తప్పేంటి!?

మాయలేడిని కోరక కుదురైన కాపురమంటే 
కాదు కూడదనే రాముడున్న కాలంలో...
కట్టుబట్టలు కూడా కొనివ్వక ఉండమంటే 
ఉండను ఉండలేనని సీతంటే మాత్రం తప్పేంటి
రాయల్ ఫ్యామిలీ రావణుడే నచ్చెనని అంటే
బరితెగించిన ఆడది అంటూ తగని నిందలేంటి!

వేణుగానం విని మాధవా మోహించినానంటే
పదహారువేల అతిసుందర ప్రియసఖులలో...
ఆమె స్థానం ప్రేమలో తప్ప పైకంలో లేదంటే
నువ్వు కాకపోతే నీలాంటి వారు నలుగురని
తనని మెచ్చిన వారిని రాధ వెతుక్కుంటానంటే
మోహించిన మోసగత్తె అంటూ బిరుదు ఎందుకని!

వరించి వివాహమాడినోడి స్టైల్ చూసి సంబరమంటే
మీసాలగెడ్డాల మగతనమే చూపి మందుమత్తులో..

కొట్టింది కాక సవతిని వెంటపెట్టుకొచ్చే శివుడుంటే
చీకిచిరిగిన సంసారానికి అతుకులేసినా అతకదని
విడిపోయి వేరొకరితో వెళ్ళి కాపురం ఉంటాననంటే
వెలయాలిగా మారినావంటూ వెకిలి మాటలేంటి!?    

ఏం లిఖించను?

జీవన గమనపు గతుకుల గ్రంధమే కనులముందుంటే
అక్షరగణాలు ఎరుగని నేను గద్యమే వ్రాయలేని స్థితిలో
దోషాల్లేని దోహాలు వ్రాయలేను, ద్విపదాలు దొర్లించలేను!

నవ్వుతున్న పెదాలకి దురాలోచనల ధూళంటుకునుంటే
సాంగత్యమే ఇచ్చిపుచ్చుకునే వ్యాపారమై కదలాడే కళ్ళతో
కల్తీలేని ప్రేమ అని, కమ్మని కావ్య కవితలు నే రాయలేను!

ఎత్తు పై ఎత్తులేసి ఎదుటి వారిని చిత్తు చేయాలనుకుంటే
అంచనాలు తారుమారు చేసే తంత్రం తెలియని మాటలతో
తాత్పర్యము తెలిపే పద్యపాండిత్య ప్రవచనాలు చెప్పలేను!

వెసులుబాటు కోసం వెకిలి మాటలాడే వింత జాడ్యముంటే
చర్చకు ఛందస్సు జోడించి చైతన్యవంతపు చమత్కారాలతో
జనోద్ధరణ జానపద గీతికలు, పాటలు రాసి మెప్పించలేను!

అరమరికలు లేని భావాలకు అక్షరాలు తోడు ఉంటానంటే
ఘజల్స్, ముషాయిరాలో లేక అవి ఏ కంద, సీస పద్యాలో
తెలియక పోయినా రాస్తూ తప్పులెన్నో చేస్తూనే ఉంటాను!

ఏదో తెలియదు!

ఆవేదనో, ఆనందమో తెలియదు...
నీవు నా కనుల ముందుంటే.
విరహానికి విలువగానో, లేక...
కలయికకి కానుకయేమో తెలియదు!


 ***

బాధవంటి భారమేమో తెలియదు...
ఎదుటపడి చెప్పాలనుకుంటే.
బిడియమో మొహమాటమో, లేక...
అలుసైపోతానన్న భయమో తెలియదు!


***

మధురమో, మైకమో తెలియదు...
గుండె నిండిన అనుభూతి నీవుంటే.
ఈ వలపు వ్యధనో వగరో, లేక...
మత్తో, చిత్తైన మనసుకిదేం తెలియదు!


***

మరువలేకనో, నీకు నచ్చలేదో తెలియదు..
అసలు విషయం అడగాలనుకుంటే.
అవునంటావో కాదంటావో, లేక...
తెలీని భానిసత్వమే బాగుందో తెలియదు!

అక్షరస్వరలయ

అచ్చతెలుగు వారు సైతం ఆంగ్లాక్షరాలని అందలం ఎక్కిస్తుంటే
అలిగిన 56 తెలుగు అక్షరాలు బోరుమనలేక గొల్లుమన్నాయి
అమ్మలాంటి కమ్మదనం ఉన్న అక్షరాలు మాటల్లో అన్నాయి..
ఆంగ్లములోని A B C D లకేం ఆడుతూ పాడుతూ పలికేస్తారు
అక్షరాభ్యాసం నాడు అచ్చులు దిద్దించడానికి ఆలోచిస్తున్నారు!

అ నుండి అం అః అచ్చుల్ని అని చూడు ఆప్యాయత అనిపించేను
క, ఖ, గ, ఘ కంఠస్తం పడితే ఉదరభాగపు కండరాలే కదలాడేను
చ, ఛ, జ, ఝ లని పలికితే ఛాతీ భాగమే కదిలి రొమ్ము విరిచేను
ట, ఠ, డ, ఢ లు ఉచ్ఛరించి చూడు స్వరపేటిక కదిలి ఆడిపాడేను
ప, ఫ, బ, భ లను పసందుగా పలికితే పెదాలు కలిసి తేనెలూరేను
తనువంతా తడిమేటి తెలుగులోని తీపి ఆంగ్లభాషకి ఏదీ అనడిగితే
ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి!

మరిచా..


అసలేం గుర్తుకులేదు అన్నీ మరిచా
సన్నివేశాలేవీ జ్ఞాపకం రావడంలేదు
నీ సన్నిహితంలో నే సమస్తం మరిచా!

భావమే రాయబోయి భాషనే మరిచా
మనసు మూల నిదురించి మగతలో
తిరుగుపయనమై నా ఇంటినే మరిచా!

అలవి కాని అనురాగంలో అన్నీ మరిచా
ఆశల అద్దాలమేడని అందంగా కలగాంచి
అసలైన అస్తిత్వపు మట్టి గోడల్ని మరిచా!

బాసలు నీవు మరచిన విషయం మరిచా
వగచి సొమ్మసిల్లిన మనసుని ఓదారుస్తూ
నా కలలన్నింటినీ నీ కళ్ళలో పెట్టి మరిచా!

హంతకుడికి చెప్పవల్సింది చెప్పక మరిచా
వలచినందుకు శిక్షించబోయి బహుమతిగా
తన హృదయాన్ని తిరిగి ఇవ్వడం నే మరిచా!