వలస బంధం

కొన్ని పరిచయాలు తామరాకుపై నీటిబొట్లు
దోసిలితో నీళ్ళిచ్చి దాహమైతే తీర్చవు కానీ
సెలయేటి సోయగం కనికట్టుగా చూపుతూ
సూక్ష్మంలో మోక్షమంటూ సర్వం కోరతాయి

కొన్ని అనుబంధాలు పనికిరాని పనిముట్లు
అగుపడకనే అంతటా తడిమి ఆప్యాయతని
అందమంటూ అంబరాన్ని నేలపై చూపుతూ
అధఃపాతాళానికి అందని నిచ్చెనలు వేస్తాయి

కొన్ని ప్రక్రియలు పాకుడంటిన జారుడుమెట్లు
చేయూతమంటూ చేతినైతే అందిస్తాయి కానీ
మూరెడు మొగలి పూలమాలతో మురిపిస్తూ
మల్లెల మండువానే బదులు అడుగుతాయి

కొన్ని ప్రణయాలు కనిపించని గాయపుగాట్లు
అందితే తలని అందకపోతే కాళ్ళని పట్టుకుని
వలస పిట్టలవలె విచిత్రంగా మాయమైపోతూ
పట్టుకుంటే జారి పట్టుకోకపోతే ఎగిరిపోతాయి

"సప్త ప్రేమికులు"

పద్మార్పితా.....పిచ్చి పలువిధాలు అంటే కాదు కాదు ప్రేమికులు పలురకాలు అని చెప్పే ప్రయత్నమే ఈ "సప్త ప్రేమికులు" ఆస్వాధిస్తారు కదూ :-)

"పిసినారి ప్రేమికుడు"
చిల్లర పైసల కోసం చిందులు వేసే నేను
కోట్లరూపాయల విలువైనమాట చెప్పేసాను
ఐ లవ్ యు అని మొబైల్ లో వినిపించాను!


"నిర్మల ప్రేమికుడు"
నీ మోముపై మొటిమల మచ్చలున్నా
ఎలా ఉన్నా నీ ముఖము చంద్రబింబమేనని
తారలుకూడా తోడున్నాయని సంబరపడతాను!

"నిశ్చల ప్రేమికుడు"
ప్రేమిస్తే నిద్రహారాలు ఉండవని అంటారు
వీలుంటే నన్నూ ఒకసారి ప్రేమించేద్దురూ
ఈ మధ్య తిని తొంగోవడం ఎక్కువై లావెక్కాను!

"ధనమున్న ప్రేమికుడు"

షాజహాను కంటే గొప్పవాడిని నేను
సిరిసంపదలంటే లెక్కచేయక ప్రేమించేసి
నీ పేరున బ్రతికుండగానే తాజ్ మహల్ కట్టిస్తాను!

"అతిజాగ్రత్త ప్రేమికుడు"
మనసుతోపాటుగా మరెన్నో దోచుకున్నావు
ఇది తెలుసుకుని గదినంతా పరిశీలిస్తుంటాను
నువ్వొచ్చే ముందు వచ్చి వెళ్ళిన తరువాతను!


"అమాయకపు ప్రేమికుడు"
నిన్ను చూస్తున్నా చూస్తున్నా చూస్తూనేవున్నా
నువ్వు వచ్చేటప్పుడు నేనటు వెళ్ళేటప్పుడు చూసి
చత్వారంవచ్చి రెండుకళ్ళు నాలుగనుకుంటున్నాను!

"నిత్య ప్రేమికుడు"
గాలిలో ప్రేమలేఖరాసి అందరికీ మెయిల్ పంపి
రిప్లై ఇచ్చిన వారిని నిజమైన ప్రేమంటూ ప్రేమించి
తనకోరికలని తలా ఒక్కరిలో ఒక్కొక్కటి తీర్చుకునేను!

జీతమడిగిన జీవితం

జీవించే ఉద్యోగమే చేసి అలసిన జీవితం
ఖాతాలో లెక్కలేవోచూసి జీతమడిగింది!
నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే
ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది!
డబ్బు జల్సాకాదు అవసరాలు తీర్చునని
శ్రమతో సంపాధించి ఖర్చుపెడితే తెలిసింది!

ఇష్టమేలేని కష్టమైన నవ్వేదో నవ్వమని
నవ్వు వెనుక ఏడ్పునే నిద్రపుచ్చమంది!
జీవమనుకున్న పరిచయాలే విడిపోయి
స్వార్థమేమో పెచ్చులూడి కనువిప్పైంది!
అందరూ మేకవన్నెలద్దుకున్న పులులని
ఈ జీవిత రంగస్థలం పై నటిస్తేనే తెలిసింది!

అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని
మనిషి మనిషిని చూసి మండుతాడంది!
రాతినికొలుస్తూ పూలుకోసి హత్యచేసానని
గుడిలో రాతివిగ్రహానికున్న పూలమాలంది!
పుణ్యానికి పెట్టుబడిగా పాపాన్ని లంచమిచ్చి
క్షమని కోరుతూ మరో తప్పుని బలి ఇచ్చింది!

ఎద అలజడి

ఎరుగని ఎదకు ఎదను తాకిస్తే తెలిసింది
మనసిచ్చి దోచుకోవడం నాకు రాలేదని!

దరిచేరిన హృదయం దూరమై తెలిపింది
తెలిసీ తెలియని చెలిమేదో బాగుండెనని!

ఎడబాటు ఎరుగని ఎద వెక్కెక్కి ఏడ్చింది
ఎదను ఇవ్వడం నేరమై మిగిలిపోయెనని!

శ్వాసాగితే చిన్నివిషయమని నవ్వేసింది
నీ తలపులో లేని తనువు జీవఛ్ఛవమని!

వేదనేమో నిన్ను నమ్మనంటూ నటిస్తుంది
నవ్వుతున్న కనులేల చెమ్మగిల్లినాయని!

చేసుకున్న బాసలని చివర్నో కోరిక కోరింది
ఊపిరి ఆగిపోతే నీ కౌగిలిలో కడతేర్చమని!

అందరి మెప్పు

రాసిన భావాలనే చదివి రెచ్చిపోయి
గీసినగీత వంపుల్లో మెలికలుతిరిగేసి
రసికతని రాసి రెచ్చగొడుతున్నానని
నీరుగార్చి నిందలేస్తే నేనేం చెప్పలేను

లేని ఆదర్శాలు వల్లిస్తూ రచించమని
ఉద్వేగాన్ని సంస్కరణలకి బంధీనిచేసి
మొక్కుబడి అక్షరాలని ముడేయమని
ముక్కి మూల్గేవారిని నే చదవమనను

అనాగరిక అభిమానమే హద్దులుదాటితే
నిర్మలమైన భావోధ్వేగాలకి సంకెళ్ళువేసి
పదాలపై ముసుగు కప్పి పరవశించమని
రంజింపచేసే రాతలంటూ నేనేవీ రాయను

లిపిలేని అభ్యుదయాలకి ఉరితాడు బిగించి
సహజ నైజానికి నగీషీలద్దిన చెక్కతొడుగేసి
నిఘంటువు కొలనులో నిలబడగలనే కాని
పద్మగా అందరూమెచ్చే రచనలర్పించలేను

మారిపో.....

పోరా పో!.....పోయి నాకు గుర్తుకు రాకుపో
పొమ్మంటే రమ్మని వ్యతిరేక అర్థమే వెతుక్కో
నే వద్దన్నా విసిగిపొమ్మన్నా నా చెంగట్టుకో
కసిరితిట్టినా నీపై నాకున్న అధికారమనుకో!

రా రమ్మని!.....మనసు కలవరించె వచ్చిపో
నీ తలపు జ్వరంలో ఒళ్ళు ఒణికె వాటేసుకో
వలపు మందేసి నా మదిలో మంచమేసుకో
బిడియమేది కాదన్నా బింకమొదిలి పట్టుకో!

లేపుకు పో!.....గారం చేస్తే నీవెంట లేపుకుపో
అలిగితే అలుసనుకోక అపూర్వంగా చూసుకో
మారాంచేస్తే మర్మమెరుగని మహారాణిననుకో
పరువమున్న పసిపిల్లతత్వమని సరిపుచ్చుకో!

పోరా పో......నా ఊపిరాగితే ఉండలేవు వెళ్ళిపో
తనువు వీడి తలపుల్లో ఉన్నాను తడిమేసుకో
ఊపిరున్నప్పుడు చెప్పిన ఊసులు నెమరేసుకో
జ్ఞాపకాల బూజులనే దులిపేసి కొత్తరంగులద్దుకో!