కన్నులతో చూసేది..


అర్పితా నీ అసలు రూపం ఏదంటే
ఎన్నని తెలిపేది ఏమని వర్ణించేది?
అస్తిత్వమైన అందచందాలను చూపి
అసలందాల్ని ఎలా అనాకారిని చేసేది!

అవయవసౌష్టవంలో అప్సరసనంటే

ఆవురుమనే ఆశతోడేళ్ళనెలా ఆపేది?
అభిమానమని పైత్యానికి ముసుగేసి
పై పైనపడి పేట్రేగితే ఎలా తట్టుకునేది!

అరమోడ్పు కళ్ళ పద్మనయనినంటే

కసిరేగిన కోర్కెల్ని ఎలా చల్లబర్చేది?
నాజూకైన నడుము వంపును చూసి
కామం పుట్ట కావరమెలా కత్తిరించేది!

అధరాలే కెంపులై అలజడి రేపెనంటే

కాదన్న నాకే కన్నుకొడితే ఏంచేసేది?
పసిడిమేను మేలి మెరుపని మురిసి
కనబడితేనే స్నేహమంటే ఎలా నమ్మేది!

మదిగదిలో...

నిన్నే తలచి నిశ్శబ్ధాన్ని కోరుకునేవేళ
విరహ సంద్రాన్ని ఆనంద భాష్పాలతోనో
కలల వర్షాన్ని కన్నీటి బిందువులతోనో
ఎడబాటుతో ఏక కాలంలో నింపేస్తావు!

తరచి తలచి మదివలపు తలపు తీసేవేళ
నా ఆయువుకి ఆశలరెక్కలు తొడుగుతూనో
ఆశలకి అందమైన కలలపాన్పు పరుస్తూనో 
శ్వాసకు గంధపు పరిమళాన్ని అద్దుతావు!

ఎద భారమై నీకై ఎదురు చూస్తున్న వేళ
నా వొంటరి కాలాన్ని నీ స్వప్న కౌగిలితోనో
అలసిన కనురెప్పలకి ఊహలరెక్కలతోనో    
వాడిన మదిపువ్వుని పునర్జీవింపజేస్తావు!

మదిదాగిన నిన్ను కంటికి పరిచయంచేయ
మదిన మహదానందమని కునుకుతీసెవు!

ప్రేమపండుగ..

విరహం తాళలేను వీడిపోకంటూ విచిత్ర విన్యాసాలతో  
వినాయక చవితినాడు విఘ్నమేలేదంటూ మొదలెట్టి
ఉన్నప్రేమ చవితిచంద్రుడి ముందు కుమ్మరించినావు!

తిరుగులేదు మనకని తిధిలేని తిరుగుబోతులా తిరిగి
రామనవమి తరువాత తాళికడతానంటూ రోజుల్లెక్కెట్టి
హోళీకి ముఖాన్న రంగులద్ది మాయతో మభ్యపెట్టావు!

నేనుంటే ప్రతీరోజూ పండుగని లేదంటే రోజు శివరాత్రని 
చలికి సరసం నేస్తమంటూ సంక్రాంతినాడు ముద్దుపెట్టి 
నాగులపంచమికి నన్నల్లుకుని నవరాత్రి దేవినన్నావు!

వలచివస్తి వరలక్ష్మీవ్రతం ఎందుకు వరమియ్యి చాలని 
దసరాకి దశతిరుగునని దరిచేరి దాసోహమై దణ్ణాలెట్టి   
మాఘమాసంలోనే ముహూర్తాల్లేవని మూగనోమట్టావు!

దీపావళి వెలుగులో దిగులు పడుతున్న నన్ను చూసి
కార్తీకపౌర్ణిమ వెన్నెలలా విరబూసి తాపాన్ని చల్లారబెట్టి
ప్రేమికులకు పండుగలతో పనేలని పొదివిపట్టుకున్నావు!

అప్రయోజనం!


మెరిసే మోజులపై మనసుపడి
అందక అలజడైన అంతరంగంలో
ఆగే భావాలు వెతకడం ఆవేశం!


మమతానురాగాలు మాయమైన
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత వెతకడం అనవసరం!


అలసినానన్న అస్తిత్వాన్ని దాచి
అలిగిన అమాయకపు ఊహలలో
జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం!


జ్ఞానం ఇచ్చిన పుడమిని విడిచి
జీవం లేని రాతికట్టడ నగరాలలో
ఆశల దారులు వెతకడం అవివేకం!


సాంప్రదాయపు సంకెళ్లను త్రుంచి
కొత్త ఫ్యాషన్ ప్రవాహపు మత్తులో
సహజత్వాన్ని వెతకడం అజ్ఞానం!

స్వగతం..

తనని తాను అభివర్ణించుకునే ప్రక్రియలో
తెలియకుండా కప్పెడుతున్న లోపాలెన్నో

ఊపిరి గతులని శిల్పంగా మార్చే పనిలో
ప్రజ్వరిల్లలేక ప్రకంపిస్తున్న వాస్తవికతలెన్నో

పత్రంపై వొలకలేక బెట్టుచేసే తాపత్రయంలో
లోన దాగిన తన్మయత్వపు ప్రకంపనలెన్నో

భావ తృష్ణకి భాష్యం నేర్పే కుతూహలంలో
మౌనంగా కరిగిపోతున్న రహస్యజడులెన్నో

లేని రాచరికం చూపే అడుగుల సవ్వడిలో
పగిలిన పాదాలు చూపలేకున్న మరకలెన్నో

తడారిన తపనను చిగురింపచేసే ఆరాటంలో
స్థానభ్రంశం అయిపోతున్న అంకురార్పణలెన్నో

నిజాలని దాచాలన్న నిరంతర ప్రయత్నంలో
నీడా తోడు రాక మారిన నైసర్గిక రూపాలెన్నో!