మట్టివాసనతో మనుషులు పులకరించేలా
వేడెక్కిన రాతి హృదయాలు చల్లబడేలా...
మేఘమా కనికరించి జల్లు కురిపించరాదా!
పల్లె పట్టణాలన్న భేధాలు మరచి దారిమళ్ళి
గుడిసెలోనా గోపురం పైనా వానజల్లులా వెళ్ళి
తడారిన నదీబావుల దాహం తీర్చు మళ్ళీ...
మబ్బులు మనుగడకే మిత్రులని తెలుపరాదా!
నృత్యం చేసేటి నెమలి రెక్కలే అలసిపోయె
కప్పలేమో బెక బెకమని సొమ్మసిల్లిపోయె
వానపాములే తడిలేక ఎండి పుల్లలాయె...
మెరుపులో మమకారాన్ని కుక్కి కురవరాదా!
పొలంలో ఎదురు చూసే రైతు నడుము విరిగి
నాగళ్ళు సమ్మె చేయగా ముళ్ళపొదలు పెరిగి
ఉరుములకి ఉలిక్కిపడే పడుచులేమో తరిగి...
మేఘాలు మొండివన్న నిందేల కురిసేయరాదా!