అసాధ్యం!


  నీకు దూరమై నిన్ను మరువడం.....
నా మనసు నీవు అర్థం చేసుకోవడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!


అనాదిగా ప్రేమ అన్నదే ఒక పెద్ద నేరం
ప్రపంచాన్ని ఎదిరించి నిన్ను పొందడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!


ప్రేమ గుడ్డిది అన్న లోకంలో జీవించడం
అంధుల మధ్య అంధురాలిగా బ్రతకడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!


ఎంతకాలమని ఈ ఎదురీతలో పోరాటం
ఓడిపోయిన నన్నే మళ్ళీ ఓడిపోమనడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!


మనిద్దరి నడుమ దూరాన్ని తగ్గించడం
ఏర్పడ్డ వలపు గోడల్ని కూల్చివేయడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!

కావాలి!

పగటిపలక పై దిద్దిన ఆశల అక్షరాలని
చీకట్లో తనివితీరగా తలచుకుని రోధించి
రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!

పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
ఏరి తీసుకొచ్చి అందంగా పేర్చి బ్రతకమని
బరోసా ఇచ్చే మృదువైన చేతులు కావాలి!

బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి
మట్టికొట్టుకొని పోయిన మనసులను కడిగి
హత్తుకుని ముద్దాడే మనిషి తోడు కావాలి!

వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
పాడు పరిమళం అంటించుకోక కుప్ప చేసి
ఎత్తేసి శుభ్రపరిచే నిశ్చల నైపుణ్యం కావాలి!

నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శగా మారి
మరో కొత్త జీవితానికి ఈ ఆశే ఊపిరి కావాలి!

ఆనందమా..నీ చిరునామా!

ఓ ఆనందమా! ఏది నీ చిరునామా
నాపై అలిగి ఎందెందు దాగినావో చెప్పవా
నీ అలుక తీరే మార్గమేదో ఇకనైనా తెలుపవా!

నీ కై వెతికా మేడమిద్దెల్లో, స్వాదిష్టి భోజనంలో
కానరాక వెతికి వేసారి, షాపింగ్ మాల్స్ ని,
నగల నగీషీలనీ నీ జాడ చెప్పమని అడిగా
విసుగ్గా ముఖం చిట్లించి...వెర్రిదానా అంటూ 
నీకోసమే వాటి అన్వేషణ అని నవ్వుతూ..
సంతోషాన్ని నీవు చూసావా అంటూ ప్రశ్నించె!

వేదనతో పరిచయమైన నాకు తెలీదని తల్లడిల్లి
శోధనలో సహాయ పడమని దుఃఖాన్ని కోరగా
నిన్ను గుర్తించే ఆనవాళ్ళు చెప్పమనే...
చిన్ననాటి స్మృతులనే చూడామణిగా ఇచ్చా!

ఇన్నేళ్ళుసత్తువే సొమ్మసిల్లి, అలసట సేదతీరె
అయినా ఆశచావక వెతుకుతూనే ఉన్నా...
అకస్మాత్తుగా ఓ అరుపు...అర్పితా ఆలకించని!
దిక్కులన్నీ వెతికి దిగులు చెందకని ఓ మెరుపు
నేను నీలోనే, నీ చుట్టూనే ఉన్నానంటూ..
నేను వస్తువుని కాను కొనుగోలు చేసుకోడానికి
నిష్కపటమైన ప్రేమలో, నిస్వార్థమైన సేవలో
నిర్మలమైన నవ్వులో, నిశ్చలపనిలో ఉన్నానని

"ఆనందం" అనుభూతని, వెతక్క బంధించనె!
సంతృప్తి తన తోబుట్టని, కోరికలే శత్రువులనె!

వింత వైద్యం


మనసు గాయానికి ఆయింట్మెంట్ అవసరంలేదు
స్వాంతన పరిచే సెంటిమెంట్ మాటలుంటే చాలు!


తలపుల తలనొప్పి, మాత్రలు వేసుకుంటే తగ్గదు
చెలి చెంత చేరి చేసే చిలిపి వలపు చేష్టలే చాలు!

ప్రణయరాగాలకు పల్స్ చూసి పరీక్షలు అక్కర్లేదు
స్పంధించే హృదయానికి ప్రతిస్పందనలే పదివేలు!

విరహంలో వేగి వైరస్ లక్షణాలు అనుకుంటే కాదు
తనువుల ఘర్షణలే వలపు జ్వరానికి విడుపులు!

సరసాల సమ్మోహనానికి సర్జరీలు చేయనక్కర్లేదు
సరదాగాసాగితే మన్మధుడే వేసేను వలపుబాణాలు!

సుమధుర ప్రేమకావ్యానికి సూదిమందు పనిలేదు
అంతు చిక్కని అంటువ్యాధది అనురాగమే చాలు!

పరవళ్ళు త్రొక్కే గుడ్డిప్రేమ ఏ ట్రీట్మెంట్ కి లొంగదు
లేని వలపు ఉందని ఎక్సరేలు తీస్తే అబాసుపాలు!

తడి-సడి

చిట పట చినుకుల అందెల సడిలో తడిసి ముద్దై
గూటికి చేరి ముంగురులను మారాం చేయబోకన్న
మూతి ముడుచి జడలో ఒదిగిపోతే ఎంత అందం
వేడివేడి పకోడీలు చేతికందిన....ఆహా ఏమి భాగ్యం!

 

జడివానలో జోరుగా నడిచి సంధ్యవేళ ఇంటికి వచ్చి
తడి ఆరబోస్తూ మధురగీతాలు మనసార వింటున్న
చలిగాడు బయటపడలేక ఉడుక్కుంటే భలే సంబరం
మిరపకాయ బజ్జీలు చెంత చేరిన....అదే కదా స్వర్గం!



కుండపోతగా కురిసేటి వర్షాన్ని కిటికీలోంచి చూస్తూ
చేతిగాజులు సవ్వడికి చిలిపిఊహలే అల్లుకుంటున్న
పెదవులే హరివిల్లై విరియగా మురిసి నవ్వె ఆకాశం
చిల్లుగారెలు ఎందుకో చిన్నబోయె...ఏమీ చిద్విలాసం!



ప్రణయ అలలు


నిష్కల్మష ప్రేమకు నిర్వచనమే నీవని తెలిసె
పదాలన్నీ పేర్చి నీ పేరిట పద్యమే రాయబోతే!

సుమధుర నాదస్వరమే ఊదినట్లు అనిపించె
నీ ఊపిరేదో నన్ను తాకకనే గిలిగింతలు పెడితే!

సజల సహజ నయనాలే నీకై దిక్కులు చూసె
సతతహరిత సరళ సరస సల్లాపాలేవో కరువైతే!

మండుటెండలో మలయమారుత గాలులే వీచె
నా కురులలో నీ మోముదాచి రాతిరని నవ్వితే!

సిగలోని మల్లెలు పిర్యాదు దొంతర్లే నీకు చేరవేసె
అధరాలు అదురుతూ మకరందాన్ని దాయబోతే!

నింగిలోని తారకలన్నీ సిగ్గుమొగ్గలై తలలు వంచె
ప్రణయఅలలకే తడిసి పసిడిమేనే నిగనిగలాడితే!

కౌగిలి వీడలేక వీడిన కపోతాలు విరహంలో అలిసె
కనురెప్ప మూసి తెరచి యుగమాయెనని చెబితే!