ఇద్దరం

ఇద్దరం సంభాషణ అంటూ మొదలెడితే...
మధ్యలో మౌనం మరికొంత మధురగానం!

ఇద్దరం మాటలేలంటూ మైమరచిపోబోతే...
కొంత బిడియం మరికొంత తీయనిసరాగం!

ఇద్దరం తెలియని బంధమై పెనవేసుకోబోతే...
చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!

ఇద్దరం గిల్లికజ్జాలతో గొడవపడి అలకబూనితే...
కొంత ఇష్టం మరికొంత అలవికానేదో అయిష్టం!

ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!

ఇద్దరం పగటిపూట పనిలోపడి విడిపడిబోతే...
కొంత అనురాగం మరికొంత తప్పని అసహనం!

వేడి వలపుసెగ..


వేడితాపం ఏలనో నన్ను ఇంతగా వలచె..
వద్దు వద్దంటున్నా వెంటపడి వేధించసాగె
వేడిసెగ తాకగానే ఒళ్ళంతా కమిలిపోయె
చెమటపట్టి తనువు మొత్తం తడిసిపోయె
తాపం తాళలేనంటూ మేని నగ్నమాయె
విప్పిన వస్త్రాలు ఉతుక్కుటుండగానే ఆరె
జలకమాడి దుస్తులు వేసుకోగానే తడిసె!

వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..
దాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
విరబోసుకున్న కురులు అలిగి కొప్పాయె
రవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె
సరసమే కంపరంపెడుతూ రుసరుసలాడె
సంధిసేయ వచ్చిన చంద్రుడే చల్లగా జారె!

రా పోదాం!

రా ఏటైనా పారిపోదాం...
మనసులోని భావాలకి రెక్కలు కట్టి
మన్నేదాకా ఉండి, మట్టిలో కలిసిపోదాం!

రా దూరంగా లేచిపోదాం...
ఎల్లలు లేని లోకం ఒకటి వెదకి
సుదూరాలని, సునాయసంగా చుట్టేద్దాం!

రా విహంగాలమై ఎగిరిపోదాం...
అనురాగానికి ఆకాశమే సరిహద్దని
హద్దులనే రెక్కలుగా కట్టుకునిపోదాం!

రా ఏగూటి పైనో వాలిపోదాం...
ఒకరి ధ్యాసలో ఒకరు తిరిగి అలసి
కలసిన వేళ ఎదలు జతచేసి పవళిద్దాం!

రా నువ్వు నేను ఒకటైపోదాం...
తప్పొప్పులు తెలీని తనువుల వేడికి
తన్మయత్వపు తీర్పు తీరిగ్గా చెప్పుకుందాం!

రుధిర భావం

బూజుపట్టిన ఆలోచనల నుండి బయటపడాలని ప్రయత్నిస్తూ
ఎన్నో చెప్పాలి అనుకుంటూనే నిన్ను చూసి  ఏమీ చెప్పలేను!

ఈ ఉరుకుల పరుగుల జీవితంతో రాజీ పడలేక కుస్తీ పడుతూ
సంక్షిప్తంగా చెప్పాలన్న తపనలో చెప్పాల్సింది మరచిపోతాను!

బెరుకు ఎందుకు నా అనుకున్న నీతో చెప్పడానికి అనుకుంటూ
క్షణంచాలు సంభాషణ పూర్తవడానికని యుగాలు గడుపుతాను!

తెలిసీ తెలియని సన్నని బిడియపుపొరల్ని మన మధ్య బిగిస్తూ
అనుభవాలని చింతాకులా విశాలపరుస్తూ భంగ పడుతుంటాను!


నాగురించి అన్నీ తెలిసిన నీతో చెప్పలేని మౌనం మూలుగుతూ
అలజడిచేస్తే మళ్ళీ అపరిచితులమైతే బాగుండు అనుకుంటాను!

వెళ్ళొస్తానని..

నీ పరిచయం నూతనోధ్యాయానికి నాంది పలుకుతూ
నువ్వు ఎదురుపడ్డ ప్రతీసారి గుండె వేగం పెంచుకుంది!

నీవు నాయందే దాగి ఉన్నావన్న నిజాన్ని గుర్తుచేస్తూ
నా గతం తాలూకు గుర్తుల్ని నీ ప్రేమ చెరిపివేయమంది!

నాలో తప్ప నాతో లేవని అలిగినమదిని బ్రతిమిలాడుతూ
నిన్ను నీవే గాయం చేసుకోకు నన్ను తిరస్కరించి అంది!

నీ ఊపిరి నా ఊపిరితో రమించి కమ్మనికలకి రూపమిస్తూ
నా బిడియాన్ని బిగికౌగిట బంధించి కొత్తలోకం చూపింది!

నీవు వెళ్ళొస్తానని వీడ్కోలు చెప్ప నిలువడ్డంగా తలూపుతూ
ఆనందాలని మూటకట్టి కంటనీరుని రెప్పమాటున దాచింది!

నీ పై నాకు ఇంకిపోదు ప్రేమ ఇసుమంతైనానని బాసచేస్తూ
నీవన్న మాటలకి...కరిపోదులే ఆశ నీ పై కాస్తంతైనా అంది!