ఆటాడుకుందాం రా!

 చిన్ననాట చెడుగుడు ఆడలేదని...
చెయ్యేసి చేసినబాసలు మరువకురా!

కలిసి కప్ప గంతులు వేయలేదని...
కళ్ళగంతలు కట్టి కనికట్టు చేయకురా!

దాగుడుమూతల దోబూచు ఆటలని...
దొంగవై కాక దొరలా నన్ను దోచుకోరా!

చెమ్మాచెక్కాటలో చిలిపితనమేలేదని...
చేరువైనట్లే అయిపోయి దూరమైపోకురా!

అష్టాచెమ్మా ఆటలో ఆంతర్యముందని...
అసుర సంధ్యవేళ ఉసురు తగులనీకురా!

వైకుంటపాళి విధిచేతి విచిత్ర వైఖరని...
విడదీయలేని బంధాన్ని విడిపోనీయకురా!

ఇరు హృదయాల ఊసులాట ఆటేకాదని...
మరమనిషిగా మారి మనసుతో ఆడుకోకురా!

కలలో...

కలలమాటున దాగిన ఆంతరంగికుడా
నీపై నాకెందుకు ఇంత తగనిమక్కువ!
ఎగసిపడే హృదయస్పందనల నడుమ
నలుగుతున్నాననేగా నేనంటే లోకువ!
కలలో కనబడితేనే నాకింత పులకరింత
కనులు తెరచితినా తెలియని కలవరింత
ఒకటవని మనకోరికలకి కళ్ళెం వేయలేక
కలలుకంటున్నా వెన్నెలోవేకువో తెలియక

తెలుపని భావాలకు జాబీయని ప్రియుడా
ప్రేమలో స్వార్థం పెరిగి మూగగా ప్రశ్నించి!
నీతో ఊసులాడే నా ఎదను ఎత్తుకెళ్ళాలని
ఓడేప్రయత్నాలెన్నో చేసి నన్ను నే మరిచి!
చివరికి కలలోవిన్నా నీ అడుగుల సవ్వడి
నాలోనే నాకు తెలియని ఏదో వింత అలజడి
ఏకాంత పయనంలో కలలతో వాదించిగెలవక
జీవితాన్నేమార్చా వాస్తవమో ఊహో తేల్చలేక

చిలిపికోరిక

నాదో సరళమైన చిలిపికోరిక......
కాష్మోరాని కవ్వించి కన్నుకొట్టాలని
ప్రేతాత్మని రమ్మనిపిలిచి ప్రేమించాలని
ఊడలమర్రి చెట్టెక్కి ఊయలలూగాలని
నక్కల అరుపులు సన్నాయిగా వినాలని
ఈదురుగాలికి బూడిదెగసి వెన్నుతట్టాలని
శాఖినీఢాఖినీలతో సరదాగా సరసమాడాలని
శవాలు కేరింతలు కొడుతూ కలసి నర్తించాలని
ఆత్మలన్నీ ఆశీర్వధించి అక్షింతలు వేయాలని
స్మశానంలో శోభనం అవ్వాలని....ఎందుకంటే?

వాటికి ఆహ్వానించడమే కానీ అసూయలేదని
ఆదరించి అడక్కపోయినా ఆశ్రయమిస్తాయని
అభిమానమంటే వాటిదృష్టిలో అర్థంవేరేఉందని
రాగధ్వేష, కుళ్ళుకుతంత్రాలు తెలియవేమోనని
మనిషిని చూసి మనిషి ఈష్య పడతారే కానీ...
శారీరక వాంఛలేని సద్గుణ స్వరూపాలందుకని

సరళమైన చిలిపి కోరికది తెలుసా ఎందుకని?
మనుషులుకావు మన అంతిమ ఆకారాలవ్వని

నా అస్త్రాక్షరాలు

క, చ, ట, త. ప లు కౌగిలించిన అక్షరాలను

డు, ము, వు, లు విభక్తులు ఏవనడిగాయి...

వియ్యమొందాలనుకున్న ద్విత్వ అక్షరాలను

గుణింతములు గుణగణితము ఎక్కడన్నాయి...

సంధికార్యమిది అనుకున్న సంయుక్తాక్షరాలను

సమాసాలు సమాధానంగా ఛంధస్సుని కోరాయి...

సంస్కృతంటూ సిగ్గుపడుతున్న సంశ్లేషాక్షరాలను

ప్రకృతి-వికృతులు పకపకనవ్వుతూ ప్రశ్నించాయి...

భాషాభాగాలని బరిలోదింపిన మహాప్రాణాక్షరాలను

వత్తులే కాదు లింగములు లేవంటూ విడదీసాయి...

అలంకారాలు అందంగా అద్దలేదని నా అస్త్రాక్షరాలను

భావవ్యాకరణమేకాదు తెలుగుభాషలేని కవితన్నాయి!

నీవు తప్ప...

ఏ రాగం నా తాపం తీర్చ తగదు నీ ఊపిరి తప్ప

ఏ కాంతిపుంజం నను సోకలేదు నీ చూపు తప్ప

ఏ ధ్వనీ వినపడదు నువ్వు లేవన్న ధ్యాస తప్ప

ఏ రేయి కునుకురాదు కనురెప్పల భారమే తప్ప

ఏ ఎదకూ దాసోహం అనదు నా ప్రేమ నీకు తప్ప

ఏ చిరుగాలి రమ్మంటూ సేదతీర్చదు నీ ఒడి తప్ప

ఏ తలపు నన్ను తాకలేదు నీ రూపు నాలో తప్ప

ఎవ్వరినీ దరిచేరనివ్వదు నా తనువు నిన్ను తప్ప

ఏ భాష్యం నేను నేర్చుకోలేదు ప్రేమనే భావం తప్ప!

ఏ అందం ఆకర్షించదు తామరను తుమ్మెద తప్ప...

ఏ కొలను కలువను విప్పార్చలేదు వెన్నెల తప్ప...