వెనుకెనుకే వస్తావు వెంటనే మాయమవుతావు
మాయలోడివి నీవు నన్ను ఏదో మాయచేసావు
చిలిపిచేష్టలెన్నో చేసి చేతికి మాత్రం చిక్కకున్నావు
చిల్లర దొంగవి నీవు చిన్నదాని మనసు దోచినావు
సోగ్గాడివిలే నీవు సొగసరినంటూ నన్ను పొగిడేవు
సరసానికని సైగచేస్తే సంకలు ఎగరేసుకుని వస్తావు
కొంటెచూపులు చూస్తూ కొంగు పట్టుకుని తిరిగేవు
కోరమీసమే దువ్వుతూ కోమలాంగిని ఏదో కోరేవు
అన్నింటికీ సై అనంటూ అల్లరేచేసి ఆట పట్టిస్తావు
ఆలిని చేసుకోమనంటే ఆమడదూరం పరిగెడతావు
మోసగాడిని కానని మసిరాసి మంత్రమేదో వేసేవు
మొత్తానికి బ్రతుకు నేర్చిన శ్రీ-420 మగాడివి నీవు
(శ్రీ-420 పోస్ట్ తో బ్లాగ్ లో మొత్తం 420 పోస్ట్లు పూర్తి చేసానని తెలియ చేసుకుంటూ,
ఎవరినైనా తెలిసీ తెలియక బాధపెట్టి ఉంటే మనసారా మన్నిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆదణాభిమానాలని
ఎల్లప్పుడూ కోరుకుంటూ...మీ పద్మార్పిత _/\_ )