ఈ
తోడేళ్ళ లోకంలో తోడెవ్వరని తొంగి చూస్తే
ఇంతందమైన
లోకం వేరేదీలేదు అనిపించింది
అందుకే వాటితోటిదే
సావాసమని చేయికలిపి
గర్జించే
పులికన్నా చొంగకార్చే తోడేలే మిన్నని
కోరికేదో
కోరమని దాని కుటీరాన్నే ఆశ్రయించా..
తొలుత
తోడు-నీడ అవుతానని తోకూపిన తోడేలు
తొందరపాటేనని
తెలివిగా తనని తానే తిట్టుకుంది
అందినంత
జుర్రుకుని గుట్టు చప్పుడేలని జారుకుని
వాసనమరిగి
మరునాడు మరల మభ్యపెట్ట చూసె
అనుభూతులే
అనుభవమైతే వద్దని మొరాయించా..
మరోమారు
మరువలేనంటూ కొత్త అస్త్రం చేతబూని
జిత్తులగారాలే
వలపుబాటని వల్లిస్తే మనసే నవ్వింది
తొణకని
నిబ్బరం చూసి వణికిన తోడేలు తోకముడిచి
సంధి
బాసలే చేసి జామురేతిరి సరసమంటూ దరిచేరె
సర్దుబాటే
సరైనది అనుకుని ఆశలచాపనే పక్కపరిచా.
చివరికి
మంత్రమేసి తోడేలుని మనిషిగా మార్చబోవ
మాయపొరలు
కరిగించి జీవితసత్యమేదో భోధించింది
మార్చడమేల
మర్మం తెలుసుకుని మనం మారాలని
మృగమైనాసరే ఎవరి అవసరం వారినే సమర్ధించునని
స్వార్థంలేనిప్రాణిని బ్రతికిఉండగా చూడలేనని గ్రహించా..