ఎప్పుడైనా అడుగు

ఎప్పుడైనా మీకు ఆస్తి అంతస్తులన్న అహం పెరిగితే
శ్మశానాన్ని ప్రదక్షణ చేసి సమాధులు చూసి రండి
కుదిరితే చనిపోయినోడు ఏం తీసుకెళ్ళాడో అడగండి!

ఎప్పుడైనా మీకు పరమాత్ముని పై ప్రేమనేది కలిగితే
ఆకలితో ఉన్న వాడికి మీ చేతులతో అన్నం పెట్టండి
కడుపునిండా దీవెనలతో మీ ఆత్మ నవ్వేను చూడండి!


ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు మేల్కొని నవ్వితే
వాడిని ముక్కలు చేసి తలెత్తి గర్వంగా మిడిసిపడండి
మన ప్రవర్తనే మనకి దిక్సూచని తెలిసి మసులుకోండి!


ఎప్పుడైనా మీ కొవ్వుపెరిగి కండల బలం పొగరుబోతే
ఏదైనా ఒక వృధ్ధాశ్రమానికి వెళ్ళి ఒకచుట్టుచుట్టి రండి
సత్తువ తగ్గినవారు కాటివైపు నడుస్తున్నారు చూడండి!

ఏం కోరను


జ్ఞానదీపమే వెలగలేక ఆరిపోతుంటే
మనసులో జ్యోతిని ఏం వెలిగించను
మనిషి మార్కెట్లో అమ్ముడైపోతుంటే
ముఖం రంగులతో ఏం సింగారించను

భవిత కాసులకై కాలిబూడిదైపోతుంటే
యువత అందాలు ఎక్కడని వెతకను
ప్రలోభాల మెరుపులనే కనకం అనంటే
భవిష్యత్తులో పసిడిలోకం ఏం చూడను

తెలీదన్న ప్రతీసారీ అక్షరాభ్యాసమంటే
పాతపలకపై పలుమార్లు ఏం దిద్దించను
అవినీతినే గోరుముద్దలుచేసి పెట్టమంటే
తెలిసికూడా తెలియనట్లు ఏం నటించను

జగతి ఆకలితీర్చే రైతే శవమై అంకురిస్తే
జనం ఎరువుగా మారితే ఎక్కడ పాతను
ఆలోచనలే అరికాళ్ళ పగుళ్ళుగా స్రవిస్తే
అడుగులో అడుగేసి దేశోన్నతి ఏం కోరను

పలుకులు

పలుకులకు పళ్ళు, దంతాలు ఉండవు,
కానీ....పరుషమైన పదాలు పలికినప్పుడు.
గాట్లు పెట్టకనే గుండెను గాయం చేస్తాయి!

కొన్ని గాయాలు జీవితకాలం మానవు,
అందుకే.... మాటలు మధురంగా మాట్లాడు.
తీయని మాటలు ఔషధములా పనిచేస్తాయి!

నరం లేని నాలుకకు పగ్గాలు ఏమీ లేవు,
అందుకే...సృష్టికర్త సైతం ధూషిస్తే శపిస్తాడు.
లేకి మాటలు జ్ఞానినైనా మూర్ఖుడ్ని చేస్తాయి!

పదం చేసే శబ్ధాలకి కాళ్ళు చేతులు లేవు,
కానీ...మంచి మాటలు చికిత్స చేసే వైద్యుడు.
శరీరానికైన వేయి గాయాలైనా మానిపోతాయి!

ప్రశ్నాక్షరాలు





రక్తాన్ని రంగరించి నిజాలు రాయలేని నీవు
నీటితో రాసి దాహాన్ని తీర్చుకోవడం ఎందుకు?


ఆచరించని నీతులే అందమైన పదాలల్లి నీవు
అల్పాయువాక్షరాల అభివృధ్ధి కోర్కె ఎందుకు?


జరుగుతున్న రాక్షసత్వాన్ని రాచరికమని నీవు
కోకిలవై కూడా కాకిలా మారి అరవడం ఎందుకు?


వాస్తవాలనే వర్ణవిభేదాలు అంటూ వేరుచేసి నీవు
వేషం మార్చి విడ్ఢూరమని వింతచేష్టలు ఎందుకు?


స్వార్థాన్ని సూక్తులతో ముసుగేసి సిగ్గులేని నీవు
సిధ్ధాంతాలే సిగనపూలుగా చుట్టి ఆ ఠీవీ ఎందుకు?


చీకటిలో చైతన్యాన్ని చంపేసి చితిని పేర్చిన నీవు
కల్లబొల్లి కబుర్లే వ్రాసి కాళిదాసులా ఫోజు ఎందుకు?