ప్రేమలో పట్టా...


ప్రేమ గురించి తెలుసుకుని పట్టా పుచ్చుకోవాలని
ప్రాధమిక తరగతికి వయ్యారివయసు పరిగెట్టెళితే
పరువాలని పసిడి మేని ఛాయని పైపైన చూసి
కొలతలేస్తూ దరికొచ్చి గుండెలోతు ఎంత అనడిగి
గుట్టు చప్పుడు కానీయకంటూ ఆరాలు చెప్పమని
అక్కడక్కడా తడిమినట్లుగా చూసి అప్లికేషన్ ఇచ్చె!

ప్రేమ ఓనమాలు దిద్దాలంటే ఇవి తప్పదనుకుని
అర్థమైనా కానట్లుగా వ్యంగ్యమైన ప్రశ్నలు పూరిస్తే
పైటలోని అందాల్ని తినేలా చూస్తూ గుటకలు వేసి
లేని జ్ఞానం ఉన్నట్లు మతలబు లేకుండా మాట్లాడి
శృంగారమే శ్రీకారమంటూ తెలివితేటలతో బొంకుతూ
పిటపిటలాడే పిల్ల బాగుందని పట్టుకునే ప్లాన్ వేసె!

ప్రేమ గురించి పుస్తకాల్లో చదివిన మాధుర్యమేదని
వెతకబోవ ప్రేమాక్షరాభ్యాసానికే ఇన్ని ఆటంకాలొస్తే
ఉన్నతమైన వలపుని ఎక్కడో వెతికి ఒడిసిపట్టేసి
జివ్వుమంటున్న జిజ్ఞాసలకి అందమైన రంగులద్ది
మనసునేం మభ్య పెట్టవల్సిన పనిలేదని సర్దుకుని
ప్రేమపాండిత్యంకి ప్రాక్టీస్ అవసరంలేదని వదిలేసా! 

ఏదో ఆశా..

నిరాశావేదం వదన్నకొద్దీ వెంటాడి వేదిస్తుంటే
కవ్వించే కమ్మని కల్లబొల్లి కబుర్లు ఏంచెప్పను

ఆశల అంకురార్పణకి ఆదిలోనే చెదలు పడితే 
ఆశయాలనే రెమ్మలతో పూయమని ఏంకోరను

ఆవిరైన కన్నీట పెదవులు ఆరిపోయి పగిలితే
ఆనందం ఆమడదూరంలో ఉందని ఏంచూడను

నిజాలన్నీ నిర్వికారంగా నవ్వి బేలగా చూస్తుంటే 
మంచికాలముందని అబద్ధపు భరోసా ఏమివ్వను

అక్కరకురాని ఆవేశం అదునుచూసి మరీ ఆడితే
అదుపు తప్పవద్దని అంతరంగాన్ని ఎలా ఆపను

అహర్నిశలూ ఆలోచనలతో మెదడు తపనపడితే
అద్భుతమే జరిగేనని వెర్రీఅశతో ఎదురుచూస్తాను!   

వలపుచెర

వసంతమై నీవు ఉరకలు వేస్తూ వచ్చి వాలితే
మల్లెలతోటలో కోయిలనై నేను పాడుతుంటాను!

నిండు పున్నమి వెన్నెలవై నువ్వు విరబూస్తే
చంద్ర కిరణకాంతులు విరబూసే కలువనౌతాను!

వేసవిమాటున చిరుజల్లులా నీవు వర్షిస్తానంటే 
ఏడురంగుల ఇంద్రధనస్సునై వెల్లివిప్పారుతాను!

వలపు సంగీతానికి పల్లవిగా నీవు జతకూడితే
నర్తించే మువ్వనై సరాగపు చిందులు వేస్తాను!

మమతానురాగాలను మనసువిప్పి రుచిచూపిస్తే
మనసున్న మగువగా నిన్ను చేరి మైమరిచేను!      

నీ శ్వాస ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు నేనే అన్నావంటే 
మనిరువురి ప్రేమకి ప్రాణము నేనై ఊపిరిపోస్తాను!

ఏడేడు జన్మల జతే కాదు, సర్వం నేనని పలికితే
వలపుచెర బంధీనై ప్రేమకు పర్యాయ పదమౌతాను!
  

అక్షరాభయం

ఒకమారు రెండు అక్షరాల "ప్రేమ"ని

మూడు అక్షరాల "మనసు"తో తెలుప

నాలుగు అక్షరాల "ప్రవర్తన" బయటపడి

ఐదు అక్షరాల "అనుభూతులు" మిగిల్చి

ఆరు అక్షరాల "పరాజితపాలు" చేస్తేనేమి

ఏడు అక్షరాల "అనుభవసారము" వచ్చె..

ఎనిమిది అక్షరాల "పరిజ్ఞానసామ్రాజ్యపు" పట్టాతో

తొమ్మిది అక్షరాల "ఆశలసౌధాశిఖరము" ఎక్కితే

పది అక్షరాల "పరిపూర్ణజీవితనెలవు" అగుపించె!

పరిపక్వతని పదిఅక్షరాల్లో చూసి పద్మార్పిత నవ్వ..
అక్షరం అజ్ఞానాన్ని తొలగించే అక్షయపాత్రగా వెలసె!