ఏమిటిది!?

మధుర జీవితమే దరిచేరి తీయగా నన్ను తాకి  
క్షణక్షణం మదికి మరింత దగ్గర అవుతానన్నది!

సంధ్యవేళ నీ ఊసులేమో వింజామరలుగా వీస్తూ
రాత్రివేళ జ్ఞాపకాలను ఊరేగింపుగా తెస్తానంటుంది!

ఊపిరితీసి వదలబోవ నీ పరిమళం నన్ను చుట్టేసి
పులకరింతల కబురై వచ్చి గిలిగింతలు పెడుతుంది!

నా ఎద ప్రాంగణం అంతా నీవు పెనవేసి వీణ మీట  
హృదయసవ్వడేమో నీ మాటల్ని పాట పాడుతుంది!

ఎందుకు ఈ అసంకల్పిత అవినాభావాలు అనుకుంటే
వెర్రిదానా వలపని నీ వలపు నన్ను కౌగిలించుకుంది!

వలపు మంట మోజు ఏమిటో రుచి చూసి చెప్పబోతే
నీ విరహంలో నేను కాలుతూ నిన్ను కాల్చ వద్దంది!
 
ఇది భ్రాంతా లేక బంధమా అనుకును మీమాంసలో
ఆలోచనలన్నీ నువ్వు నా సొంతమని ధృవీకరిస్తుంది!

నిర్లిప్త పయనం..

ఇదేమి ప్రయాసా పోరాటమో తెలియకున్నది
స్వప్నాలు నిజం చేసుకోవాలన్న ప్రాకులాటలో
సీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి
తన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది!

తన నిశ్చింతని వదలి సుఖాలను అన్వేషిస్తూ 
ఆలోచనలే ఊపిరిగా చేసుకుని నిశ్శబ్ధ హోరులో
గుండె చేసే చిన్న ధ్వనికి సైతం బెదిరి తృళ్ళిపడి    
కళ్ళ నుండి జారుతున్న మౌనరాగం వింటుంది! 

తన భావలు బయటపడలేక రాక శ్వాసలో ఆగి
తనకైన గాయాలు ఎవరికీ కనబడనీయక దాచి 
ముందు చూపంటూ ఏమీ లేక వెలుగు కానరాక  
నీడనే నేస్తంగా చేసుకుని నలుగురితో నడుస్తుంది!

జీవన పజిల్

జీవితం ఒక రంగుల రూబిక్స్ క్యూబని తెలిసె
చెల్లాచెదురుగా పడున్న రంగుల చతురస్రాలని
వరుసక్రమంలో ఆకర్షించేలా సర్దబోవ అనిపించె
చూస్తే ఇంపుగా ఉండి ఆడుకునే ఒక పజిలని
అటుదిటు తిప్పి సరిచేస్తే అన్నీ ముక్కలేనని!

జీవితాన్ని మక్కువతో మొక్కి కొనసాగితే తెలిసె
ఒకేరంగున్న ఘనాలైన ఒక్కచోట కలిసుండవని
చూడబోవ త్రిమితీయ రూపాలతో తికమక పెట్టి
పారాహుషార్ అంటూ సంకేతాలు అందిస్తాయని
చదువబోతే అన్నీ అర్థంకాని కోడ్ భాషాక్షరాలని!

జీవితంలో సమస్యలు స్పష్టంగా కనబడితే తెలిసె
బ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనమని
జనాలు ఎదుగుతుంటే నాలుగు రాళ్ళురువ్వి నవ్వి
వీలుకుదిరితే క్రిందకు దించే ప్రయత్నమే చేస్తారని
కష్టాలని కాలితో తన్నితే జీవితం కుదుటపడునని!