సరికాని సబ్జెక్ట్

కంపాటిబిలిటీ కుదరలేదు కలిసి ఉండడానికని
కల్లబొల్లి కబుర్లతో కస్సుబుస్సుల్ని కవర్ చేసి
ఫిజిక్స్ పరికరాలతో ఫిగర్ చూసి పడిపోబోయి
మన కెమిస్ట్రీ కలవలేదని కాదుపొమ్మంటావు..

డిసెక్షనేదో చేసి నీకై కొట్టుకునే గుండెనే చూసి
వశమౌతావన్న వర్రీతో జువాలజీ జోలికెళ్ళకనే
సోషల్ నెస్ అని సొసైటీలో స్మైల్ ఫోజులిచ్చేసి
నిన్ను కోరిన నన్ను కాలమానంతో కొలుస్తావు..

జతకాలేని ఇరు జీవితాలని జాగ్రఫీతో జతచేసి
లెక్కలేయబోతే అన్నీ ఆంక్షలల్లిన ఆల్జీబ్రాలాయె
హైరానాపడి హిస్టరీ చూస్తే తెలీని మిస్టరీలున్నా
రాలిన ప్రేమకు రాజకీయ రంగులద్దుతానంటావు..

ఆఖరి ప్రయత్నంగా అనాటమీనే నమ్ముకుని
రియాక్ట్ కాలేనన్న భావాలని రియల్ గ్రాఫ్ గీసి
జెనిటిక్స్ చెప్పలేనన్న జ్యోతిష్యమేదో చెప్పబోతే
మొదటికొచ్చి మరల ఓనమాలు దిద్దుతుంటావు..

కాలమిచ్చే తీర్పు

మాటల్లో చెప్పగలిగేది భావమేకానీ భాధకాదని

జ్ఞాపకాల కొలిమిలో కాలితే కలిగే భాధ ఏమిటో

కానుకగా ఇచ్చిన కడలంటి కన్నీటి బరువెంతో

విరిగిన మనసులు అతికే జిగురువంటి గుజ్జేదో

విడిపోని బంధాలు దాచిన లంకెబిందెల జాడేదో

రాతిగుండె రాపిడి రాసులని కరిగించే రాగమేదో


చెప్పేభాష అర్థంచేసుకునే మది చిరునామాడిగితే

పరిపక్వత చెందిన వెర్రిదాన్ని నేనని మారమంటే

జాలిగాచూసి అనుభవిస్తే తెలిసేనని నవ్వుకున్నా

కాలమిచ్చే తీర్పుకొలిమిలో కాలడానికి సిధ్ధంగున్నా

మనజన్మ


కుజుడికి ఏమెరుక మేకవన్నె పులుల మర్మమేంటో
మనిషి మనసులోని భావసంఘర్షణల అలజడెంతో!

శుక్రుడు ఎరుగడు మనిషి మనుగడల మోక్షమేంటో
ఎక్కే తెల్లగుర్రానికి తెలీదు మానవకోర్కెల రెక్కలెన్నో!

బుధుడి బుధ్ధికి చిక్కని మనుషుల చాకచక్యమేంటో
కోటి ఉపాయాల ముందు సింహం జులిపేటి జూలెంతో!

సూర్యుడి కిరణాల ధాటికెక్కదు మనమేధాశక్తి ఏంటో
ఏడుగుర్రాల రధమెంచలేదు మాటల గారడి వాడెంతో!

చంద్రుడే తెల్లబోయే మాయకందని మానవయుక్తేంటో
లేడి ఎరుగదు వేగంగా మార్చేసే బాసల సంఖ్యలెన్నో!

గురుడుఎంచలేడు గోప్యమైన మనసులోని మాటేంటో
ఏనుగు కానలేదు మనిషి ఆలోచనల మూలాస్త్రమేదో!

రాహువెరుగడు రంగుమారిన రూపు రహస్యమేంటో
పులిపంజాకు చిక్కని మనిషిలోని నైతిక విలువెంతో!

కేతువు కేకకి అందని ఈ కుళ్ళుకుతంత్రాల కేళేంటో
సర్పమే చిన్నబోయె తెలియక రాగధ్వేషాల నిలవెంతో!

శనికి కూడా అంతుపట్టలేదు మనిషి సారాంశమేంటో
కాకి నల్లముసుగులో వెతకసాగే మనలో నిర్మలమేదో!

నవగ్రహాలనే నివ్వెరపరచే మానవజన్మ కారణమేంటో
తెలుసుకునే లోపే తనువు చాలిస్తున్న బ్రతుకులెన్నో!

(నవగ్రహాలు వాటి జంతుగణం పై ఈ చిన్ని ప్రయత్నాన్ని మెచ్చుతారన్న ఆశతో మీ ముందు "మనజన్మ".....పద్మార్పిత)

కనువిప్పు

పొందికైన పదాలతో పద్యం అల్లినట్లేనుకుని
ప్రేమానురాగాలు పొందాలన్న అభిలాషతో
గుంబనంగా దాగిన గుజ్జనగూళ్ళను పీకివేసి
చిగురుటాగుల మధ్య దాగిన భావాలు విప్పితే
తెలిసింది...స్వార్ధానికి అందరూ బానిసలేనని
మనుషులు మమతలన్నీ మాయామిధ్యలని

కమ్మనికబుర్ల ప్రణయకావ్య కుటీరమనుకుని
కుదించుకున్న కలలని విడమరిచే ప్రయాసలో
కాయగాచిన కళ్ళలోని కోరికలని కుప్పగాపోసి
కడదేరబోతున్న కాంక్షల కోసం కాచుకునుంటే
కనువిప్పైంది...కాసులకి అందరూ దాసులేనని
కన్నీట కర్పూరమై కరిగిపోయేవే కలలసౌధాలని

శ్రావ్యమైన రాగబంధమేదో ఆలాపించాలనుకుని
విలువైన హృదయ ధ్వనితరంగ వాయిద్యాలతో
సప్తస్వరఝరోప్రేరిత భావోధ్వేగాలని అణచివేసి  
మౌనరాగమేదో గొంతు సవరించి గానమాలాపిస్తే
వినపడింది...బంధాలు అక్కరకురాని సంబరాలని
వారి అవసరాలకి వారంతా ఆత్మబంధువులేనని!!

చచ్చి బ్రతకాలని!

పెదవిపై నవ్వుతో పైపై మాటలు చెప్పి
మభ్యపెట్టి మాయచేసే మర్మమెరుగని
అవతారమెందుకని...చచ్చి బ్రతకాలని!

ఊహలతో ఊరటచెందక మనసు చిట్లి
వాస్తవాల అడుగులతో అడుగేయలేని
పిరికిప్రాణమెందుకు...చచ్చి బ్రతకాలని!

అవసరాలకి అనుకూల అవతారం ఎత్తి
ఆనందమంటూ అంతరాత్మనే చంపలేని
అల్పాయుషు ఏలని... చచ్చి బ్రతకాలని!

గొప్పలంటూ మోసపు గోతులెన్నో తవ్వి
ఉరితీసిన మనసుని ఊరబెట్టి ఉంచలేని
ఉత్తుత్తి ఊపిరెందుకు... చచ్చి బ్రతకాలని!

వక్రమార్గానికి విలువలేని వన్నెలు అద్ది
మోసపు మెరుపుచూసి మలినపడలేని
మనిషిజన్మ వలదని...చచ్చి బ్రతకాలని!

కాలుజారింది

ఏం చెప్పను ఎలాగ చెప్పను....
ఎక్కడని చెప్పను ఏమని చెప్పను!?

లోననరాల్లో జివ్వో జివ్వుమంటుంటే
ఒళ్ళంతా ఒకటే సలపరం పెడుతుంటే
తాకగానే మంటపుట్టి బాధపెడుతుంటే
ఎలాగో చెప్తాను ఎందుకంటే ఏంచెప్పను!
ఎప్పుడు తగ్గుతుందంటే ఏమని చెప్పను?
కాలుజారిపడితే తలబొప్పికట్టిందని చెప్పనా
మోకాలు బెణికి నడవలేకున్నానని చెప్పనా
వేళ్ళు కొట్టుకుపోయి వయ్యారాలు పోతుంటే
ఎర్రగాకందిన చర్మం నిగారింపుతో మెరుస్తుంటే
వాపుతో పసిడిమేనిఛాయ మరింత నిగారిస్తుంటే
గాయాలకి మందేసి నన్నునే ఏం ఓదార్చుకోను!

నొప్పినైతే భరించగలను త్వరగా తగ్గిపొమ్మనలేను.
తగిలించుకోవడం నారాత, తగ్గడం మాత్రం విధిరాత