కోమలి

చిలకపలుకులే పలికి చిత్రంగా మనసు దోచి
చీరకొంగట్టుకుని చుట్టూ చిన్నపిల్లాడిలా తిరిగి
చెప్పకుండా వచ్చేయి ఛల్ మోహనాంగి అంటే
నమ్మి నీతో వచ్చేసేటంత అమాకురాలిని కాను
లోకంపోకడ ఎంతో తెలిసిన చిన్నదాన్ని నేను!

మాయమాటలెన్నో చెప్పి మభ్యపెట్టాలని జూచి
మనసు ఇచ్చేసినాను అంటూ మరెక్కడో తాకి
మగబుధ్ధి చూపి మర్మమెంతో దాచి రమ్మంటే
మోసపోయేంత మెతక మనిషిని అసలే కాను
మసక మనసులెన్నో చదివిన మగువను నేను!

కల్లబొల్లి కబుర్లేవో చాకచక్యంగా చెప్పి కవ్వించి
కోరేది కామమే కాదంటూ కసిని కళ్ళలో దాచి
కావలసిన కార్యానికి ఇరుమనసులు సాక్షంటే
కపటం ఏదో తెలుసుకోలేనంత కబోదిని కాను
కాళికగా మారే కుసుమకోమల కాంతను నేను!

పొగడ్త

అబద్ధపు ప్రశంసలే అందరికీ ఆనందాన్ని ఇస్తాయి
పొగడ్తల్లో నిజాయితీ ఎప్పుడూ నీరుగారిపోతుంది..
గులాబీని నువ్వెంత సుకుమారివో అంటే అదేం గొప్ప
దానికి ఉన్న ముల్లుని అంటే అది మురిసిపోతుంది!!

చేయాలి అనుకున్నది చేయకుండానే ఎవరైనా పొగిడితే
అప్పుడు కలిగిన సంతోషంలో ఏం నిజాయితీ దాగుంది..
అయినా పొంగిపోయి సంబరపడి నవ్వడం అతిసహజం
కృత్రిమ ఆనందాన్ని ఇచ్చే ప్రశంసలే అందరికీ కావాలి!!

నిజం నిష్టూరపు నీడ అందుకే దానికి శత్రువులు జాస్తి
పొగిడితే మనలోని అహం అసంకల్పితంగా నర్తిస్తుంది..
ఉన్నది ఉన్నట్లుగా చెబితే చేతకానితనం అనిపించుకుని
ఓర్వలేనితనానికి ఇదొక ఒరవడని నింధించబడుతుంది!!

ఎవరు ఏమన్నా మనం స్పందించడంలోనే భేదముంది
అందుకే పొగిడితే పొంగిపోయి తిడితే కృంగిపోకంటుంది!!

ఓ వెర్రి మనసా...


ఓ వెర్రి నా మనసా...కన్నీరంటే మోజాయె
ప్రేమను రుచి చూపి కొత్తజీవితాన్ని ఇవ్వకు!


వనం వసంతతో నిండి...పూలు నవ్వుతుంటే
కోయిలలు పరవశంతో పాడ నెమళ్ళు నర్తించ
మౌనం రోధనకు వేణుగానాన్ని వినిపించకు!!


మెల్లమెల్లగా మబ్బులే ఆకాశాన్న సన్నగిల్లగా
దాహం తీరక విరబూయని మొగ్గ ముడుచుకుని
జాలిగా నా ఒళ్ళోన రాలి నాకు జతకూడి ఏడువ
సదా నాకు తోడున్న చీకట్లను తరిమాలనుకోకు!


ఇదే జీవితం... ఏడుపులోనే నవ్వడం నాకు ప్రియం
కొద్దిసేపు ఉండిపోయే చంద్రుని వెలుగుని ఇవ్వకు!!

ఏం జీవితం!?

ఎంత అందంగా చెప్పారు ఎవరో..
దాహంగా ఉంది, నీటిలో విషం కల్సింది
తాగినా చస్తారు తాగక పోయినా చస్తారు!
ఇదే తంతు జీవితాంతం సాగుతూనే ఉంది
పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
నిదుర పూర్తిగా పట్టదు, కలలు నిజం కావు


కాలం కాస్త ఓపిక పట్టమంటుంది..
సహనం ఇంకెంత సమయం అనడుగుతుంది
ఉదయం లేచింది మొదలు ఉరుకులుపరుగులు!
విశ్రాంతి కోసం వెతుకులాట విశ్రాంతి లేకుండా
నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది!


అందుకే నీ పై అన్నీ అభియోగాలే జీవితమా

అయినా మౌనంగానే సాగిపోతుంటాను..
ఎందుకంటే...ఇది కూడా లేని వాళ్ళు ఎందరో!