని రాలిపోతున్న మరిన్ని కన్నీటిధారలో..

నా గుప్పెడంత గుండెకు ఎందుకిన్ని భావావేశాలో!!
అనురాగానికై ఎందుకు ఈ అనుబంధ ఆటుపోటులో
నేనున్నా అని నిండుగా నమ్మించేవారి నీడకై వేసారి
విశ్వాసమే వమ్మైనప్పుడు అగాధపు అంచుల్లోకి జారి
అందించిన ప్రతి హస్తం తాకి ఆప్యాయత అన్వేషణలో
ఎదురైన ఎదకి చేరువై ఎందుకిలా రాటుదేలిపోవడాలో..

నా చిన్ని హృదయానికి వద్దన్నా ఎందుకిన్ని గాయాలో!!
ఆవేశం అణుచుకోలేక భగభగ మంటున్న మదికుంపటిలో
భాషకి అందని భావాలకౌగిలిలో మాటరాని మౌనంగా మారి
ముందడుగు వేయబోతే బ్రతుకులో కనబడకున్నది ఏ దారి
అందుకే కోర్కెలకు సంకెళ్ళువేసి బంధించా హృదిచెరసాలలో
ఒంటరినై ఎదురీది సాగిపోక తప్పదు జీవన ప్రయాణంలో...