ఏదో చేయమాకు

నా మదిలోని భావాలను లూటీ చేసేసి
మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు
నాపై నీ భావాలని మనసులోనే దాచేసి
మాయమాటలతో మదిని మభ్యపెట్టకు!

నా గుండెసడికి నీ గుండెలయ శృతిచేసి
ఆశలే రేపి ప్రణయమని రాగాలు తీయకు
మనసిచ్చానన్న మిడిసిపాటుతో చిందేసి
తనువునే కోరి తైతక్కలాడి అలుసైపోకు!

నా మనసుని నీ అనురాగంతో పెనవేసి
ఒక పోగు నీవు మరొకటి నేనని వేరవకు
ప్రేమతో ఆడిన దాగుడుమూతల్లో అలసి
సొమ్మసిల్లినాక తనువులు వేరని అనకు!

నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
నా మనసు నిన్ను నమ్మినవేళ కాపుకాసి
ప్రేమపై నాకున్న ప్రేమను వమ్ముకానీయకు!

ఏం అడిగేవు!


 ఎగిరిన భ్రమరాన్ని ఏం అడిగేవు
రాలిన పువ్వులోని పుప్పొడేదని!

నుదుటి ముడతల్ని ఏం అడిగేవు
బ్రతుకుబాటలో వంకర్లు ఎందుకని!

వెలుగుతున్న వత్తిని ఏం అడిగేవు
ప్రమిదలోని చమురు ఎంతుందని!

పీలుస్తున్న ఊపిరిని ఏం అడిగేవు
ఎన్నాళ్ళు ఎడతెరపిలేని ప్రక్రియని!

పాతిపెట్టిన శవాన్ని ఏం అడిగేవు
సమాధిలో నిశ్చింత నచ్చిందా అని!




సరసమెరుగని సంసారి

పొద్దుటేల లేచి సద్దికూడు నేను తిని
మినప ఆవిరి కుడుములు ఎందుకని
నా మనసంటి ఇడ్లీలు వేసి వెన్నరాసిస్తే
మాడిన అలసంద అట్టులా ముఖం పెట్టి
పెసరట్టంటే ప్రాణమని ప్రేమగా అడిగావు!
పోనిమ్మని సందేల పెసలు నానబోస్తుంటే
జారిన పైటమాటు దాగిన అందాలు చూసి
సజ్జ కూడు చాలు సరసానికి రమ్మన్నావు!
సిగ్గుపడి సగ్గుబియ్యం జావతో కవ్వించబోతే
జున్నుపాలేవని జావకారి జాలిగా చూసావు!

మరుసటేల మురుమరాల ఉగ్గానీ నే తిని
ఉప్మా చేతికందిస్తే ఉరుమురిమి చూస్తావని
ఉల్లిదోశనే దోరగా కాల్చి ఊరగాయతో అందిస్తే
ఉలిక్కిపడి ఊరడించమాకని మీసం మెలిపెట్టి
రాగిసంకటి ముద్ద ఏదని ముద్దుగా అడిగావు!
రాకపోయినా రాగమే రంగరించి వండబోతుంటే
వేడి పుట్టిస్తున్న వాడిచూపులకి ఒళ్ళు విరిచేసి
మజ్జిగ తాగి మరిగే నీళ్ళ స్నానమాడాలన్నావు!
పొంగే పరువమాపి పొంగడాలో బజ్జీలో వేయబోతే
గారెలేవి గృహలక్ష్మీ అంటూ గారాలు బోతున్నావు!

వింత వ్యసనం

ఎప్పుడు తలపుల్లో తడిమేస్తావు
ఇదే మాయరోగమో ఏమో నీకు
నీకంటూ నివాసమే ఏదీ లేదా!?
నా మదిలోనే నిదురిస్తుంటావు..



నిటారుగా నిలబడ లేక తిరిగేవు
కాళ్ళకి చక్రాలు ఉన్నాయా నీకు
నిబ్బరంలేని నికార్సైన వాడివా!?
నా చుట్టూనే పరిభ్రమిస్తున్నావు..



నిషాలో ఉన్న త్రాగుబోతువి నీవు
కల్తీలేని నాప్రేమ కిక్ ఎక్కింది నీకు
ఈ వ్యసనం నుండి బయటకురా!?
నాశ్వాసలో చేరి మత్తెక్కిస్తున్నావు.

ఓ నా ఆత్మా!

ఆత్మా! ఓ నా ఆరో ప్రాణమా
ఆలోచిస్తూ అడుగులో అడుగేయకు
ఆవహానమని అరిచి అక్కున చేర్చుకో...
ఆలోచనలు కుళ్ళిపోకుండా ఆనందించనీ
ఆవేశమే అణగారి నీలో నన్ను ఏకమైపోనీ
ఆపేక్షలనే పాడు ఆత్మల్ని అసహ్యించుకోనివ్వు
ఆడంబరాల బానిసత్వం నుండి విముక్తి పొందనివ్వు!

ఆత్మా! ఓ నా అంతర్మధనమా
ఆలాపించి అలసినానని ఆగమనకు
ఆదరించి నీవు నా ఊపిరినే పీల్చేసుకో...
ఆశ్రయించిన నన్ను ఆత్మలకే అధినేతనవనీ
ఆడిపాడి నీ లోకంలో అంచెలంచెలుగా ఎదిగిపోనీ
ఆశల ఆకలితో చచ్చిన నాకు అమరత్వాన్నివ్వు
ఆగిపోయిన జీవగుండెకాయ కొట్టుకోకనే బ్రతకనివ్వు!