ఓ కోరిక!

చంచలనయని అతి చిన్నికోరిక..
బాసచేయకనే బదులు ఇవ్వమని
నన్ను విడిచి నీవు వెళ్ళిపోరాదని!

చాన్నాళ్ళుగా నాదో బుల్లి కోరిక..
ఒట్టేసి చెప్పేయరాదా తీర్చేస్తానని
నేనుగాక ఎవరు నీకు గుర్తుండరాదని!

చిన్నిదాని న్యాయమైన తీరే కోరిక..
మాటవరుసకి మనసారా అలాగేనని
నిన్ను నమ్మిన నా సకలం నీతోనేనని!

చీటికిమాటకీ అడగలేని చివరి కోరిక..
తొణికిసలాడకనే తీర్పు చెప్పేయమని
కోరికలన్నీ సమంజసమైనవే తీరుస్తానని!

చులకనగా చూడకు ఇదే తుది కోరిక..
తుదిశ్వాశకైనా విడదీయలేని బంధమని
నావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని!

అదే పిలుపు

తీరిగ్గా ఉన్నప్పుడు దరిచేరి నా ఒంటరితనాన్ని పూడుస్తావు
ఆ చేష్టలంటే నాకు వల్లమాలిన అభిమానమని తెలిసికూడా
సగం తెలిపేసి తెగేసిన మాటలతో నా హృదయాన్ని కోస్తావు
మౌనాలతో మిగిలిన ఖాళీలని భర్తీచేసే తర్ఫీదు తెలపకుండా
కాస్తంత తడిని కళ్ళలో నింపి సాగరంతో మదిని పూడుస్తావు!

మగతనిదురలో తెరలు తెరలుగా నా కనుపాపలపై నర్తిస్తావు
ఆ జ్ఞాపకాల్లో అచ్చంగా మనిద్దరమే ఉన్నామని తెలిసికూడా
జామురేయి జోరీగవై నా కంటి కునుకుని తెలియక దోచేస్తావు
నిదురలేమిని పారద్రోలేసే వింతకళనొసగే విద్యనేదో నేర్పకుండా
మాయని పొరలు పొరలుగా కప్పి జోలపాడి మరల నర్తిస్తావు!

పనిలో ఉంటే పిలవద్దన్నా పిల్లనగ్రోవిలా పలుమార్లు పిలుస్తావు
ఆ ఆకాతాయి అల్లరి అంటే నాకు ఎంతో ఇష్టమని తెలిసికూడా
పలికీపలకని భ్రమంటి తెలియని దాగుడుమూతలు ఆడిస్తావు
పసిదాన్నై అన్నీ మరచి ఆటలాడబోతే వాస్తవం మరువకుండా
పెద్దరికమేదో ఒసగి ప్రియాతి ప్రియంగా "పద్మా" అని పిలుస్తావు!

ఇలా జరగనీ

మనసులోనే మూతపడ్డ వ్యధని కరిగి కన్నీటి జల్లవనీ
కన్నీటితో తడిసిన కోర్కెలు ఆశల గాలిసోకి మరీ ఆరనీ
నమ్మకంలో సొమ్మసిల్లిన మదిని నీరుతాకి కాస్త లేవనీ
బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
విప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!

దారిలేని మజిలీలు ఎన్నున్నా కొన్ని అయినా నెరవేరనీ
రేయంతా తపనతో తడిసిన చెమటకి వేకువవేడేదో సోకనీ
కరిగిపోబోయిన కలలని మనోధైర్యంతో మంచుగా మారనీ
సూర్యకిరణాల తాకిడికి సాధించాలన్న పట్టుదలనే పెరగనీ
ఆ స్థైర్యంతో ఒడుదుడుకులనే ఖండించి ముందుకు సాగనీ!

మనసు మైనం ముద్దలా కరిగిపోయి మమతలనే వెతకనీ
ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
గుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ!

నీలో నేనని


నీ కనుసంజ్ఞల వైపు చూడాలంటే చచ్చేంత భయం..
నీ చూపుల గాలంలో చిక్కుకుని బయటపడలేనని!

నీవు వెనుతిరిగి వాలుచూపులు విసిరితే గందరగోళం..
నీ కోసమే కొట్టుకునే గుండె ఆనందంతో ఆగిపోవునని!

నిన్ను గట్టిగా వాటేసుకున్నట్లు నాకొచ్చెను స్వప్నం..
నీ సాంగత్యంలో కలలే నిజమై ఉక్కిరి బిక్కిరి అవునని!

నీ ప్రేమలో జీవిస్తుంటే నాకే తెలియని అలౌకికానందం..
నీకై నన్ను పుట్టించిన విధిని ముందు తూలనాడానని!

నీ కోరికల సెగలో లావానై పొంగిపోతే నాకదెంతో ప్రియం..
నీతో కలిసి జీవించడమే కాక మరణించి కలసిపోయానని!