తెలియనితనం



హృదయం ఉదాసీనంగా ఉన్నప్పుడు..
నా చుట్టూ నీవు ఉన్నట్లే తెలియలేదు

పెదవులు నిశ్శబ్దంగా మాట్లాడుతుంటే..
ఊపిరి కదలిక వేగమెంతో కనుగొనలేదు

కనులు కన్నులనే కవ్విస్తున్నప్పుడు..
చల్లగా శ్వాస కాగుతుందని అర్థంకాలేదు

కళ్ళ ముందు రూపాలు కదలాడుతుంటే..
నా మోము నిన్నే ధ్యానిస్తుంది అనుకోలేదు

అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు..
అమాయకంగా అడిగిన ప్రశ్నే గుర్తుకులేదు

ఒకరికొకరం వాగ్దానాలు చేసుకోలేదనుకుంటే..
మరెందుకని ఈ నిరీక్షణలో తెలియడంలేదు

శరీరం అలసి విశ్రాంతి చెందుతున్నప్పుడు..
మదిలో అలజడి ఎందుకో అర్థంకావడంలేదు!!

మరువకు

వీడ్కోలు చెప్పి వెళుతూ నన్ను మరువకు
నవ్వుతూనో తిడుతూనో నన్ను తలచుకో
రాళ్ళపై రాయలేని పేరు గుండె పై రాసుకో  
వేడుకలందు మరచినా వేదనలో మరువకు



విడిగా ప్రేమించే ఇద్దరం ఒకటని మరువకు
అలసిన వేళలో సేదతీరుస్తాను గుర్తుంచుకో
కునుకు తీస్తే కలకు రంగులేస్తాను చూసుకో
కానరాకుంటే నీ ఊపిరిలో దాగాను మరువకు



ప్రణయప్రయాణ బడలికలో నన్ను మరువకు
దారితప్పి గమ్యం మరిస్తే నన్నడిగి తెలుసుకో
తిరుగుతూ వేసారితే నా పేరొకసారి స్మరించుకో
వచ్చి నీ గుండెకు ప్రతిధ్వనినౌతాను మరువకు

మర మనిషి

ఎందుకో ఈ మధ్య సిగ్గుతో చెంపలు ఎరుపెక్కడంలేదు
మనసులో అప్పటి పులకరింతలూ గిలిగింతలూ లేవు
మునుపు మనసువిప్పి చెప్పవలసిందేదైనా చెప్పేవారు
చెప్పకనే మనసును ఎరిగే మంత్రం ఇప్పుడెవరికీ రాదు
హృదయాన్ని హత్తుకోగానే పరిస్థితి తెలిపే జిమిక్కుల్రావు
ప్రేమ, పెళ్ళిళ్ళూ తక్కెట్లో తూనిక రాళ్ళు అయిపోయాయి!
   
అమ్మను అడిగి గృహసభ్యత తెలుసుకునే అవసరం లేదు
గురువులు, పెద్దలని గౌరవించి జ్ఞానం పొందడం చేతకాదు
గూగుల్ వెతుకులాటే గురువై మెదడున్న మరగా మారినారు
ప్రస్తుతం సోదరులు సమస్యలు ఒకరితో ఒకరు చెప్పడంలేదు
తండ్రితో కొడుకులు తమ చిక్కుప్రశ్నల గూర్చి చర్చలూ లేవు
ఇప్పుడు ముఖాలన్నీ మూసిన పుస్తకాలు అయిపోయాయి!

ఎందుకని ఆలోచిస్తే తెలిసే.....అప్పట్లో ముఖపుస్తకం లేదు
మొబైల్ స్మార్ట్ ఫోనులు, ట్విట్టర్ అకౌంట్లు అంతకన్నా లేవు
లేఖ రాస్తే చూసి మనసులో భావాల్ని మొత్తం చదివేసేవారు
పక్షులూ పరామర్శించేవి, మనిషీ మనస్పూర్తిగా పలికేవాడు
నేడు మనిషి తాను గీసుకున్న వలయంలో తానే బంధీయై  
ఆచరణాత్మక ఆలోచనల్లో భావాలు సమాధి అయిపోయాయి!

నిరుపయోగం..


ముఖం చూపలేని భావాలు చూపిస్తున్న కళ్ళలో
ఆపేక్ష సాంద్రతేదో కొరవడి చెమ్మగిల్లిన నయనాలు
మసకెక్కి తడి దర్పణాలుగా మారి నర్తిస్తే తెలిసే..
అసంతృప్తి చెందితే ఆలోచన్లు సైతం అవశేషమేనని!

ముద్దగట్టిన తీపిగుర్తుల్ని విడదీయబోయే ప్రక్రియలో
కాలానికి వేలాడుతున్న వయసుని మభ్యపెట్టబోయి
డోలకమై ఊగిపోతూ ఒంటరి వర్ణంగా నిలిస్తే తెలిసే..
పాదరసమోలె పనికిరాని మెరుపు లోహద్రావణాన్నని! 

మస్తిష్కానికి వేదనలు ముసురుగా పడితే శరీరంలో
నిస్సత్తువే రాజ్యం ఏలుతుంటే అడుగు వేయలేనన్న
జీవితం అటూ ఇటూ పొర్లుతూ నడవబోతే తెలిసే..
చావక బ్రతుకుతున్నవి చలనమున్న అవయవాలని!
 
మనసునైనా ద్రావణం చేయాలన్న ప్రయత్నంలో
కొన్ని ఆమ్లక్షార ద్రావణాలని గొంతులో పోసుకుని
తటస్థీకరణ స్థితిలో ఉన్నట్లుగా నటించబోతే తెలిసే..
నేనొక నిర్లిప్తతతో కూడి ఘనీభవించిన రాతిశిల్పాన్నని!

దారెటు!?

జీవితాన్ని జీవించాలన్న జిజ్ఞాసకు లోబడి
అందరిలా పరుగులు పెడుతూ హడావిడిలో
మార్పులకు చేయూతగా నేనూ మారిపోయి
ఒంటిచక్రమై అలుపన్నదిలేక తిరుగుతున్నా..


***

ఏదో చేసి, ఎంతో సాధించాలన్న యావనబడి
ఉదయం చంద్రుడు రాత్రి సూర్యుడు వచ్చెనని  
అసలు నన్నునే మరచి యంత్రం అయిపోయి 
నే కన్న కలలకు కవచం తొడిగి తిప్పుతున్నా..


***


పగలు రాత్రి అన్న తేడాలేక పని ధ్యాసలోపడి
మదిలో మొలచిన కోరికల్ని కలనైనా తలవక
పనికి నేను బానిసనై మనిషిని రాయిగా అయి
పరిగెడుతూ పరిభ్రమణపుపట్టులో చిక్కుకున్నా..


***


పరుగులాటలో అలసట నాపై అరచి చతికిలబడి 
జీవితమే చీత్కరించి సంధ్య కూడా ఛీ పొమ్మంటే
కాలేకలల కాంతిలో ఏం కనబడక ఆశ చనిపోయి
యాంత్రికంగ గమ్యంలేని ప్రయాణం సాగిస్తున్నా..