నా భావాక్షరాలు..


_/\_ఇది నా బ్లాగ్ లో 500వ పోస్ట్. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి అభిమానిస్తూ నేను లిఖించిన అక్షరాల్లో అవకతవకలున్నా ప్రేరణ అందించిన అందరికీ పద్మార్పిత వినమ్రతా నెనర్లు_/\_

మంచుకురిసే వేళైనా మైకం కమ్మేస్తున్నా
ఆలోచనలు ఆరాటపడినా అలసట కాదన్నా
నా మనోభావనలకి రాయాలన్న ఈ తపన..
మది చేసిన అల్లరిని బయటపెట్టె వందసార్లు!

మమతానురాగాలు మోహమై కమ్ముకున్నా
ఆలాపనలు ఆరోహణావరోహణలై అడ్డుకున్నా
నా హృదయస్పందనల సవ్వడులే ఈ రచన..
ఉఛ్వాసనిశ్వాసలై కలతపెట్టె రెండువందలసార్లు!

మండుటెండలో మల్లెలు వికసించి కవ్విస్తున్నా
ఆవేదనలు అంతరంగాన్ని అదిమిపెట్టుకోమన్నా
నా భావం కాన్వాసుపై కుంచై చేసిందే ఈ నటన..
చిత్రాల్లో నగ్నత్వం కన్నుగీటె మూడొందలసార్లు!

మరులుగొల్పు మాటలు కలాన్ని కట్టడిచేస్తున్నా
ఆటుపోట్లై పలవరింతపు పులకింతలు ఆగనన్నా
నా కలం చేస్తున్న అక్షర వందనాలే ఈ భావన..
కలల వేదాంతమే చెప్పెనేమో నాలుగొందలసార్లు!

మంచిమాటల మాల అవకతవకలతో కట్టలేనన్నా
ఆగ్రహం చెందిన ఊహలే నన్ను కాదుపొమ్మన్నా
నా పక్షపు గెలుపుకి మీ స్ఫూర్తివ్యాఖ్యలే స్పందన..
మీ సహకారానికి నమస్సులు అయిదొందలసార్లు!

పోరాటం


పరచుకున్న మార్గం మొత్తం శూలాలని
ఉన్న సంబంధాలకు దుమ్మంటుకుందని
పరిష్కరించ ప్రతికూల పరిస్థితులు లేవని
తడుముకుని నీకు నీవు అవరోధం అవకు
లే లేచి నీ స్వంత మార్గాన్ని నీవే తవ్వుకో!



సూర్యుడు చీకటిలో గల్లంతు అయితేనేమి
రాతిరివేళ ముగియగానే తెల్లవారిపోయేను
కాంక్షలే నిన్ను కౌగిలించుకుని ఉన్నాయి
ఒంటరివైతివి అనుకుంటూ బెంబేలు పడకు
నమ్మిన సిద్ధాంత చట్టాన్ని నీవే నిర్మించుకో!



జీవనపోరులో మనోబలాన్ని విల్లుగా వంచి
కోరికల బలగాన్ని కొలిమిలో కాల్చి గట్టిచేసి
అడ్డంకులున్నా గెలిచే వరకు ప్రయత్నించు
నీ మనోధైర్యము వదిలేసి సహనం కోల్పోకు
సత్యానిదే విజయం అదే నీకు లక్ష్యం అనుకో!

నన్ను వీడకు

చినుకు పడి చిలిపి కోరిక రేగె మదిన
మనసా నీవు వలపు దాచి నటించకు
ఆ పై చెప్పలేదని నాపై నింద వేయకు.

యవ్వన ఋతువులా ఈడు జిల్లుమన 
పైర గాలివీచి పైట లేచెనని సర్దుకోమాకు
మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.

పగ్గంలేని చంచల ప్రకృతి నన్ను రమ్మన
చెప్పకనే లేచిపోయానని పరువు తీయకు
మాయచేసి మంత్రమేసానని గేలి చేయకు.

ఎండ నీడ హృదయాన్ని తాకి ఆశ కమిలిన
ఆశ్చర్యపడి అణిగి ఉండమని ఆంక్షలేయకు 
నా కురుల గూడారంలో నన్నే దాగమనకు.

వలపు తెలిసిన ఒంటరితనం కౌగిలించుకొన
పగలే క్రూరమై రేయి హంతకుడాయె అనకు 
కలల వీక్షణల్లో వెర్రిదాన్నైనానని వీడిపోకు.  

మారిన ధ్యేయం!


నేనొక మైనపు ముద్దలా కరుగుతుంటే
పాచిన పనికిరాని పిండి పదార్థమంటూ
కాలానికి వేలాడకట్టి చోద్యంలా చూపితే
అసంతృప్తి ఆమ్లాన్ని మింగలేక కక్కలేక
తడికంటి దర్పణాల్ని శాశ్వితంగా మూయక
తటస్తీకరణ శక్తికావాలని కోరడం అవివేకం!


కాలాన్ని కోస్తూ ఒలికిపడుతున్న జ్ఞాపకాలు
గుండెను డోలకంలా అటుఇటు కదుపుతుంటే
ముసురు పట్టిన మస్తిష్కంలో నిండిన వేదన
విరహంతో తగువులాడి వలపునే లేపనమడుగ
కఠినమైన కారుణ్యానికి దారితెన్నులు కానరాక
ఒంటరి కుంచె వర్ణంలేని చిత్రం గీయడం విచిత్రం!


విధి వచనమెరుగనట్లు వక్రశైలిలో వివరమడుగ
సాంద్రత లోపించిన సద్గుణమే అద్దమై మెరవాలని
నిర్లిప్తత నిరాశలని శత్రువులుగా ఎంచి తూలనాడి
చిట్లిన గాయాలతో రోధిస్తున్న ఆశల్ని గుప్పిటనిడి
సొమ్మసిల్లిన ఆశయ మోమిట స్థైర్యం కుమ్మరించి
తడిసిన మైనాన్ని స్ఫటికంగా మార్చడమే ధ్యేయం!

తపన ఎందుకో!?

ధనంతో అన్నీ కొనగలం అనుకున్నప్పుడు
శ్వాసని సాంతం కొనలేక పోవడం ఏమిటో!!
కొనలేనప్పుడు ధనం పై డాబూ దర్పమేలనో
వట్టి చేతుల్తో వెళ్ళే మనకీ ప్రాకులాటెందుకో!?

అందమైన యవ్వనమే ఆకర్షణ అయినప్పుడు
చివరికి జీవితం అస్తిపంజరం అవ్వడం ఏమిటో!!
వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?

భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
నిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
ఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?

అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో!!
శ్రమని నమ్ముకోక సులువైన మార్గం వెతకడమేలనో
వెలుగూచీకటి ఒకదాని వెంట ఒకటైన చింతెందుకో!?